Abn logo
Apr 21 2021 @ 11:31AM

ఈ ప్రభుత్వం ఐఎస్ఐతో మాట్లాడగలదు కానీ... : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ : ప్రతిపక్షాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఎండగట్టారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్)తో కేంద్ర ప్రభుత్వం మాట్లాడగలదు కానీ దేశంలోని ప్రతిపక్ష పార్టీల  నేతలతో మాట్లాడదని దుయ్యబట్టారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం గురించి ప్రతిపక్ష నేతలతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు. 


ప్రియాంక గాంధీ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో మాట్లాడగలదన్నారు. కేంద్ర ప్రభుత్వం దుబాయ్‌లో ఐఎస్ఐతో మాట్లాడుతోందన్నారు. అలాంటపుడు ప్రతిపక్ష నేతలతో మాట్లాడలేరా? అని ప్రశ్నించారు. నిర్మాణాత్మక, సకారాత్మక సలహాలు ఇవ్వని ప్రతిపక్ష నేత ఉంటారని తాను భావించడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలతో మాట్లాడితే నిర్మాణాత్మక, సకారాత్మక సలహాలు ఇస్తారని చెప్పారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రజా సంబంధాల విన్యాసాలను మానుకోవాలని ప్రియాంక గాంధీ అన్నారు. కోవిడ్-19  మహమ్మారి సృష్టించిన సంక్షోభంపై ప్రతిపక్ష పార్టీలతోనూ, ప్రజలతోనూ మాట్లాడాలన్నారు. నిర్మాణాత్మక, సకారాత్మక సలహాలు ఇవ్వని రాజకీయ నేతలు ఉంటారని తాను భావించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ పని అయినా చర్చల ద్వారా మాత్రమే ముందుకు వెళ్తుందన్నారు. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో విమర్శలను కూడా వినాలన్నారు.


నువ్వా-నేనా? అనే ధోరణ ఎవరికీ తగదని హితవు పలికారు. ప్రజలకు మద్దతుగా ప్రధాన మంత్రి నిలబడాలన్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలను కూడా కలుపుకొనిపోవాలని, మనమంతా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు గళమెత్తకపోతే, ఇక ఎవరు మాట్లాడతారని ప్రశ్నించారు. 


మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా పదేళ్ళు పని చేశారని, ఆయన ఎంత హుందాగా వ్యవహరించారో అందరికీ తెలుసునని చెప్పారు. ఆయన ఇచ్చిన సలహాను హుందాగా స్వీకరించాలని కోరారు. 


మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం ప్రధాని మోదీకి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ ఎందరికి జరిగిందనేదానిపై దృష్టి పెట్టకుండా, జనాభాలో ఎంత శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందనేదానిపై దృష్టి పెట్టాలని ఈ లేఖలో మన్మోహన్ సింగ్ కోరారు.


Advertisement
Advertisement
Advertisement