శ్రీవారి జ్యేష్టాభిషేకాలు

ABN , First Publish Date - 2020-06-05T10:55:41+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు నిర్వహించే జ్యేష్టాభిషేకాలు గురువారం ప్రారంభమయ్యాయి.

శ్రీవారి జ్యేష్టాభిషేకాలు

తిరుమల, జూన్‌ 4: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు నిర్వహించే జ్యేష్టాభిషేకాలు గురువారం ప్రారంభమయ్యాయి.ప్రాచీనమైన శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం రుత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు.


శతకలశ ప్రతిష్ట ఆవాహన, నవకలశ ప్రతిష్ట ఆవాహన, కంకణ ప్రతిష్ట అనంతరం ఉత్సవమూర్తులకు ఆర్య్ఘం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుషసూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి వజ్రకవచాన్ని సమర్పించారు. 


ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధించా: టీటీడీ చైర్మన్‌

శ్రీవారి దయవల్ల కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జ్యేష్టాభిషేకంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ  8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా జ్యేష్టాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2020-06-05T10:55:41+05:30 IST