Abn logo
Jun 18 2021 @ 03:38AM

మహారాష్ట్రకు థర్డ్‌ వేవ్‌ ముప్పు

2 నుంచి 4 వారాల్లోనే వచ్చే ప్రమాదం

‘డెల్టా ప్లస్‌’తో భారీగా కేసులకు అవకాశం


ముంబై, జూన్‌ 17: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రజలు భారీగా బయటకు వస్తుండటంతో.. మహారాష్ట్రకు థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని ప్రభుత్వం నియమించిన కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆందోళన వ్యక్తం చేసింది. గత వేరియంట్ల కంటే రెట్టింపు వేగంతో వ్యాపించే డెల్టా ప్లస్‌ (ఏవై.1) కారణంగా రెండు నుంచి నాలుగు వారాల్లోనే ఇందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్‌ థాక్రేకు కమిటీ నివేదించింది.  మహారాష్ట్రలో ఫస్ట్‌ వేవ్‌లో 19 లక్షలు, సెకండ్‌ వేవ్‌లో 40 లక్షల కేసులు నమోదయ్యాయి. థర్డ్‌ వేవ్‌ కనుక వస్తే దాదాపు 80 లక్షల మంది ప్రజలు వైరస్‌ బారినపడతారని హెచ్చరించింది. యాక్టివ్‌ కేసులు 8 లక్షలకు చేరతాయని.. ఇందులో పది శాతం మంది పిల్లలు ఉండొచ్చని పేర్కొంది. కాగా.. దేశంలో బుధవారం 67,208 మంది వైరస్‌ నిర్ధారణ అయింది. కరోనాతో మరో 2,330 మంది చనిపోయారు.  కొత్తగా 1.03 లక్షల మంది కోలుకున్నారు. ఒక్క రోజులో 38,600 యాక్టివ్‌ కేసులు తగ్గాయి. ప్రస్తుతం 8.26 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. గత 71 రోజుల్లో ఇవే అత్యల్పం.


మూడు రోజుల్లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 56.70 కోట్ల టీకాలను పంపిణీ చేయనున్నట్లు కేంద్రం  వెల్లడించింది. కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్‌)లో చేర్చాలని కోరుతూ భారత్‌ బయోటెక్‌ సమర్పించిన ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని (ఈఓఐ) డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించింది.  అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం లభిస్తే కొవాగ్జిన్‌కు పెద్ద విజయం అవుతుంది. పిల్లలపై కొవొవ్యాక్స్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలు, రవాణా సదుపాయాలు సరిగా లేని ప్రదేశాలకు డ్రోన్ల ద్వారా టీకాలు చేరవేసేందుకు కేంద్రం బిడ్లను ఆహ్వానించింది.

  

చిన్నారుల చూపు మింగేసిన బ్లాక్‌ ఫంగస్‌

ముంబైలో గడిచిన కొద్ది రోజుల్లో..4,6,14ఏళ్ల బాలికలకు  బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో ఒక్కో నేత్రాన్ని తొలగించామని వైద్యులు తెలిపారు. మొదటి ఇద్దరు పిల్లలకు అంతకు ముందే పాక్షిక అంధత్వం ఉండడంతో ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ వల్ల పూర్తిగా అంధులయ్యారని చెప్పారు. 16ఏళ్ల అమ్మాయి పేగులకు శస్త్ర చికిత్స చేసి బ్లాక్‌ ఫంగ్‌సను తొలగించామన్నారు. వీరిలో ఒకరికి కరోనా తగ్గిన తర్వాత మధుమేహం వచ్చిందన్నారు. కాగా.. హరిద్వార్‌ కుంభమేళా సమయంలో జరిగిన కొవిడ్‌ టెస్టుల కుంభకోణంపై మ్యాక్స్‌ కార్పొరేట్‌ ఏజెన్సీ లాల్‌చందానీ ల్యాబ్స్‌, నాల్వా ల్యాబ్‌లపై  కేసు నమోదైంది. 20 ఏజెన్సీల ఆధ్వర్యంలో మొత్తం 4లక్షల కరోనా పరీక్షలు జరిగాయి. వాటిల్లో లక్ష టెస్టులు ఉత్తుత్తివేనని ఉత్తరాఖండ్‌ ఆరోగ్యశాఖ జరిపిన దర్యాప్తులో తేలింది.


మూడో దశ ప్రభావం పిల్లలపై పెద్దగా ఉండదు..

న్యూఢిల్లీ, జూన్‌ 17: కరోనా మూడో దశలో మనదేశంలో పిల్లలు ఎక్కువగా కొవిడ్‌ బారిన పడొచ్చనే అంచనాలను తాజా అధ్యయనం తిరస్కరించింది. పిల్లల్లో సహజంగానే వైర్‌సలను తట్టుకొనే రోగనిరోధక శక్తి (సెరో పాజిటివిటీ) అధికంగా ఉంటుంది కాబట్టి మిగతావారి కంటే ఎక్కువగా వారిపై కరోనా ప్రభావం ఉండకపోవచ్చని పేర్కొంది. ఎయిమ్స్‌ (ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కలిసి మనదేశంలోని 5 రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  అధ్యయనం పూర్తిస్థాయి ఫలితాలు రెండు మూడు నెలల్లో రానున్నాయి.