మూడో ఫ్రంట్‌ ముచ్చటలేదు

ABN , First Publish Date - 2021-06-23T09:42:21+05:30 IST

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశం మూడో ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ఏర్పాటుచేసింది కాదని నిర్వాహకులు స్పష్టంచేశారు.

మూడో ఫ్రంట్‌ ముచ్చటలేదు

భావ సారూప్య పార్టీలతో దేశ పరిస్థితులపై చర్చ

శరద్‌ పవార్‌ నేతృత్వంలో 8 పార్టీల నేతలు భేటీ

ఆహ్వానం ఉన్నా.. మీటింగ్‌కురాని కాంగ్రెస్‌ నేతలు

ఎన్ని ఫ్రంట్‌లొచ్చినా మోదీ నంబర్‌ వన్‌: బీజేపీ


న్యూఢిల్లీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశం మూడో ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ఏర్పాటుచేసింది కాదని నిర్వాహకులు స్పష్టంచేశారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల చర్చే దీని లక్ష్యమని వారు అన్నారు. పవార్‌ నివాసంలో మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి 8 పార్టీల నేతలు హాజరయ్యారు. కాగా వామపక్షాలు మినహా ఇతర ప్రాంతీయపార్టీలను ఒక తాటిమీదకు తీసుకొచ్చి వచ్చే  ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడానికి ఇది తొలి ప్రయత్నంగా ఈ సమావేశంపై  కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే భేటీలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులనే చర్చించినట్టు నేతలు చెప్పారు.


మూడో ఫ్రంట్‌ కోసం  ఈ సమావేశం ఏర్పాటుచేసినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఎన్సీపీ స్పష్టంచేసింది. దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటుచేయాలని తానే పవార్‌ను కోరినట్టు రాష్ట్రమంచ్‌ (నేషనల్‌ ఫోరమ్‌) వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా మీడియాకు చెప్పారు. 

 


కాగా, ఈ సమావేశంలో కొవిడ్‌ పరిస్థితులు, సంస్థలపై జరుగుతున్న దాడులు, నిరుద్యోగంలాంటి అంశాలను చర్చించినట్టు సీపీఎం నేత నీలోత్పల్‌ బసు మీడియాకు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీతో తలపడాలన్న అంశంపై చర్చించేందుకు తాము భేటీ కావడంలేదని సమావేశంలో పాల్గొన్నడానికి ముందు పలువురు నేతలు  మీడియాకు చెప్పారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మాత్రమే కాకుండా, పలు రంగాలకు చెందిన మేధావులుపాల్గొన్నారు.  సమావేశానికి రావాంటూ  ఎన్సీపీ తరపునగాని, వ్యక్తిగతంగా గాని ఎవరినీ ఆహ్వానించలేదని పవార్‌కు అత్యంత సన్నిహిత వర్గాలు తెలిపాయి. శివసేన కూడా మంగళవారం నాటి సమావేశానికి రాజకీయాలతో సంబంధంలేదని స్పష్టంచేసింది.  ప్రతిపక్షాలను ఒక చోట చేర్చేందుకు మాత్రం ఇది తొలి అడుగు అని శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌  చెప్పారు.


‘మహా’ తరహా కూటమి..

 మహారాష్ట్రలో మాదిరిగా (మహారాష్ట్ర వికాశ్‌ అఘాడి-ఎంవీఏ) బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు జరగాలని శివసేన అభిప్రాయపడింది.  మహారాష్ట్రలోలాగే  2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ సంకీర్ణ కూటమి ప్రయోగానికి ప్రతిఒక్కరూ ఎదురుచూస్తున్నారని శివసేన అధికారి పత్రిక సామ్నా సంపాదకీయాన్ని ప్రచురించింది. కాగా,  పవార్‌తో భేటీ సమయంలో తాను కూటమికి సంబంధించి చర్చించలేదని ప్రశాంత్‌ కిశోర్‌ స్పష్టంచేశారు. మూడో ఫ్రంట్‌ ఏర్పడుతుందన్న నమ్మకం తనకు లేదని చెప్పారు. ప్రతిపక్షాల సమావేశంపై బీజేపీ స్పందించింది. పగటి కలలు కనడాన్ని ఎవరూ ఆపలేరంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ ఎద్దేవా చేశారు.  


ఎవరెవరు హాజరయ్యారంటే...

భేటీకి ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), జయంత్‌ ఛౌధురి( ఆర్‌ఎల్డీ), ఘనశ్యామ్‌ తివారీ ( ఎస్పీ), సుశీల్‌ గుప్తా (ఆప్‌),  బినయ్‌ విశ్వం ( సీపీఐ), నీలోత్పల్‌ బసు (సీపీఎం), మాజీ రాయబారి కేసీ సింగ్‌, గీత రచయిత జావెద్‌ అఖ్తర్‌ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2021-06-23T09:42:21+05:30 IST