Self-made billionaire: 19 ఏళ్లకే చదువుకు ఫుల్‌స్టాప్! మరో 6 ఏళ్లకు అపరకుబేరుడిగా..

ABN , First Publish Date - 2022-05-27T23:38:53+05:30 IST

అలెగ్జాండర్ వాంగ్.. అతడుండేది అమెరికాలో.. వయసు జస్ట్ 25..! వయసులో చిన్నవాడే అయినా అతడు ఇప్పుడో బిలియనీర్.. వేల కోట్ల సంపద అతడి సొంతం.

Self-made billionaire: 19 ఏళ్లకే చదువుకు ఫుల్‌స్టాప్! మరో 6 ఏళ్లకు అపరకుబేరుడిగా..

ఎన్నారై డెస్క్: అలెగ్జాండర్ వాంగ్.. అతడుండేది అమెరికాలో.. వయసు జస్ట్ 25..! వయసులో చిన్నవాడే అయినా అతడు ఇప్పుడో బిలియనీర్.. వేల కోట్ల సంపద అతడి సొంతం. 19 ఏళ్లకే.. అదీ.. ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకొనే అవకాశాన్ని కాదనుకున్న అతడు.. మరో ఆరేళ్లు తిరిగేసరికల్లా కళ్లు చెదిరే సంపదను సొంతం చేసుకున్నాడు. అందుకే.. ఫోర్బ్స్ పత్రిక అపరకుబేరుల జాబితాలో స్థానం సంపాదించాడు. స్వశక్తితో బిలియనీర్‌గా మారిన అతిపిన్న వయస్కుడంటూ ఫోర్బ్స్(Forbes).. వాంగ్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. అతడి ప్రయాణాన్ని తరిచి చూస్తే అద్భుతం అనిపించకమానదు.


వాంగ్‌ తల్లిదండ్రులిద్దరూ భౌతికశాస్త్రవేత్తలే! అమెరికా సైన్యానికి సంబంధించిన వివిధ ఆయుధాల ప్రాజెక్టుల్లో పని చేశారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాంగ్.. చిన్నప్పటి నుంచే గణితంలో అద్భుత ప్రతిభ కనబరిచేవాడు. ఆరో తరగతిలో ఉండగానే జాతీయ స్థాయి గణితశాస్త్ర పోటీలో పాల్గొన్నాడు. డిస్నీ వరల్డ్ టిక్కెట్‌ గెలుచుకోవాలనే ఉద్దేశంతో అతడు ఈ పోటీలోకి దిగాడు. ఇందులో గెలవకపోయినా.. ఆ తరువాత మాత్రం అద్భుతాలు సృష్టించాడు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో కళ్లు చెదిరే ప్రావీణ్యం ఉన్న వాంగ్.. 17 ఏళ్ల వయసులోనే ప్రముఖ సంస్థ కొరాలో(Quora) ప్రోగ్రామర్‌గా ఉద్యోగం చేశాడు. ఈ క్రమంలోనే.. అతడి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. 


కోరాలో ఉండగా వాంగ్‌కు లూసీ గోవ్‌తో పరిచయమైంది. ఆమె అతడి సహోద్యోగే! వారిద్దరూ కలిసి 2016లో ‘స్కేల్ ఏఐ’ పేరిట ఓ సంస్థను స్థాపించారు. ఆ తరువాత వారు వెనక్కు తిరిగి చూసుకునే అవసరమే లేకుండా పోయింది. కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సంబంధిత సేవలు అందించే ఈ సంస్థ వ్యాపారం చూస్తుండగానే వేల కోట్లకు చేరుకుంది. ప్రముఖ కంపెనీలైన Toyota Research Institute, Open AI, lyft, వంటి ఎన్నో సంస్థలకు Scale AI సేవలందిస్తోంది! ఆయా సంస్థల్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అప్లికేషన్లను పరీక్షించేందుకు, వాటికి శిక్షణ ఇచ్చేందుకు కావాల్సిన డేటాను అందిస్తోంది.  ఇటీవలే సంస్థ మార్కెట్ విలువ 7.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక సంస్థలో 15 శాతం వాటా కలిగిన వాంగ్..బిలియనీర్‌గా అవతరించాడు. అతడి సంపద మొత్తం విలువ ఒక బిలియన్ డాలర్లు! 


కృత్రిమ మేథ సాయంతో వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కించడమే తన లక్ష్యమంటాడు వాంగ్. ‘‘ప్రస్తుతం ప్రతి వ్యాపార రంగంలో సమాచారం కుప్పలు తెప్పలుగా ఉంది. ఈ డాటాతో ఆయా సంస్థలను మరో స్థాయికి తీసుకెళ్లొచ్చు’’ అని వాంగ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. అమెరికా సైన్యం, నావికా దళం కూడా వాంగ్ కస్టమర్లే! ప్రస్తుతం స్కేల్ ఏఐ ఏకంగా 300 సంస్థలకు ఏఐ సంబంధిత సేవలు అందిస్తోంది. ఏటా మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 

Updated Date - 2022-05-27T23:38:53+05:30 IST