Oct 28 2021 @ 14:48PM

సూర్య, బాల కాంబినేషన్ లో మూడో సినిమా!

కోలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాలకు, ప్రయోగాలకు పెట్టింది పేరు దర్శకుడు బాల. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఆయన సినిమాలుంటాయి. ప్రయోగాత్మక కథాంశాల్ని కమర్షియల్ కోణంలో ఆవిష్కరించడం ఆయన టాలెంట్. ‘పితామగన్, నంద, నాన్ కడవుల్, అవన్ ఇవన్, తారైతప్పట్టై, నాచియార్’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని అందించిన ఆయన సూర్యతో ‘నంద, పితామగన్’ అనే రెండు సినిమాలు తీశారు. ఈ రెండు చిత్రాలతోనూ సూర్య సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడో చిత్రం మొదలు కానుంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది.  త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఈ  విషయాన్ని సూర్య తన హ్యాండిల్ ద్వారా తెలియజేశారు. 



‘నా టాలెంట్ మీద మంచి నమ్మకం పెట్టుకొని నన్ను ఓ కొత్త లోకానికి పరిచయం చేసి నాకో గుర్తింపు తెచ్చినపెట్టారు బాలా అన్న. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే ప్రేమతో మా తండ్రిగారి ఆశీర్వాదం తీసుకొని నాతో సరికొత్త ప్రయాణం చేయబోతున్నారాయన. ఆయనకి ప్రేక్షకులు అదే ప్రేమని, ఆదరణను ఇవ్వాలని కోరుకుంటున్నాను’. అంటూ సూర్య తన ట్విట్టర్ లో తెలియజేస్తూ బాల, తండ్రి శివకుమార్, తను దిగిన ఫోటోను షేర్ చేశారు. ‘జైభీమ్’ చిత్రంతో వచ్చేనెల్లో ఓటీటీలో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు సూర్య. ప్రస్తుతం ‘రాకెట్రీ, ఎదరిక్కుమ్ తునిందవన్, వాడివాసల్’ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు.