నిర్లక్ష్యం చేస్తే థర్డ్‌ వేవ్‌ ముప్పు

ABN , First Publish Date - 2021-05-09T05:05:45+05:30 IST

ర్యాలీలు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలు ప్రారంభం, జాతీయ, అంతర్జాతీయ సరిహద్దుల్లో నియంత్రణ లేకపోవడం... వంటివన్నీ సెకండ్‌వేవ్‌కు కారణమయ్యాయని అంటున్నారు విమ్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు.

నిర్లక్ష్యం చేస్తే థర్డ్‌ వేవ్‌ ముప్పు

మరో నెల ఇదే పరిస్థితి

మే నెలాఖరు నుంచి జూన్‌ రెండో వారం నాటికి ఉచ్ఛ దశకు కరోనా కేసులు

ఆ తరువాత తగ్గుముఖం పట్టే అవకాశం

అయినప్పటికీ ఇప్పటి మాదిరిగా జాగ్రత్తగా ఉండాల్సిందే

ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మూడో దశను ఎదుర్కోడానికి సిద్ధం కావాల్సిందే

నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదకరంగా సెకండ్‌ వేవ్‌

ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్లకే హోమ్‌ ఐసోలేషన్‌

యువతలో మరణాలు ఆందోళనకరం

ఆస్పత్రికి వచ్చిన వెంటనే బెడ్‌ కేటాయించడమే ప్రధాన లక్ష్యం

‘ఆంధ్రజ్యోతి’తో విమ్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌, కొవిడ్‌-19 స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె.రాంబాబు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 


ప్రజల్లో కరోనా పట్ల భయం పోవడం, మాస్క్‌ ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం, అపోహలతో వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకు రాకపోవడం, ఎన్నికలు సభలు, ర్యాలీలు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలు ప్రారంభం, జాతీయ, అంతర్జాతీయ సరిహద్దుల్లో నియంత్రణ లేకపోవడం... వంటివన్నీ సెకండ్‌వేవ్‌కు కారణమయ్యాయని అంటున్నారు విమ్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు. కొవిడ్‌-19 రాష్ట్ర నోడల్‌ అధికారి కూడా అయిన ఆయన ప్రస్తుతం వున్న పరిస్థితులు, భవిష్యత్తులో చోటుచేసుకోబోయే పరిణామాలు, విమ్స్‌లో తీసుకురానున్న సంస్కరణల గురించి శనివారం సాయంత్రం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...


లక్షణాలు అవే.. 


సెకండ్‌ వేవ్‌లో ఎక్కువ మందిలో గత లక్షణాలే కనిపిస్తున్నాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, ఆయాసం ఉంటున్నాయి. వీటితోపాటు కొత్తగా కడుపునొప్పి, విరేచనాలు, కళ్ల కలక, వాంతులు వంటివి కొందరిలో కనిపిస్తున్నాయి. 


ఏ సమస్యలు లేని వారికే హోం ఐసోలేషన్‌


సాధారణంగా 60 ఏళ్లలోపు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్లు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండొచ్చు. అయితే, తప్పనిసరిగా ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకునే పల్స్‌ ఆక్సీమీటర్‌, ఆరోగ్య సిబ్బంది ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి 94 కంటే తక్కువకు పడిపోతుంటే మాత్రం ఆస్పత్రిలో చేరాలి. బీపీ, షుగర్‌తోపాటు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వున్న వాళ్లు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండకపోవడమే మంచిది.


తీవ్రంగా సెకండ్‌వేవ్‌


మొదటి దశతో పోలిస్తే సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రజల వ్యవహారశైలి. మొదటి దశలో కరోనా పాజిటివ్‌ కేసు వచ్చిందంటే...ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్లలో ఒక రకమైన భయం కనిపించింది. కానీ, రెండో దశలో అటువంటిదేమీ లేకుండా పోయింది. ఒకపక్క కేసులు పెరుగుతున్నా ఎంతోమంది మాస్క్‌లు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు. దీంతో కేసులు వందల నుంచి వేలకు చేరాయి. ఫియర్‌లెస్‌ బిహేవియర్‌ వల్లే ఈ పరిస్థితి దాపురించింది. 


