6 నెలల క్రితమే 100 కోట్ల వ్యాక్సినేషన్ జరిగి ఉండాల్సింది : శిశోడియా

ABN , First Publish Date - 2021-10-22T21:12:44+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసి ఉంటే, వ్యాక్సిన్లను

6 నెలల క్రితమే 100 కోట్ల వ్యాక్సినేషన్ జరిగి ఉండాల్సింది : శిశోడియా

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసి ఉంటే, వ్యాక్సిన్లను ఎగుమతి చేసి ఉండకపోతే, కోవిడ్-19 టీకాకరణ 100 కోట్ల మోతాదుల పంపిణీ ఘనత ఆరు నెలల క్రితమే సాధ్యమై ఉండేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం శిశోడియా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 


శిశోడియా శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటినందుకు సంబరాలు చేసుకుంటూనే, మనం ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో సరైన ఏర్పాట్లు చేసి ఉంటే, భారత దేశం వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో టీకా మోతాదులను ఎగుమతి చేయడం వంటి ప్రజా సంబంధాల కార్యకలాపాలు నిర్వహించి ఉండకపోతే, దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ టీమ్స్ ఆరు నెలల క్రితమే ఈ మైలురాయిని అధిగమించి ఉండేవని తెలిపారు. 


వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి అక్టోబరు 21 ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల మోతాదులను ప్రజలకు ఇచ్చి, చరిత్ర సృష్టించినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వ్యాక్సినేషన్ విజయవంతమవడానికి కారణం భారత ప్రజలేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తెలిపారు. 


Updated Date - 2021-10-22T21:12:44+05:30 IST