Abn logo
Apr 17 2021 @ 00:29AM

ఈ స్నేహం...కలకాలం

స్నేహంలోని మాధుర్యం అనుభవిస్తే గానీ తెలియదు. ఆనందం ఉప్పొంగేటప్పుడే కాదు... ఒంటరి ప్రయాణంలో... ఓటమి ఆవేదనలో తోడుండే స్నేహానికి నిజమైన రూపం... అలనాటి బాలీవుడ్‌ తారలు వహీదా రెహమాన్‌, ఆశా పరేఖ్‌, హెలెన్‌లు! వీరిది దశాబ్దాల అనుబంధం. అరమరికలు లేని అపరిమిత ప్రయాణం. వ్యక్తులుగా వేరైనా... మనసులు ఒక్కటే. వయసుతో నిమిత్తం లేకుండా జీవితంలో ప్రతి క్షణాన్నీ కలిసి ఆస్వాదించడంలో వారి తరువాతే ఎవరైనా! సినీ జగత్తులో స్నేహాలు కొత్తేమీ కాదు కానీ, వీరిలా... తోబుట్టువుల్లా సుదీర్ఘ కాలం కొనసాగడమంటే విశేషమే! 

ఇటీవల ఈ మగ్గురు మిత్రలూ కలిసి అండమాన్‌ దీవుల్లో విహార యాత్రకు వెళ్లారు. అక్కడి సాగర తీరాల్లో... అలల హొయల్లో... ఉల్లాసంగా గడిపారు. ముగ్గురిదీ దాదాపు ఒకటే వయసు... ఎనిమిది పదులకు అటూ ఇటూ! అయితేనేం... ఆ ఉత్సాహం ఇంకా అలానే ఉంది. మనసుకు దగ్గరైన మిత్రులు పక్కనుంటే వయసనేది ఓ అంకే కానీ... తమలో ఉరకలు వేసే ఊహలకు కళ్లెం వేయలేదని చెప్పకనే చెప్పారు. అండమాన్‌ దీవుల్లో ఓ సాయంత్రం వేళ వారి ఆనంద కేళిని ‘క్లిక్‌’మనిపించి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేశారు ఒకప్పటి డిజైనర్‌, రాజకీయ నాయకురాలు షైనా ఎన్‌సీ. ఆ ఫొటోకు ‘వండర్‌ ఉమెన్‌’ అనే క్యాప్షన్‌ పెట్టి, ముగ్గురు మిత్రుల బంధాన్ని మరోసారి ప్రపంచానికి చూపించారు. ఇప్పుడా ఫొటో అన్ని మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. వహీదా, ఆశా, హెలెన్‌ల స్నేహం గురించి గొప్పగా చెప్పుకుంటోంది. 


ఇక వహీదా రెహమాన్‌ అయితే తన కూతురు కష్వి రేఖితో కలిసి అండమాన్‌లోని హావ్‌లాక్‌ ద్వీపంలో స్నార్కెలింగ్‌ చేసి, తన చిరకాల కోర్కె తీర్చుకున్నారు. 83 ఏళ్ల వయసులో వహీదా సాహసానికి అభిమానులు వహ్వా అంటున్నారు. అందం, అభినయంతో నాడు వెండితెర ఇలవేల్పులుగా వెలిగిన ఈ ముగ్గురు మిత్రులు... పండుగలు, శుభకార్యాలు... సందర్భం ఏదైనా తరచూ కలిసి కనిపిస్తుంటారు. 

మాధురీతో కలిసి స్టెప్పులు

ఇటీవల నిన్నటి తరం బాలీవుడ్‌ స్టార్‌ మాధురీ దీక్షిత్‌ రియాలిటీ షో ‘డ్యాన్స్‌ దీవానే’లో వహీదా, ఆశా, హెలెన్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆశా పరేఖ్‌ చిత్రంలోని ‘అచ్చా తో హమ్‌ చల్‌తే హై’ పాటకు మాధురితో కలిసి స్టెప్పులు వేసి వీక్షకులను అలరించారు. ఈ సందర్భంగా ఆశా పరేఖ్‌ తమ స్నేహం గురించి... ‘‘వహీదా, హెలెన్‌, నేను... షమ్మీ కపూర్‌తో కలిసి బోల్డంత గోల చేసేవాళ్లం. ఖాళీ సమయాల్లో డిన్నర్‌కు వెళ్లేవాళ్లం. సినిమాలు చూసేవాళ్లం. షూటింగ్‌లతో ఎవరికి వారు ఎంత బిజీగా ఉన్నా... మేమంతా కలవడానికి కొంత సమయం కేటాయించేవాళ్లం. ఆ నాటి నుంచి మా స్నేహం రోజు రోజుకూ బలపడుతూ వచ్చింది. వహీదా, హెలెన్‌, నేను... ఇప్పటికీ నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. కలిసి డిన్నర్‌ చేస్తాం. సినిమాలు ఆస్వాదిస్తాం. గత ఏడాది మేం ముగ్గురం కలిసి క్రూజ్‌లో ఇస్తాంబుల్‌ కూడా వెళ్లాం. వేర్వేరుగా కాకుండా ఒకటే రూమ్‌ షేర్‌ చేసుకున్నాం’’ అంటూ ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. 

 

కానీ ఇప్పటి నటీమణుల మధ్య అలాంటి స్నేహ వాతావరణం కనిపించడంలేదనేది ఆశా పరేఖ్‌ అభిప్రాయం. చిన్న చిన్న గొడవలతో గాసిప్‌లకు గ్రాసం ఇస్తున్నారన్నది ఆమె ఆవేదన. షూటింగ్‌ సజావుగా సాగిపోయేందుకు నాడు సెట్‌లో తారలు సఖ్యతగా మెలగడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని ఓ సందర్భంలో ఆశా పరేఖ్‌ అన్నారట!

Advertisement
Advertisement
Advertisement