ఈ చలాన్‌.. పరేషాన్‌!

ABN , First Publish Date - 2022-05-12T05:01:30+05:30 IST

ప్రతిరోజూ ఏదో ఒక పని మీద కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణ ప్రాంతాలకు వివిధ మండలాల్లోని గ్రామాల నుంచి నిత్యం వేలాది వాహనాలు నియోజకవర్గ కేంద్రాలకు వచ్చిపోతుంటాయి.

ఈ చలాన్‌.. పరేషాన్‌!
పార్కింగ్‌ స్థలాలు లేక రోడ్లపై పార్కింగ్‌ చేసిన వాహనాలు(ఫైల్‌)

- పట్టణానికి వస్తే నిబంధనల పేరిట జరిమానా

- పార్కింగ్‌ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు

- సెల్లార్‌లలో నిర్మాణాలు చేపట్టడంతో రోడ్డపైనే పార్కింగ్‌

- నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ చేశారంటూ పోలీసుల చర్యలు

- మున్సిపల్‌ అధికారుల అలసత్వం వాహనదారులకు శాపం


కామారెడ్డి టౌన్‌, మే 11: ప్రతిరోజూ ఏదో ఒక పని మీద కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణ ప్రాంతాలకు వివిధ మండలాల్లోని గ్రామాల నుంచి నిత్యం వేలాది వాహనాలు నియోజకవర్గ కేంద్రాలకు వచ్చిపోతుంటాయి. వీరిలో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతికి చెందిన రైతులు, ప్రభుత్వ, ప్రైవేట్‌, ఉద్యోగ, వ్యాపారులు, కూలీలు, కార్మికులు ఉంటున్నారు. పట్టణాల్లోని మెడికల్‌, ఎరువుల దుకాణాలు, బోరు మోటార్లు, గొట్టాలు, బ్యాంకులు, కిరాణ దుకాణాలు, వస్త్ర వ్యాపార సముదాయాలు ప్రధాన రహదారుల వెంట ఉన్నాయి. వీటిలో చాలా వరకు పార్కింగ్‌ స్థలాలు లేవు. కొన్నిచోట్ల ఉన్నప్పటికీ రహదారుల్ని ఆనుకుని ఉన్నాయి. వాహనాలు ఎక్కువ సంఖ్యలో వస్తే రహదారిపై నిలిపి ఉంచాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ చేశారంటూ పోలీసులు ఫొటోలు తీసి ఈ చలాన్‌లు పంపుతుండడంతో  ప్రజలు బెంబేలెత్తుతున్నారు. హెల్మెట్‌, లైసెన్స్‌, ట్రిబుల్‌ రైడింగ్‌ చేసే వారికి చలాన్‌లు వేస్తూ వారిలో మార్పులు తీసుకురావడం బాగానే ఉన్నా అసలు పార్కింగ్‌ స్థలాలు లేకుండా చలాన్‌లు వేయడం పైనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు నిబంధనలు అత్రికమిస్తూ సెల్లార్‌లలో నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోని అధికారులు తమకు మాత్రం రాంగ్‌ పార్కింగ్‌ పేరుతో చలాన్‌లు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

పార్కింగ్‌ చలాన్‌లపై అసహనం

రాంగ్‌ పార్కింగ్‌లో వాహనాలు నిలిపారంటూ పోలీసులు ఫొటోలు తీసుకుని ఈ చలాన్‌ రూపంలో ఫైన్‌లు వేయడం పట్ల వాహనదారులు మండిపడుతున్నారు. ఏదైన పని మీద పట్టణ కేంద్రాలకు రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంటుంది. నిబంధనల పేరిట చలాన్‌లు వేయడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్‌ స్థలాలు ఉంటే తాము నిబంధనలను ఎందుకు విస్మరిస్తామని ప్రశ్నిస్తున్నారు. సెల్లార్‌లలో నిర్మాణాలు చేపట్టడం, సరైన పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేసుకోకుండా వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వారిని వదిలి తమను బాధ్యులను చేసి ఈ చలాన్‌లు వేసి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. జేబులో రూపాయి లేకున్నా ఈచలాన్‌ వేయడంతో ఫోన్‌కే మెసేజ్‌ వచ్చే వరకు కూడా తమకు పెనాల్టీ పడిందన్న విషయం వాహనదారులకు తెలియడం లేదు.  అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందుగా పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేస్తే రోడ్లపైన వాహనాలు నిలిపే పరిస్థితులు ఉండవని పేర్కొంటున్నారు.

మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల జేబులకు చిల్లు

కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్‌ ప్రాంతాల్లో మున్సిపల్‌ అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల పలు పనుల నిమిత్తం వస్తున్న ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల జేబులకు ఈ చలాన్‌ రూపంలో చిల్లులు పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. కామారెడ్డి పట్టణంలోని సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, స్టేషన్‌రోడ్డు, జేపీఎన్‌రోడ్డు, నిజాంసాగర్‌ రోడ్డు, కొత్త బస్టాండ్‌, సిరిసిల్లారోడ్డు, పాత బస్టాండ్‌ లాంటి ప్రాంతాల్లో నిత్యం వాహనరద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో పార్కింగ్‌ చేయడానికి స్థలాలు లేక ప్రజలు రోడ్లపైనే పార్కింగ్‌ చేస్తుంటారు. ఈ ప్రాంతాల్లోని చాలా చోట్ల సెలార్ల నిర్మాణం చేపట్టిన అధిక ఆదాయం కోసం కక్కుర్తి పడే సదరు భవన యజమానులు, వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వాటిలో నిర్మాణాలు చేపట్టడమే లేదంటే తమ సొంత ప్రయోజనాలకు వాడుకోవడమో చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడ పార్కింగ్‌ చేయాలో తెలియక వాహనదారులు రోడ్లపై పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా పార్కింగ్‌ చేసిన వాహనాలను పోలీసులు రోడ్డులో పార్కింగ్‌ చేశారంటూ ఈ చలాన్‌లు వేస్తున్నారని మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యం వీడి సెలార్లలో ఉన్న నిర్మాణాలను తొలగించి పార్కింగ్‌కు స్థలాలను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటే తామేందుకు వాహనాలను రోడ్లపై పార్కింగ్‌ చేస్తామనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

పట్టణాల్లో పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు జరిగేనా?

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు సామాన్యుడు ఇబ్బందుల పాలవుతే తమకేంటి అనే ఆలోచన ధోరణిని వీడడం లేదు. నిబంధనలను పాటించకుండా నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉదాసీనత ప్రదర్శిస్తూ తమ పట్ల మాత్రం కఠినంగా ఉండడం ఎంత వరకు సబబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరీపై దృష్టి సారించి తమకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. పార్కింగ్‌ స్థలాలు చూపుతే తాము అక్కడే పార్కింగ్‌ చేస్తాం కదా తామేందుకు నిత్యం ఫైన్‌ల బారిన పడుతామని వాపోతున్నారు. మున్సిపల్‌ అధికారులు ఆయా ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి సెల్లార్‌లలో నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుని పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more