బ్యాటింగ్‌లో తడబడినా...

ABN , First Publish Date - 2021-09-03T08:12:58+05:30 IST

మూడో టెస్టులో ఘోర పరాజయం ఎదురైనా భారత బ్యాటింగ్‌ తీరు మారలేదు.

బ్యాటింగ్‌లో తడబడినా...

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 

191 ఆలౌట్‌

శార్దూల్‌ , కోహ్లీ అర్ధసెంచరీలు 

 ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 53/3 

బుమ్రాకు రెండు వికెట్లు


లండన్‌: మూడో టెస్టులో ఘోర పరాజయం ఎదురైనా భారత బ్యాటింగ్‌ తీరు మారలేదు. లోపాలను సరిదిద్దుకోలేని స్థితిలో బ్యాట్స్‌మెన్‌ పేలవ ప్రదర్శన కనబరిచాడు. చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడకపోయుంటే జట్టు కనీసం 150 పరుగులైనా చేసేది కాదు. ఉమేశ్‌ (10)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అతడు జత చేసిన 63 పరుగులే జట్టు ఇన్నింగ్స్‌లో అత్యధికం. అయితే భారత బౌలర్లు మాత్రం మూడు వికెట్లతో ఇం గ్లండ్‌ను ఇబ్బందిపెట్టారు. నాలుగో టెస్టు తొలి రోజు గురువారం భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (96 బంతుల్లో 8 ఫోర్లతో 50) అర్ధసెంచరీ సాధించాడు. క్రిస్‌ వోక్స్‌కు నాలుగు, రాబిన్సన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌ రోజు ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 3 వికెట్లకు 53 పరుగులు చేసింది. భారత్‌కన్నా ఇంకా 138 పరుగు లు వెనుకంజలో ఉంది. క్రీజులో మలాన్‌ (26 బ్యాటిం గ్‌), ఒవర్టన్‌ (1 బ్యాటింగ్‌) ఉన్నారు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. 


ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..:

భారత్‌ను త్వరగానే అవుట్‌ చేసిన ఆనందంలో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌కు పేసర్‌ బుమ్రా ఝలక్‌ ఇచ్చా డు. నాలుగో ఓవర్‌లో ఓపెనర్లు బర్న్న్‌ (5), హమీద్‌ (0)లను అవుట్‌ చేశాడు. కానీ కెప్టెన్‌ రూట్‌, మలాన్‌ దీటుగా ఆడారు. అయితే రోజు ముగుస్తుందనగా పేసర్‌ ఉమేశ్‌.. కీలక రూట్‌ను బౌల్డ్‌ చేసి జట్టును సంబరాల్లో ముంచాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా (490 ఇన్నింగ్స్‌) 23 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు సచిన్‌ (522 ఇన్నింగ్స్‌) పేరిట ఈ ఫీట్‌ ఉండేది.

భారత్‌ తరఫున టెస్టుల్లో రెండో వేగవంతమైన (31 బంతుల్లో) ఫిఫ్టీ సాధించిన శార్దూల్‌. టాప్‌లో కపిల్‌ దేవ్‌ (30) ఉన్నాడు


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) బెయిర్‌స్టో (బి) వోక్స్‌ 11; రాహుల్‌ (ఎల్బీ) రాబిన్సన్‌ 17; పుజార (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్‌ 4; కోహ్లీ (సి) బెయిర్‌స్టో (బి) రాబిన్సన్‌ 50; జడేజా (సి) రూట్‌ (బి) వోక్స్‌ 10; రహానె (సి) మొయిన్‌ అలీ (బి) ఒవర్టన్‌ 14; పంత్‌ (సి) మొయిన్‌ అలీ (బి) వోక్స్‌ 9; శార్దూల్‌ (ఎల్బీ)  వోక్స్‌ 57; ఉమేశ్‌ (సి) బెయిర్‌స్టో (బి) రాబిన్సన్‌ 10; బుమ్రా (రనౌట్‌) 0; సిరాజ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు:  8 మొత్తం; 61.3 ఓవర్లలో 191 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-28, 2-28, 3-39, 4-69, 5-105, 6-117, 7-127, 8-190, 9-190, 10-191. బౌలింగ్‌: అండర్సన్‌ 14-3-41-1; రాబిన్సన్‌ 17.3-9-38-3; వోక్స్‌ 15-6-55-4; ఒవర్టన్‌ 15-2-49-1.


ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌:

బర్న్ప్‌ (బి) బుమ్రా 5; హమీద్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; మలాన్‌ (బ్యాటింగ్‌) 26; రూట్‌ (బి) ఉమేశ్‌ 21; ఒవర్టన్‌ (బ్యాటింగ్‌) 1; మొత్తం: 17 ఓవర్లలో 53/3. వికెట్ల పతనం: 1-5, 2-6, 3-52 బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 6-1-15-1; బుమ్రా 6-2-15-2; శార్దూల్‌ 3-1-11-0; సిరాజ్‌ 2-0-12-0.


టాపార్డర్‌ విఫలం:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఎప్పటిలాగే ఇంగ్లండ్‌ సీమర్లు ఇబ్బందిపెట్టారు. క్రిస్‌ వోక్స్‌ చేరికతో మరింత బలంగా కనిపించిన పేస్‌ దళం భారత టాపార్డర్‌ను కుదురుకోనీయలేదు. కేవలం 39 పరుగులకే రోహిత్‌ (11), రాహుల్‌ (17), పుజార (4) పెవిలియన్‌కు చేరారు.  కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో వోక్స్‌ వణికించా డు. రాహుల్‌ను రాబిన్సన్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు. దీనిపై భారత్‌ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. ఇక పుజార.. అండర్సన్‌ ఇన్‌స్వింగర్‌కు వెనక్కి తిరిగాడు. అటు రహానె, పంత్‌కన్నా ముందే ఐదో నెంబర్‌లో రవీంద్ర జడేజాను బరిలోకి దించారు.


కోహ్లీ అర్ధసెంచరీ చేసినా..:

రెండో సెషన్‌లోనూ మూడు వికెట్లు తీసిన ఇంగ్లండ్‌ ఆధిక్యం చూపింది. ఆరంభంలోనే వోక్స్‌.. జడేజాను అవుట్‌ చేశాడు. రహానె ఒక్క పరుగు వద్ద అంపైర్‌ ఎల్బీగా అవుటిచ్చినా రివ్యూలో బతికిపోయాడు. ఇక కోహ్లీ స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను రూట్‌ వదిలేశాడు. 40వ ఓవర్‌లో అర్ధసెంచరీ పూర్తి చేసిన సంతోషం ఎంతో సేపు లేకుండా ఆ స్కోరు వద్దే రాబిన్సన్‌ అతడికి షాక్‌ ఇచ్చాడు. ఎప్పటిలాగే అవుట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతికి కోహ్లీ బలయ్యాడు. ఇక రెండో సెషన్‌ చివర్లో రహానె (14)  పేలవ ఫామ్‌ను రిపీట్‌ చేస్తూ ఒవర్టన్‌కు చిక్కాడు.


శార్దూల్‌ జోరు:

చివరి సెషన్‌ రెండో ఓవర్‌లోనే పంత్‌ (9)ను వోక్స్‌ అవుట్‌ చేశాడు. అయితే ఊహించని విధంగా ఇంగ్లండ్‌ బౌలర్లకు శార్దూల్‌ చుక్కలు చూపించాడు. బౌలర్‌ ఎవరైనా అలవోకగా బంతిని బౌండరీలకు తరలించాడు. ముఖ్యంగా అందరినీ వణికించిన వోక్స్‌ను శార్దూల్‌ ఆడుకున్నాడు. అతడి వరుస రెండు ఓవర్లలో నాలుగు ఫోర్లు బాదాడు. ఇక ఒవర్టన్‌ ఓవర్‌లో మిడాఫ్‌ మీదుగా భారీ సిక్సర్‌ సాధించాడు. అయితే 61 ఓవర్‌లో ఈ జోరుకు వోక్స్‌నే బ్రేక్‌ వేశాడు.  తర్వాతి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

Updated Date - 2021-09-03T08:12:58+05:30 IST