కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది: బ్రిటన్ నిపుణుడు

ABN , First Publish Date - 2021-06-20T00:54:16+05:30 IST

కరోనా డెల్టా వేరియంట్ కారణంగా బ్రిటన్‌లో మూడో వేవ్ వేళ్లూనుకుందని బ్రిటన్ శాస్త్రవేత్త ఫ్రొ. ఆడమ్ ఫిన్ తాజాగా అభిప్రాయపడ్డారు.

కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది: బ్రిటన్ నిపుణుడు

లండన్: కరోనా డెల్టా వేరియంట్ కారణంగా బ్రిటన్‌లో మూడో వేవ్ వేళ్లూనుకుందని అక్కడి శాస్త్రవేత్త ఫ్రొ. ఆడమ్ ఫిన్ తాజాగా పేర్కొన్నారు. టీకాకరణపై బ్రిటన్‌లో ఏర్పాటైన జాయింట్ కమిటీకి ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అక్కడ రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య 11 వేలకు చేరుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు బ్రిటన్‌లో కొత్తగా 11007 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫ్రిబవరి తరువాత ఇంతటి భారీ స్థాయిలో కేసులు పెరగడం బ్రిటన్‌లో ఇదే తొలిసారి. డెల్టా వేరియంట్ కారణంగానే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ పెరుగుదల కాస్తంగా నెమ్మదిగా ఉండటమనేది ఓ సానుకూల అంశమైనప్పటికీ.. కరోనా థర్డ్ వేవ్ వచ్చేసిందని చెప్పొచ్చు’’ అని ప్రొ. ఫిన్ వ్యాఖ్యానించారు. 


కేసుల సంఖ్య మరింత పెరగకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ‘‘వ్యాక్సినేషన్ కార్యక్రమానికి థర్డ్ వేవ్‌కు మధ్య పోటీ ప్రారంభమైంది’’ అని ఫిన్ కామెంట్ చేశారు. వృద్ధులకు రెండో విడత టీకా అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యం కావాలని సూచించారు. బ్రిటన్‌లోని ప్రతి పది మంది పెద్దల్లో 8 మందికి తొలి డోసు అందిందని తాజాగా లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా.. దేశంలో దాదాపు సగానికిపైగా జనాభాకు రెండో డోసు కూడా అందింది. ఇక వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్‌ను కట్టడి చేందుకు అందరికీ టీకా వేయడమే అత్యుత్తమైన వ్యూహమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే..వ్యాక్సినేషన్ ద్వారా డెల్టా వేరియంట్‌కు చెక్ పెట్టలేకపోవచ్చని ఫిన్ అభిప్రాయపడ్డారు. ‘‘లేదు.. నాకు ఈ వ్యూహంపై పూర్తి నమ్మకం లేదు. కానీ..వ్యాక్సినేషన్‌తో కరోనా థర్డ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చు. వయోధికులు అందరికీ టీకా రెండో డోసు కూడా అందించగలిగితే..కరోనా బారినపడ్డాక ఆస్పత్రిలో చేరాల్సిన అగత్యం తప్పుతుంది. ఆస్పత్రి సేవలకు డిమాండ్, కరోనా మరణాల సంఖ్య తగ్గి పరిస్థితులు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటాయి’’ అని ఫ్రొ. ఫిన్ చెప్పారు.   

Updated Date - 2021-06-20T00:54:16+05:30 IST