దాహం.. దాహం!

ABN , First Publish Date - 2022-05-25T05:46:25+05:30 IST

ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు. తాగేందుకు కనీసం గుక్కెడు నీళ్లులేక అల్లాడుతున్నారు.

దాహం.. దాహం!
వ్యవసాయ బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్న గట్టెపెల్లి కోలాంగూడ ఆదివాసీలు

గిరిజన గ్రామాల్లో బిందెడు నీటికి బండెడు కష్టాలు!

బావి నీటితోనే గొంతు తడుపుకుంటున్న గిరిజనులు

మిషన్‌ భగీరథ కోసం తప్పని ఎదురు చూపులు

చుట్టుముడుతున్న భయంకర వ్యాధులు 

కాగితాలకే పరిమితమవుతున్న సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌

ఆదిలాబాద్‌, మే24(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు. తాగేందుకు కనీసం గుక్కెడు నీళ్లులేక అల్లాడుతున్నారు. దా హం తీర్చుకునేందుకు చెలిమె నీటినీ ఆశ్రయిస్తూ భయంకర వ్యాధుల భారిన పడుతున్నారు. జిల్లాలో 468 గ్రామ పంచాయతీల పరిధిలో 1231 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 1227 గ్రామాలకు మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మిగతా నాలుగు గ్రామాల కు సోలార్‌ పంపుసెట్ల ద్వారా మంచినీటి సరఫరా అవు తోంది. ప్రతీ ఏడాది జిల్లాలో నార్నూర్‌, గాదిగూడ, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, బజార్‌హత్నూర్‌, నేరడిగొండ, గుడిహత్నూర్‌, సిరికొండ, తలమడుగు మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఎదురవుతోంది. అయినా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టక పోవడం, సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేయక పోవడంతో గిరిజనులకు నీటి కష్టాలు తీరడం లేదు. ప్రజలు గ్రామాల సమీపంలో వాగులు, ఒర్రెలు, చెలిమెలలోని కలుషిత నీటిని తాగుతున్నారు. అవి కలుషితంగా ఉండడం తో వ్యాధులు చుట్టుముట్టి మంచం పడుతున్నారు. నిత్యం నిద్ర లేచినప్పటి నుంచి కుటుంబమంతా తాగునీళ్ల కోసమే పాట్లు పడాల్సి వస్తోంది. గిరిజన గూడాల్లో ఉన్న మంచినీటి పథకాలు పని చేయక అలంకార ప్రాయంగానే కనిపిస్తున్నా యి. మండిపోయే మే మాసంలో నీటి ఎద్దడి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో గొడ్డు గోదా నీళ్ల కోసం అల్లాడుతున్నా యి. ఇంటింటికీ తాగునీరును అందిస్తున్నామని అటు ప్రభుత్వం ఇటు అధికారులు చెబుతున్నా గత నాలుగేళ్లుగా మిషన్‌ భగీరథ అందనంత దూరంలోనే కనిపిస్తోంది. 

అల్లాడుతున్న గిరిజనులు..

మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చడంతో గిరిజన గూడాలు అల్లాడుతు న్నాయి.ప్రధానంగా ఇంద్రవెల్లి మం డలం, నార్నూర్‌, బజార్‌ హత్నూర్‌,  బేల మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాలు నీ టి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటు న్నాయి. ఇంద్రవెల్లి మండలంలోని వడగాం, వాల్గొండ, గట్టెపల్లి గిరిజన గ్రామాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచి పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం అన్ని గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. తొలకరి వర్షాలు కురిసేనాటికి ఇవే పరిస్థితులు ఉంటే విషజ్వరాలు, అతిసారా లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని గిరిజనులు వాపోతున్నారు. కనీసం అధికారులు తాగేందుకైనా మంచి నీటి సౌకర్యాన్ని కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ అధికారులు గిరిజన గ్రామాల వైపు కన్నెత్తి చూడక పోవడంతో కష్టాలు తప్పడం లేదంటున్నారు. గ్రామంలో ఏనాడో తవ్వుకున్న నీటి బావే నేటికి దిక్కవుతోంది. మండుతున్న ఎండలకు వ్యవసాయ బావులు సైతం అడుగంటి పోతున్నాయి. వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి మరింత ఝటిలమయ్యే అవకాశం కనిపిస్తోంది. అడుగడుగున లీకేజీలు, మరమ్మతులతో చివరి వరకు తాగునీటి సరఫరా కావడం లేదు. వేసవి ప్రారంభం నుంచి నీటి ఎద్దడి తలెత్తడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 

అదిగదిగో మిషన్‌ భగీరథ..

