అక్టోబరులో థర్డ్‌వేవ్‌!

ABN , First Publish Date - 2021-06-19T06:55:18+05:30 IST

కొవిడ్‌ రెండో వేవ్‌తో అల్లాడిన భారత్‌కు.. అక్టోబరులో మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉందని, అయితే దాన్ని సమర్థంగా నియంత్రించవచ్చని రాయ్‌టర్స్‌ వార్తాసంస్థ నిర్వహించిన పోల్‌లో

అక్టోబరులో థర్డ్‌వేవ్‌!

రాయ్‌టర్స్‌ పోల్‌లో 85% మంది వైద్యనిపుణుల అంచనా

సమర్థంగా ఎదుర్కోగలమన్న 70% మంది నిపుణులు

పిల్లలకు ముప్పు ఉంటుందన్న 65% మంది


న్యూఢిల్లీ, జూన్‌ 18: కొవిడ్‌ రెండో వేవ్‌తో అల్లాడిన భారత్‌కు.. అక్టోబరులో మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉందని, అయితే దాన్ని సమర్థంగా నియంత్రించవచ్చని రాయ్‌టర్స్‌ వార్తాసంస్థ నిర్వహించిన పోల్‌లో పలువురు వైద్యులు పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ మహమ్మారి ముప్పు మరో ఏడాదికిపైగా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. జూన్‌ 3 నుంచి 17 నడుమ రాయ్‌టర్స్‌.. 41 మంది ఆరోగ్య రంగ నిపుణులతో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఏం తేలిందంటే..


థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు 24 మంది సమాధానమిచ్చారు. వారిలో 21 మంది.. అంటే 85% మంది అక్టోబరు నాటికి మూడో వేవ్‌ వచ్చే ముప్పు ఉందని అంచనా వేశారు. ఆ 21 మందిలో ముగ్గురు ఆగస్టు నాటికే ఈ ముప్పు ఉందని భావిస్తే.. 12మంది సెప్టెంబరులో వస్తుందన్నారు.


రెండో వేవ్‌ నియంత్రణతో పోలిస్తే థర్డ్‌ వేవ్‌ను మరింత మెరుగ్గా నియంత్రించగలమని 34 మందిలో 24 మంది (70%) అభిప్రాయపడ్డారు. 15% మంది థర్డ్‌వేవ్‌ మరింత ఘోరంగా ఉంటుందని ఆందోళన వెలిబుచ్చగా.. 15% మంది దాని తీవ్రత దాదాపు సెకండ్‌ వేవ్‌ లాగానే ఉండొచ్చన్నారు. 

మూడో వేవ్‌ 18 ఏళ్లలోపు పిల్లలకు ఎక్కువ ప్రమాదం అనే అనుమానంపై 40 మందిలో 26 మంది అవుననే సమాధానమే ఇచ్చారు. మిగిలిన 14 మంది నిపుణులు మాత్రం పిల్లలకు మూడోవేవ్‌లో అంత పెద్ద ముప్పు ఉండదన్నారు. 

భవిష్యత్తులో వచ్చే వేరియంట్లపై ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేస్తాయా అన్న ప్రశ్నకు 38 మందిలో 25 మంది.. పనిచేస్తాయనే అభిప్రాయపడ్డారు. 34% మంది పనిచేయవన్నారు. 

ఫ మరో ప్రశ్నకు సమాధానంగా 41 మందిలో 30 మంది.. ఇంకో ఏడాదిపాటు భారత ప్రజారోగ్యానికి కరోనా ముప్పుగానే ఉంటుందని పేర్కొన్నారు. 11 మంది.. కరోనా ముప్పు ఏడాదిలోపే ఉంటుందని అభిప్రాయపడగా, 15 మంది రెండేళ్లలోపు ఉంటుందని, 13 మంది రెండేళ్లకన్నా ఎక్కువగా ఉంటుందని, ఇద్దరేమో.. కరోనా ముప్పు ఎప్పటికీ పోదని అభిప్రాయపడ్డారు.

పట్నాలో పిల్లలకూ కొవాగ్జిన్‌ పరీక్షలు

చిన్నపిల్లలపై భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స (ఎయిమ్స్‌)లో విజయవంతంగా ప్రారంభించారు. చిన్నపిల్లలకు వ్యాక్సిన్‌పై అనేక సందేహాలు తలెత్తుతున్న సమయంలో ఈ ట్రయల్స్‌లో పాల్గొనడానికి వైద్యులే పిల్లలను తీసుకురావడం విశేషం. సోమవారం ప్రారంభమైన ఈ ట్రయల్స్‌లో 6-12 సంవత్సరాల మధ్య వయసుగల ఏడుగురు పిల్లలకు తొలిడోసు వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు ఎయిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సీఎం సింగ్‌ చెప్పారు. కాగా.. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను నెలరోజుల్లోగా గుర్తించి, వారికి అవసరమైన సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీ)కు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సూచించారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

వీర్యంపై వ్యాక్సిన్ల ప్రభావం లేదు!

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్లు పురుషుల వీర్యకణాలపై ప్రభావం చూపించవని మియామీ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. జామా (జేఏఎమ్‌ఏ) జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఫలితాలను గురువారం విడుదల చేశారు. తమ అధ్యయనంలో 18-50 సంవత్సరాల వయసున్న 45 మంది ఆరోగ్యవంతులైన మగ వలంటీర్లలో, టీకా వేసుకున్న తర్వాత కూడా వారి సంతానోత్పత్తి సామర్థ్యంలో ఎలాంటి మార్పూ రాలేదని పరిశోధకులు తేల్చారు.



Updated Date - 2021-06-19T06:55:18+05:30 IST