థర్డ్ వేవ్ అంచనాలు ఇప్పుడే కష్టం...

ABN , First Publish Date - 2022-01-06T21:03:39+05:30 IST

ఒమిక్రాన్ నేపధ్యంలో... నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిపై 40 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది

థర్డ్ వేవ్ అంచనాలు ఇప్పుడే కష్టం...

ముంబై : ఒమిక్రాన్ నేపధ్యంలో... నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిపై 40 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ క్రమంలో...  జీడీపీ వృద్ధి రేటు నాలుగో త్రైమాసికంలో 4.5-5 శాతం మేర ఉండవచ్చునని పేర్కొంది. థర్డ్ వేవ్ ఇప్పుడిప్పుడే మొదలైనందున... పూర్తి అంచనాలు వేయడం ఇప్పటికిప్పుడు కష్టమని అభిప్రాయపడింది. ప్రత్యేకించి కొన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసే మరిన్ని మొబిలిటీ ఆంక్షలు ఉండవచ్చునని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు. ఇక్రా ప్రకారం మార్చి త్రైమాసికంపై ఒమిక్రాన్ ప్రభావం భారత జీడీపీలో 40 బేసిస్ పాయింట్లు, లేదా 0.4 శాతం కోత ఉండవచ్చునని పేర్కొంటున్నారు.


కాగా... 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు 9 శాతం వరకు ఉండవచ్చునని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయింది. ఆర్‌బీఐ అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.5 శాతంగా ఉండవచ్చు. వివిధ ఆర్థిక సంస్థలు 8.5-10 శాతం వరకు ఉండవచ్చునని పేర్కొన్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు అంచనాలను సవరించడం తొందరపాటవుతుందని అదితి నాయర్ పేర్కొన్నారు. ఒమిక్రాన్ థర్డ్ వేవ్ ప్రభావంపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. అంతే కాకుండా డిసెంబరు ప్రభుత్వవ్యయాలకు సంబంధించి వివరాలు రావాల్సి ఉందన్నారు. 


కేంద్ర అధిక వ్యయంతో భర్తీ... 

కిందటి నెల ప్రారంభంలో సెకండ్ సప్లిమెంటరీ గ్రాంట్స్ రూపంలో రూ. 3.73 లక్షల కోట్ల అదనపు వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే, గత నెలలో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే పెరిగి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో(జనవరి-మార్చి) కాలంలోను ఇది పెరగవచ్చునని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ, కేంద్ర అధిక వ్యయం... నష్టాన్ని కొంతమేర భర్తీ చేస్తుందన్నారు.


మందగమనం, సరఫరా గొలుసుపై ప్రభావం... 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వృద్ధి రేటును 6-6.5 శాతంగా అంచనా వేస్తోంది. నవంబరు నెలలో హై-ఫ్రీక్వెన్సీ సూచీలు ఫ్లాట్‌గా ఉన్నాయని, పండుగ సీజన్‌లో కాస్త పుంజుకున్నప్పటికీ, ఆ తర్వాత మాత్రం మందగించాయని, దక్షిణాదిలో భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపింది. థర్డ్ వేవ్ ప్రభావం రాబోయే వారాల్లో వివిధ రాష్ట్రాలకు విస్తరించే అంశంపై వృద్ధి రేటు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ నేపధ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 9 శాతంగా ఇక్రా పేర్కొంది.

Updated Date - 2022-01-06T21:03:39+05:30 IST