ఆండ్రాయిడ్‌.. వీటితో అదుర్స్‌!

ABN , First Publish Date - 2020-07-25T05:30:00+05:30 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో అంతర్గతంగా అనేక శక్తిమంతమైన సెట్టింగ్స్‌ ఉంటాయి. వాటి గురించి కొద్దిగా అవగాహన ఉంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు...

ఆండ్రాయిడ్‌.. వీటితో అదుర్స్‌!

  • ఆండ్రాయిడ్‌ ఫోన్లలో అంతర్గతంగా అనేక శక్తిమంతమైన సెట్టింగ్స్‌ ఉంటాయి.
  • వాటి గురించి కొద్దిగా అవగాహన ఉంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. 
  • తరచూ ఎదురయ్యే కొన్ని సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు.
  • అలాంటి కొన్ని సెట్టింగ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇతరులకు ఫోన్‌ ఇచ్చేటప్పుడు...

ఏవైనా ఫోటోలు చూపించడం కోసం గ్యాలరీ అప్లికేషన్‌ ఓపెన్‌ చేసి స్నేహితుల చేతికి ఫోన్‌ ఇస్తూ ఉంటాం. కొద్దిగా పద్ధతులు తెలిసిన వారైతే వాటి వరకు చూసి ఫోన్‌ మళ్లీ మన చేతికి ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది మనం చూపించే ఫోటోలు చూసిన తర్వాత వాట్సప్‌, కాల్‌ లాగ్స్‌, కాంటాక్ట్స్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ వంటి ఇతర అప్లికేషన్స్‌ కూడా ఓపెన్‌ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ చేతి నుంచి  ఫోన్‌ లాక్కోవటం బాగుండదు. అలాంటప్పుడు పనికొచ్చేదే ‘స్ర్కీన్‌ పిన్నింగ్‌’ అనే ఆండ్రాయిడ్‌ సదుపాయం. మీ ఫోన్‌లో  Settings>Security>Screen Pinning అనే ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే చాలు. ఇకమీదట ఎవరికైనా ఫొటోలు చూడడం కోసం ఫోన్‌ ఇవ్వాల్సి వచ్చినప్పుడు గ్యాలరీ అప్లికేషన్‌ ఓపెన్‌ చేసి, రీసెంట్‌ మెనూలో దాని ఎంట్రీ దగ్గర కొత్తగా వచ్చే ‘పిన్‌’ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే చాలు. ఆ ఒక్క అప్లికేషన్‌ మాత్రమే స్ర్కీన్‌పై కన్పిస్తుంది. మీ స్నేహితులు ఇతర యాప్స్‌కి వెళ్లడానికి ప్రయత్నించినా కూడా పాస్‌వర్డ్‌ టైప్‌ చేయాల్సి ఉంటుంది.


డీఫాల్ట్‌ యాప్స్‌ ఇలా...

ఒకే రకమైన పనులు చేసి పెట్టడానికి మీ ఫోన్‌లో అనేక అప్లికేషన్స్‌ ఉండొచ్చు. ఉదాహరణకు ఒక ఫోటోనుగానీ, వీడియోని గానీ ఓపెన్‌ చేసేటప్పుడు అప్పటికే మీ ఫోన్‌లో ఒకటి కన్నా ఎక్కువ సంబంధిత ఫైళ్లను హ్యాండిల్‌ చేయగలిగిన అప్లికేషన్స్‌ లభిస్తూ ఉన్నట్లయితే, దేని ద్వారా ఓపెన్‌ చేయాలి అని కొన్నిసార్లు అడుగుతూ ఉంటుంది కదా! ఈ నేపథ్యంలో ఒక నిర్దిష్టమైన ఫైల్‌ టైప్‌కి మీరు ఇప్పటికే వాడుతున్న యాప్స్‌కి బదులు ఇతర యాప్స్‌ వాడాలంటే ఆ సెట్టింగ్స్‌ మార్చుకోవడం చాలా సులభం. మీ ఆండ్రాయిడ్‌ ఫోన్లో Settings>Apps  అనే విభాగంలోకి వెళ్లి Default అనే ఆప్షన్‌లో వివిధ రకాల పనుల కోసం ఏయే అప్లికేషన్స్‌ డిఫతాల్ట్‌గా వాడాలి అన్నది ఎంపిక చేసుకోండి. ఉదాహరణకు మెయిల్స్‌ కోసం జీమెయిల్‌, వెబ్‌ బ్రౌజింగ్‌ కోసం గూగుల్‌ క్రోమ్‌, ఫొటోలను ఎడిట్‌ చేయడానికి ఇతర యాప్స్‌... ఇలా మీకు నచ్చినట్లు అమర్చుకోవచ్చు. ఇక మీదట ఆ సంబంధిత ఫైల్స్‌ మీరు ఎంపిక చేసుకున్న అప్లికేషన్స్‌తో మాత్రమే ఓపెన్‌ అవుతాయి.


వై - ఫై ఆటోమేటిక్‌గా... 