గిరిజనులకు రక్షిత మంచి నీటిని అందించాలనే సదు ద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని మూడేళ్ల క్రితమే ప్రారంభించింది. అయిన ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో గిరిజన గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా మంచి నీటి సరఫరా జరగడం లేదు. ప్రతిసారి జిల్లా పరిషత్‌ సమావేశాల్లో మిషన్‌ భగీరథపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసి గగ్గోలు పెడుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఇంటింటికీ నీటి సరఫరా చేసే పైపులైన్‌ల ని ర్మాణం పూర్తి కావడం లేదు. ఉన్నచోట్ల లీకేజీల సమస్యలు ఎ దురవుతున్నాయి. రోజుల తరబడి పంపుమోటార్లను మరమ్మతులు చేయక పోవడంతో కష్టాలతోనే వేసవి కాలం గడిచి పోతుంది. దీంతో రోజుల తరబడి మిషన్‌ భగీరథ కోసం ఎ దురు చూడాల్సి వస్తోంది. మారుమూల గిరిజన గ్రామాల వైపు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కన్నెత్తి చూడక పోవడంతో అందుబాటులో ఉన్న నీటి వనరులతోనే దాహం తీర్చుకోవాల్సి వస్తోంది. గతంలో నిర్మించిన పథకాలపై పర్యవేక్షణ లేక పోవ డంతో అలంకార ప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐటీడీఏ, ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక, సింగిల్‌ విలేజ్‌ స్కీం, గ్రౌండ్‌ లెవల్‌ సర్వీస్‌, రిజర్వాయర్‌, ఓవర్‌హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్‌ మొదలగు పథకాల కింద కోట్ల రూపాయలను ఖర్చు చేసినా గిరిజనుల దాహం నేటికి తీరడం లేదు. వందలాది పథకాలు నిరుపయోగంగానే పడి ఉండడంతో యేటా నీటి కష్టాలు గిరిజనులను వెంటాడుతునే ఉన్నాయి.

మిషన్‌ భగీరథ నీరు రావడం లేదు..

 కుమ్ర మోహన్‌రావు (గట్టెపెల్లి సర్పంచ్‌, ఇంద్రవెల్లి) 

మా ఊరికి రోజులుగా మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. వారానికి ఒకసారి మాత్ర మే వస్తున్నాయి. మిషన్‌ భగీరథ నీరు రాని రోజుల్లో వ్యవసాయ బావుల నుంచే నీటిని తెచ్చుకుని తాగుతున్నాం. మా గ్రామ పంచాయతీ పరిధిలో నీటి సమస్య తీవ్రంగా ఉందని అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు. దాహం తీర్చుకునేందుకు వాగు చెలిమ నీటినే తాగడంతో కీళ్లు, ఎముకల నొప్పితో బాధపడుతున్నాం. అధికారులు నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పని చేయకపోవడంతో వృఽథాగానే మారింది. 


ఎక్కడైనా సమస్య వస్తే పరిష్కరిస్తున్నాం..

- వెంకటేశ్వర్లు (ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ)

జిల్లాలో 1227 గ్రామాలకు మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం. నాలుగు గ్రామాల్లో మాత్రమే సోలార్‌ పంపు మోటార్ల ద్వారా నీటి సరఫరా అవుతోంది. ఎక్క డైనా సమస్య వస్తే తక్షణమే పరిష్కరిస్తున్నాం. మారుమూల గిరిజన గ్రామాలకు నీటి సరఫరాలో కొంత ఇబ్బంది వస్తుందని చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. సమస్య రాగానే సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. పంపుమోటార్లు లీకేజీల మరమ్మతులతో కొంత జాప్యం జరుగుతుంది. సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు ఫోన్‌ చేస్తున్న స్పందిస్తున్నాం. వేసవి కాలం పూర్తయ్యే వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.


Updated Date - 2022-05-25T05:46:25+05:30 IST