ఈ గమ్యం అందంగా ఉంది!

ABN , First Publish Date - 2020-12-17T06:56:05+05:30 IST

‘నేలకూ, పక్షులకూ, ఇతర జీవాలకూ హాని చెయ్యని వ్యవసాయ పద్ధతులే పర్యావరణానికీ, మనకూ శ్రీరామరక్ష

ఈ గమ్యం అందంగా ఉంది!

‘నేలకూ, పక్షులకూ, ఇతర జీవాలకూ హాని చెయ్యని వ్యవసాయ పద్ధతులే పర్యావరణానికీ, మనకూ శ్రీరామరక్ష’ అంటారు కవితా మిశ్రా.శ్రీగంధం, పండ్ల తోటల పెంపకంలో ఆదర్శ రైతుగా గుర్తింపు పొందిన ఆమె ఇక్రిశాట్‌ నుంచి ‘గోల్డ్‌ అవార్డ్‌’తో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. సాగులో సేంద్రియ పద్ధతుల్ని అనుసరిస్తూ ఎందరో ఔత్సాహిక  రైతులకు మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారు. 


‘‘నేను పుట్టింది వ్యవసాయ కుటుంబంలోనే. అయితే నాకు పొలం పనుల కన్నా సాఫ్ట్‌వేర్‌ ప్రాగ్రామింగ్‌ అంటేనే ఎక్కువ ఇష్టం. కానీ ఆ కెరీర్‌ను వదులుకోవాల్సి వచ్చింది. వేరే మార్గం లేక వ్యవసాయానికి సిద్ధపడ్డాను’’ అంటున్న కవిత మిశ్రా స్వస్థలం కర్ణాటకలోని రాయచూర్‌. ఇంజనీరింగ్‌తోపాటు ఎంఎ సైకాలజీ కూడా చేసిన కవితకు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె ఉద్యోగం చెయ్యడానికి ఆమె భర్త ఉమాశంకర్‌ ఒప్పుకోలేదు. ఆయన కుటుంబంలో అందరూ వ్యవసాయం చేస్తూ ఉంటారు. కవిత కూడా అదే కొనసాగించాలని ఆయన పట్టుపట్టారు. ఉమాశంకర్‌కు నలభై మూడు ఎకరాల భూమి ఉంది. దానిలో ఎనిమిది ఎకరాలను ప్రత్యేకంగా కవిత కోసం ఆయన కేటాయించారు.


‘‘నాకంటూ ప్రత్యేకంగా కొంత భూమి ఉంటే వ్యవసాయం మీద ఆసక్తి, నన్ను నేను నిరూపించుకోవాలన్న ఆకాంక్ష పెరుగుతాయని ఆయన అనుకున్నారు. చాలా మంది మహిళల్లాగానే... పెళ్ళయిన తరువాత ఎన్నో కలలతో అత్తవారి ఇంటికి వచ్చాను. కానీ మంచి కంపెనీలో ఉద్యోగం చెయ్యాలన్న నా కల నెరవేరకుండా పోతుందని ఎప్పుడూ అనుకోలేదు’’ అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నారు కవిత.


పుట్టింటి వారిచ్చిన నగలు అమ్మేసి...

ఆమెకు భర్త కేటాయించినది బంజరు భూమి. దాన్ని ఏం చెయ్యాలో తెలియక ఆమె ఎంతో గందరగోళానికి గురయ్యారు. ఎవరి సాయం లేకుండా వ్యవసాయంలో తనను తాను నిరూపించుకోవాలన్న పట్టుదల అప్పుడే ఆమెకు కలిగింది. పుట్టింటివాళ్ళు ఇచ్చిన నగలను అమ్మేసి, పెట్టుబడి సమకూర్చుకున్నారు. భూమి మొత్తాన్ని స్వయంగా శుభ్రం చేసుకున్నారు. పుస్తకాలు చదివి, కుటుంబ సభ్యులతో, స్థానిక రైతులతో మాట్లాడిన తరువాత పండ్ల తోటలకు ఆ నేల అనువుగా ఉంటుందని తెలుసుకున్నారు.


తొలి ప్రయత్నంగా దానిమ్మ మొక్కలు వేశారు. వాటిని పెంచడానికి ఎంతో కష్టపడ్డారు. ఆమె శ్రమ ఫలితాన్నిచ్చింది. మంచి లాభం చేతికొచ్చింది. ఆ తరువాత మరింత లాభసాటి అయిన శ్రీగంధం చెట్ల సాగు వైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఆమె తోటలో 2,200 వరకూ శ్రీగంధం చెట్లతో పాటు ఎనిమిదివేలకు పైగా పండ్ల మొక్కలు, ఎనిమిది వందల టేకు మొక్కలూ ఉన్నాయి. సీతాఫలం, మామిడి, జామ, ఉసిరి, మునగ, కొబ్బరి, దానిమ్మ, నిమ్మ, కరివేప, బత్తాయి, మల్లె, పసుపు, కాఫీ, సపోటా, అరటి. పసుపు, మిరియాలను ఆమె సాగు చేస్తున్నారు. కర్ణాటకలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆమె మొక్కలను సరఫరా చేస్తున్నారు.  


పూర్తిగా ఆ పద్ధతుల్లోనే...

