ఆగస్టు నాటికి మరో ముప్పావు ‘వడ్డి’ంపు

ABN , First Publish Date - 2022-05-17T06:10:21+05:30 IST

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగానే దేశంలో ధరలు భారీగా పెరిగాయని ఎస్‌బీఐ ఆర్థికవేత్తల తాజా నివేదిక పేర్కొంది.

ఆగస్టు నాటికి మరో ముప్పావు ‘వడ్డి’ంపు

వచ్చే రెండు ద్రవ్య పరపతి సమీక్షల్లో రెపో రేటు 0.75ు పెరిగే అవకాశం 

ఎస్‌బీఐ ఆర్థికవేత్తల అంచనా 


ముంబై: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగానే దేశంలో ధరలు భారీగా పెరిగాయని ఎస్‌బీఐ ఆర్థికవేత్తల తాజా నివేదిక పేర్కొంది. గడిచిన కొన్ని నెలల్లో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణంలో 59 శాతానికి యుద్ధ పరిణామాలే కారణమని రిపోర్టు తెలిపింది. ఏప్రిల్‌లో రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం ఏకంగా 7.8 శాతానికి ఎగబాకిన నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక వడ్డీ (రెపో) రేటును ఆగస్టు నాటికి మరో 0.75 శాతం పెంచి కరోనా పూర్వ స్థాయి 5.15 శాతానికి తీసుకెళ్లవచ్చని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేశారు. జూన్‌తో పాటు ఆగస్టులో నిర్వహించే ద్రవ్యపరపతి సమీక్షల్లోనూ ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచనుందని వారన్నారు. అయితే, యుద్ధం కారణంగా అవరోధాలు త్వరగా తొలగిపోకుంటే వడ్డీ రేట్ల్లు పెంచినా ధరలు అదుపులోకి వస్తాయా అన్నది ఆర్‌బీఐ ముందున్న అతిపెద్ద ప్రశ్నని వారు పేర్కొన్నారు. వరుస వడ్డింపులు వృద్ధికి గండికొట్టకుండా ఉండేలా ఆర్‌బీఐ జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందన్నారు. భగ్గుమంటున్న ధరలకు కళ్లెం వేసేందుకు ఈ నెల 4న ఆర్‌బీఐ రెపో రేటును 0.40 శాతం పెంచుతూ ఆకస్మిక నిర్ణయం ప్రకటించింది. దాంతో రెపో రేటు చారిత్రక కనిష్ఠ స్థాయి 4 శాతం నుంచి 4.40 శాతానికి పెరిగింది. ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం 2018 ఆగస్టు 1 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి.


వడ్డీ రేట్ల పెంపు, మంచి వర్షపాతంతో ధరలు అదుపులోకి: సీఐఐ 

ఆర్‌బీఐ రెపో పెంపుతో పాటు ఈ ఏడాది మెరుగైన వర్షపాతం నమోదయ్యే అవకాశాలతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో ధరలు మళ్లీ అదుపులోకి రావచ్చని సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌ సంజీవ్‌ బజాజ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించేందుకు రెపో వడ్డింపును ఇప్పటికే ప్రారంభించిన ఆర్‌బీఐ.. ఈ ఏడాదిలో మరింత పెంచనుందని బజాజ్‌ అన్నారు. 

Updated Date - 2022-05-17T06:10:21+05:30 IST