ఇంట్లో ఉంటే వై-ఫై ఉపయోగిస్తాం. బయటకు వెళ్లినప్పుడు మొబైల్‌ డేటా వాడుతూ ఉంటాం కాబట్టి వై-ఫైని నిలుపుదల చేయడం ద్వారా పెద్ద మొత్తంలో బ్యాటరీ ఆదా చేసుకోవచ్చు. అయితే చీటికీ మాటికీ వై-ఫై ఆన్‌, ఆఫ్‌ చెయ్యడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక అద్భుతమైన ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. మీరు తరచూ కనెక్ట్‌ అయ్యే ఇంటిలోని, ఆఫీస్‌లోని వై-ఫై నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్నప్పుడు మాత్రమే వై-ఫై ఆటోమేటిక్‌గా ఆన్‌ అయి, మిగిలిన సందర్భాలలో దానంతట అదే నిలిచిపోయే విధంగా కాన్ఫిగర్‌ చేయడం మేలు. దీనికోసం మీ ఫోన్‌ సెట్టింగ్స్‌లో Network  Internet అనే విభాగంలో Wi-Fi> Wi-Fi preferences అనే విభాగంలోకి వెళ్లి Turn on Wi-Fi automatically అనే ఆప్షన్‌ ఎంపిక చేసుకోండి.


ఒకే స్ర్కీన్‌లో రెండు యాప్స్‌

కొన్నిసార్లు ఒకేసారి రెండు అప్లికేషన్స్‌ ఓపెన్‌ చేసి పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. విండోస్‌ కంప్యూటర్‌లో అయితే Aero Snap వంటి సదుపాయం ద్వారా స్ర్కీన్‌ మీద మనకు కావాల్సిన విండోలు అమర్చుకోవచ్చు. కానీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో అలా ఎలా చేయాలో చాలామందికి అవగాహన ఉండదు. ఇటీవలి కాలంలో దాదాపు అన్ని ఫోన్లు మల్టీ విండో ఫీచర్‌ని అందిస్తున్నాయి. దీనికి మీరు చేయవలసిందల్లా చాలా సులభం. Recent Apps  బటన్‌ ట్యాప్‌ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు ఓపెన్‌ చేసిన అప్లికేషన్స్‌ జాబితా కనిపిస్తుంది కదా. అందులో మొదట మీకు కావలసిన ఒక అప్లికేషన్‌ గుర్తించి దాని ఐకాన్‌ మీద క్లిక్‌ చేయండి. వెంటనే స్ర్కీన్‌ మీద అనేక ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో Open in split screen view అనే ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. దాంతో ఆ అప్లికేషన్‌ స్ర్కీన్‌ పై భాగంలో సగానికి వస్తుంది. ఇప్పుడు మీకు కావాల్సిన మరో అప్లికేషన్‌ ఎంపిక చేసుకుంటే మిగిలిన సగభాగంలో ఆ రెండో అప్లికేషన్‌ వస్తుంది.


అక్షరాలు మరీ చిన్నగా ఉంటే...

ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడే చాలామంది తమ స్ర్కీన్‌ మీద అక్షరాలు ఎంత పరిమాణంలో కనిపిస్తే అంత పరిమాణంతో సర్దుకుపోతూ ఉంటారు. వాస్తవానికి మీకు చిన్న అక్షరాలు కనిపించడం విషయంలో ఇబ్బంది ఉంటే మీ ఫోన్‌లో ఫాంట్‌ సైజు పెంచుకోవడం ద్వారా ఆ సమస్యను సరిచేసుకోవచ్చు. అంతే తప్పించి చిన్న అక్షరాలతో సర్దుకుపోయి అలాగే చదువుతూ ఉంటే దృష్టి పరమైన ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఫోన్‌లో ఫాంట్‌ సైజు పెంచుకోవడం కోసం Settings> Display>Advanced అనే ఒక ఆప్షన్‌ ఉంటుంది. అక్కడ మీకు సౌకర్యవంతంగా ఉన్న ఫాంట్‌ సైజ్‌ సెలెక్ట్‌ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన ఫాంట్‌ కూడా మార్పిడి చేసుకోవచ్చు.


కొత్త అప్లికేషన్లు హోమ్‌ స్ర్కీన్‌లోకి రాకుండా!

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి మీరు కొత్తగా ఏదైనా అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసిన వెంటనే దానికి సంబంధించిన షార్ట్‌కట్‌ మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ హోమ్‌ స్ర్కీన్‌లోకి దానంతట అదే వచ్చేస్తూ ఉంటుంది. అయితే ముఖ్యమైన అప్లికేషన్స్‌ ఇక్కడ అందుబాటులో ఉంటే బాగానే ఉంటుంది కానీ, ప్రతి అప్లికేషన్‌ ఇక్కడ షార్ట్‌కట్‌ సృష్టించడం వల్ల గందరగోళంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడం కోసం ఒక చిన్న సెట్టింగ్‌ చేసుకుంటే సరిపోతుంది. మీ ఫోన్‌ హోమ్‌ స్ర్కీన్‌లో లాంగ్‌ ట్యాప్‌ చేసిన వెంటనే స్ర్కీన్‌ మీద కొన్ని ఆప్షన్స్‌ వస్తాయి. అందులో Home Screen Settings అనే దానిలోకి వెళ్లి Add Apps to Home Screen అనే ఆప్షన్‌ డిజేబుల్‌ చేస్తే సరిపోతుంది.


-నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar


Updated Date - 2020-07-25T05:30:00+05:30 IST