యువతలోనూ మరణాలు


రెండో దశలో మరణాలు కూడా పెరిగాయి. మృతుల్లో యువతీ, యువకులు కూడా ఎక్కువగా ఉంటున్నారు. ఇందుకు కొంత స్వయకృతాపరాధం కూడా ఉంది. వ్యాధి నిరోధక శక్తి వుంది తమకేమీ కాదని, బలంగా ఉన్నాం కాబట్టి వైరస్‌ తమను ఏమీ చేయలేదని, స్వల్ప లక్షణాలే కాబట్టి వైద్యం అవసరం లేదని చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారే సమయానికి ఆస్పత్రుల్లో బెడ్‌ దొరకకపోవడంతో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే, ఈ విధంగా చనిపోతున్న యువతలో షుగర్‌, బీపీ, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఎక్కువమంది ఉన్నారు.


కొత్త వేరియెంట్స్‌ లేవు.. 


రాష్ట్రంలో కేసులు భారీగా పెరగడానికి ప్రధాన కారణం కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడమే. కొత్త వేరియెంట్‌లు రాష్ట్రంలో ఎక్కడా గుర్తించబడలేదు. గత ఏడాది గుర్తించిన వేరియెంట్‌లే ఉన్నాయి. రానున్న రోజుల్లో కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ..ప్రస్తుతం వున్నట్టుగానే జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా మూడో వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిందే. 


మరో నెల ఇదే పరిస్థితి


ప్రస్తుతమున్న పరిస్థితి మరో నెలరోజులపాటు వుండే అవకాశముంది. ఈ నెలాఖరు నుంచి జూన్‌ రెండో వారం నాటికి కేసులు పీక్‌ స్టేజ్‌కు వెళ్లి తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. కాబట్టి, ఈ నెల రోజులు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా వుండడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అవకాశముంది. 


విమ్స్‌లో మెరుగైన సేవలు


కరోనా వైరస్‌ బారినపడి విమ్స్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషిచేస్తా. ఆస్పత్రికి వచ్చే వారికి ట్రయాజ్‌ సెంటర్‌ వద్దే బెడ్‌ కేటాయించేలా ఏర్పాట్లుచేస్తా. వైరస్‌ బాధితులకు అందించే ట్రీట్‌మెంట్‌ ప్రోటోకాల్‌ మీద అందరికీ శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. కాబట్టి, ఇక్కడ పకడ్బందీగా అమలు జరిగేలా చేస్తాను. ఉన్నతాధికారుల అనుమతితో స్వచ్ఛంద సంస్థల నుంచి వెంటిలేటర్స్‌, కాన్సంట్రేటర్స్‌ సేకరించి ఆక్సిజన్‌ అవసరమైన వారికి వెంటనే అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వున్నట్టు నా దృష్టికి వచ్చింది. ఆస్పత్రిలో వుండే చివరి బెడ్‌ వరకు ఆక్సిజన్‌ అందేలా నేవీకి చెందిన టెక్నికల్‌ ఇంజనీర్లు సహాయాన్ని తీసుకున్నాం. 


రోగి ఆరోగ్య సమాచారాన్ని తెలియజేస్తాం.. 


విమ్స్‌లో సేవలు పొందే ప్రతి రోగి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే వున్న కాల్‌ సెంటర్‌ పకడ్బందీగా పనిచేసేలా చర్యలు తీసుకుంటా. డెడ్‌ బాడీ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించా. వైద్యులు, నర్శింగ్‌ సిబ్బంది ఇబ్బందులను పరిష్కరించి ప్రతి రోగి వద్దకు వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషిచేస్తా. 

Updated Date - 2021-05-09T05:05:45+05:30 IST