నీదా-నాదా?

ABN , First Publish Date - 2022-09-25T09:20:20+05:30 IST

మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ తెలుగు నేలను పలకరించబోతోంది.

నీదా-నాదా?

భారత్‌, ఆసీస్‌ మధ్య నిర్ణాయక మ్యాచ్‌ 

నేడు ఉప్పల్‌లో ఆసక్తికర పోరు 

రాత్రి 7 గం. నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..


గెలిచి తీరాల్సిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు కదం తొక్కడంతో.. చివరిదైన మూడో టీ20 అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ ప్రేక్షకులకు అసలు సిసలైన మ్యాచ్‌ వినోదం లభించనుంది. టిక్కెట్ల వివాదం ఎలా ఉన్నా.. అభిమానులంతా ఇప్పుడు రోహిత్‌ పుల్‌ షాట్లు, కోహ్లీ కవర్‌ డ్రైవ్స్‌.. సూర్యకుమార్‌ వైవిధ్యభరిత ఆటతీరుతో పాటు బుమ్రా యార్కర్ల కోసం ఆత్రుతగా వేచిచూస్తున్నారు. మరి అంచనాలను నిజం చేస్తూ ఉప్పల్‌లో మనోళ్లు విజయఢంకా మోగిస్తారా.. లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. 


హైదరాబాద్‌: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ తెలుగు నేలను పలకరించబోతోంది. మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా ఆదివారం స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమానంగా ఉన్నాయి. దీంతో ఉప్పల్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్‌ దక్కుతుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్‌.. నాగ్‌పూర్‌లో అదరగొట్టింది. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో 91 పరుగుల ఛేదనను మరో నాలుగు బంతులుండగానే ముగించింది. అందుకే ఈ నిర్ణాయక మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి  హోరాహోరీ ప్రదర్శన కనిపించే అవకాశం ఉంది.


డెత్‌ బౌలింగ్‌పై ఆందోళన

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా హర్షల్‌, చాహల్‌ ధారాళంగా పరుగులిచ్చుకోవడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనపరుస్తోంది. మెగా టోర్నీకి ముందు ఈ వైఫల్యం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. డెత్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌ హర్షల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో వేడ్‌ మూడు భారీ సిక్సర్లతో 19 పరుగులు రాబట్టడం గమనార్హం. ఇప్పటిదాకా వేసిన ఆరు ఓవర్లలో అతను 81 పరుగులు సమర్పించుకున్నాడు. గాయం నుంచి కోలుకున్నాక సరైన లెంగ్త్‌ను అందుకోలేకపోతున్నాడు. ఒక్క అక్షర్‌ పటేల్‌ మాత్రం మధ్య ఓవర్లలో తన స్పిన్‌తో ఇబ్బందిపెడుతున్నాడు. అటు వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కూడా చివర్లో తేలిపోతున్నాడు. నాగ్‌పూర్‌లో 8 ఓవర్ల మ్యాచ్‌ కావడంతో నలుగురు బౌలర్లు చాలని భువీని తప్పించారు. కానీ నేటి కీలక మ్యాచ్‌లో పంత్‌ స్థానంలో భువీ ఆడే అవకాశం ఉంది.


బుమ్రా సూపర్‌ యార్కర్‌తో ఫించ్‌ వికెట్‌ తీసి ఆకట్టుకున్నాడు. ఏదిఏమైనా బౌలర్లంతా విశేషంగా రాణిస్తేనే ఫలితంపై ఆశలు పెట్టుకోవచ్చు. బ్యాటింగ్‌ విభాగంలో రాహుల్‌, కోహ్లీల నుంచి నిలకడ కనిపించడం లేదు. అలాగే టాప్‌-3 సమష్టిగా రాణించలేకపోవడం భారీ స్కోరుపై ప్రభావం పడుతోంది. సూర్యకుమార్‌, హార్దిక్‌ ఫామ్‌ పడుతూలేస్తూ సాగుతోంది. అలాగే లెగ్‌ స్పిన్‌ను ఆడడంలో భారత బ్యాటర్ల ఇబ్బందిని స్పిన్నర్‌ జంపా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. దినేశ్‌కు మరింత గేమ్‌ సమయం లభించాల్సి ఉంది.


ఆసీస్‌కూ అదే సమస్య

భారత్‌ తరహాలోనే ఆస్ట్రేలియా జట్టులోనూ బౌలింగ్‌ సమస్యగా మారింది. రెండో మ్యాచ్‌లో జంపా మినహా మిగతావారు రాణించలేకపోయారు. ఫించ్‌, వేడ్‌ కలిసి పటిష్ట స్కోరును అందించినా.. బౌలర్ల వైఫల్యంతో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. నాథన్‌ ఎల్లిస్‌ గైర్హాజరీలో కమిన్స్‌, హాజల్‌వుడ్‌, సామ్స్‌ ఓవర్‌కు 11 పరుగులిచ్చేశారు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు గ్రీన్‌, ఫించ్‌ ఫర్వాలేదనిపించినా..  హిట్టర్‌ మ్యాక్స్‌వెల్‌ రెండు మ్యాచ్‌ల్లో ఒక్క పరుగే చేయడం ఆందోళనపరుస్తోంది. మెగా టోర్నీకి ముందు తను ఫామ్‌లోకి రావాలని ఆసీస్‌ కోరుకుంటోంది.


తుది జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, బుమ్రా, చాహల్‌/అశ్విన్‌.


ఆస్ట్రేలియా:

ఫించ్‌ (కెప్టెన్‌), గ్రీన్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఇన్‌గ్లి్‌స, డేవిడ్‌, వేడ్‌, కమిన్స్‌, ఎల్లి్‌స/సామ్స్‌, అబాట్‌, ఆడమ్‌ జంపా, హాజెల్‌వుడ్‌.


పిచ్‌, వాతావరణం

ఉప్పల్‌ వికెట్‌ సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటుంది. 2019లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20లోనూ విండీస్‌ 207 రన్స్‌ సాధించగా.. కోహ్లీ 94 (నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో భారత్‌ 209 పరుగులు చేసి గెలిచింది. నేటి మ్యాచ్‌ పిచ్‌పై కూడా దాదాపుగా పచ్చిక కనిపించడం లేదు. దీంతో బౌలర్లు కష్టపడాల్సిందే. ఇక ఆదివారం ఆకాశం దట్టమైన మేఘాలతో ఉండవచ్చు. అలాగే చిరు జల్లులకు ఆస్కారం ఉంది.

Updated Date - 2022-09-25T09:20:20+05:30 IST