తిరుమల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తిరుమల పుణ్యక్షేత్రంలో మంగళవారం ప్రణయకలహోత్సవం కన్నులపండువగా జరిగింది. సాయంత్రం 4 గంటలకు మలయప్పస్వామి పల్లకీపై కొలువుదీరి మహాప్రదక్షిణ మార్గంలో పుష్కరిణి వద్దకు చేరారు. అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామి ఉత్సవమూర్తికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. అనంతరం పురాణపఠనం జరుగుతుండగా స్వామిపై కోపంగా ఉన్న అమ్మవార్ల తరపున.... జీయంగార్లు పూలచెండ్లతో స్వామిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి(వాహనబేరర్లు ఉత్సవమూర్తి పల్లకిని వెనక్కి తీసుకెళ్లారు) తానేం తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాఽఽథేయపడ్డారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్యప్రబంధంలోని పాశురాలను నిందా-స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.