‘‘వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చుకోవచ్చో ఎందరో నిపుణులను అడిగి తెలుసుకున్నాను. ఎన్నో పుస్తకాలు చదివాను. మొదటి నుంచీ సేంద్రియ పద్ధతుల్లో సాగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చాను. క్రమంగా పండ్ల తోటల పెంపకంలో, అటవీ మొక్కల పెంపకంలో అనుభవం వచ్చింది. అప్పటి నుంచీ ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందనేది నా విశ్వాసం. ఎరువులుగా గోమూత్రాన్నీ, మేకల వ్యర్థాలనూ ఉపయోగిస్తాను.


పొలాల్లో పక్షులూ, పాములూ ఉంటాయి. వాటికి ఇబ్బంది కలిగించకపోతే అవి మనకు హాని చెయ్యవు. కీటకాలనూ, ఎలుకలనూ అవి పొలంలోకి రానివ్వవు. దీనివల్ల పురుగుల మందులు వెయ్యనవసరం లేదు. మా తోటల్లో చెట్ల మీద ఎన్నో పక్షులు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. వాటికి ఎలాంటి ఇబ్బందీ కలిగించకూడదని మా పనివారికీ, సందర్శకులకూ గట్టి సూచనలు ఇస్తూ ఉంటాను’’ అని చెబుతారామె. 


‘‘శ్రీగంధం సాగులో అతి పెద్ద సమస్య దొంగతనాలు. ఈ చెట్లను నరకి, తరలించుకుపోవడానికి దొంగలు, స్మగ్లర్లు కాచుకొని ఉంటారు. మొదట్లో వీటికి కాపలా కాయడానికి చాలా కష్టపడ్డాం. ఈ మధ్యే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఒక మైక్రోచిప్‌ను రూపొందించింది. వాటిని ఈ చెట్లకు అమర్చితే ఎక్కడి నుంచయినా చెట్లను పర్యవేక్షించవచ్చు. అలాగే మా తోట మొత్తంలో ఎనిమిది శునకాలు కూడా నిరంతరం పహారా కాస్తూ ఉంటాయి’’ అని వివరించారు కవిత.


సాగులో మెలకువలు చెబుతా...

ఇప్పుడు దేశంలో అత్యంత విజయవంతమైన శ్రీగంధం రైతుల్లో ఆమె ఒకరు. సమగ్రమైన సాగు పద్ధతులను అమలు చేస్తున్న కవితకు అనేక పురస్కారాలు కూడా లభించాయి. యుఎఎస్‌ రాయచూర్‌ నుంచి ఉత్తమ రైతు పురస్కారం, ఇక్రిశాట్‌ నుంచి ‘గోల్డ్‌ అవార్డ్‌’, ‘నేషనల్‌ ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌’, ‘బెస్ట్‌ హార్టికల్చర్‌ ఫార్మర్‌ ’అవార్డ్‌ వీటిలో కొన్ని. అలాగే బీదర్‌ వెటర్నరీ విశ్వవిద్యాలయం సిండికేట్‌ సభ్యురాలిగా కూడా ఆమె ఎంపికయ్యారు. కర్ణాటక సోప్స్‌ అండ్‌ డిటర్జెంట్స్‌ లిమిటెడ్‌ శ్రీగంధం, ఎర్ర చందనం సరఫరా కోసం ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది.


ప్రస్తుతం పది మంది మహిళలతో సహా పన్నెండుమంది ఆమె తోటల్లో పని చేస్తున్నారు. అనేకమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ‘‘తోటల ద్వారా నెలకు ఇరవై నుంచి ముప్ఫై లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. మా ఉత్పత్తులను  హైదరాబాద్‌-గోవా మార్గంలో పది పదిహేను రోజులకు ఒకసారి స్టాల్‌ ఏర్పాటు చేసి విక్రయిస్తాం. రాయచూర్‌ జిల్లాలోని కౌత్వాల్‌ గ్రామంలో ఉన్న  పొలం ముందు కూడా ఒక స్టాల్‌ ఏర్పాటు చేశాం. మరోవైపు రైతులకు పండ్ల మొక్కల అంట్లు అమ్ముతూ ఉంటాం. ఔత్సాహిక రైతులు మా తోటల్ని సందర్శిస్తూ ఉంటారు. వారికి సాగులో మెలకువలు చెబుతూ ఉంటాను. జీవితం నన్ను కొత్త దారిలోకి మళ్ళించింది. అయితే నేను ఇప్పుడు చేరుకున్న ఈ గమ్యం చాలా అందంగా అనిపిస్తోంది’’ అంటున్నారామె. ఫ






తోటల ద్వారా నెలకు ఇరవై నుంచి ముప్ఫై లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. మా ఉత్పత్తులను  హైదరాబాద్‌-గోవా మార్గంలో పది పదిహేను రోజులకు ఒకసారి స్టాల్‌ ఏర్పాటు చేసి విక్రయిస్తాం.

ఔత్సాహిక రైతులు మా తోటల్ని సందర్శిస్తూ ఉంటారు. వారికి సాగులో మెలకువలు చెబుతూ ఉంటాను.

Updated Date - 2020-12-17T06:56:05+05:30 IST