ఆగని తవ్వకాలు

ABN , First Publish Date - 2022-05-10T06:35:25+05:30 IST

ఆగని తవ్వకాలు

ఆగని తవ్వకాలు
బుడమేటి ఒడ్డున అసైన్డ్‌ భూమిలో అక్రమ తవ్వకాలు

మూడోరోజూ పుట్టగుంటలో చెలరేగిన మట్టి మాఫియా

టన్నులకొద్దీ మట్టి తరలింపు   

జగనన్న లేఅవుట్లకు మట్టి తోలాలని అడ్డుకున్న పుట్టగుంట వాసులు

కుదరదంటూ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు..

అనుమానాలకు తావిస్తున్న రెవెన్యూ అధికారుల తీరు

భవిష్యత్‌ భద్రతా దళం ఫిర్యాదు


గుడివాడ, మే 9 : గుడివాడ నియోజకవర్గం పుట్టగుంటలో మూడు రోజులుగా రేయింబవళ్లు అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు. రాయలసీమ కబ్జాదారులకు తోడు గుడివాడ గడ్డంగ్యాంగ్‌ అడ్డంగా ఉండటంతో అధికారులు చేతులెత్తేశారు. వరుసగా మూడోరోజు సోమవారం కూడా చేపల చెరువు తవ్వకం జరిగింది. వందలకొద్దీ టిప్పర్లతో జోరుగా మట్టి తోలకాలు చేపట్టారు. నాలుగు జేసీబీలు, ఐదు డోజర్లను రంగంలోకి దింపారు. పక్కనే ఉన్న పుట్టగుంట జగనన్న లే అవుట్‌లోని స్థలాలు మెరక చేయాలని స్థానికులు కోరినా కనికరించలేదు. 

గడ్డంగ్యాంగ్‌ అండతో..

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కడప బ్యాచ్‌ తమ మార్కు కబ్జా సంస్కృతికి తెరలేపింది. గుడివాడ గడ్డం గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, డ్రెయినేజీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   ప్రభుత్వ భూమిలో చేపల చెరువు తవ్వకానికి అనుమతులు ఎలా ఇస్తామనేది మత్స్యశాఖ అధికారులవాదన. కానీ, అనుమతులు ఉన్నాయని చెబుతున్న మట్టి మాఫియా చెరువు గట్టుకు వేయాల్సిన మట్టిని గుడివాడలోని ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్ల మెరకకు తోలేస్తున్నారు. ఏపీ స్టేట్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ యాక్ట్‌ (ఏపీ సడా)-2020 అమల్లోకి వచ్చాక అంతకుముందు చేపల చెరువుల తవ్వకానికి ఇచ్చిన అనుమతులన్నీ రద్దవుతాయని మత్స్యశాఖ గుడివాడ ఏడీ సాంబశివరావు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. మట్టి తరలింపును అడ్డుకునే అధికారం మేజిస్టీరియల్‌ పవర్స్‌ ఉన్న  తహసీల్దార్‌ రెహ్మాన్‌కు మాత్రమే ఉన్నాయని, ఆయన ముందు ఉంటే తమ అధికారాన్ని ఉపయోగిస్తామని సాంబశివరావు పేర్కొన్నారు. కాగా, బుడమేరులో ఏటి పర్రగా ఉన్న ఈ భూమి ప్రభుత్వ భూమి అవునో కాదో తేల్చాల్సిన అధికారులు మౌనముద్ర దాల్చడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పాత బుడమేరు కాల్వల్లో చేపల వేటకు మత్స్యకార సొసైటీలకు అవకాశం ఇచ్చారు. అదే భూమి ప్రస్తుతం కబ్జాకోరులు దోచేస్తుంటే, ఎందుకు చేష్టలుడిగిపోయారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రికార్డులు తీసి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోండి

స్పందనలో భవిష్యత్‌ భద్రతాదళం వ్యవస్థాపకుడు వైవీ మురళీకృష్ణ ఫిర్యాదు

పుట్టగుంట రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపల చెరువు తవ్వడమే కాకుండా మట్టిని ప్రైవేట్‌ రియల్‌ వెంచర్లకు తరలించడాన్ని అడ్డుకోవాలని భవిష్యత్‌ భద్రతాదళం వ్యవస్థాపకుడు వైవీ మురళీకృష్ణ  సోమవారం ఆర్డీవో పి.పద్మావతికి స్పందనలో ఫిర్యాదు చేశారు. అదే కాపీని కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు ఫ్యాక్స్‌లో పంపారు. బుడమేరు కొత్త గట్టుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో చేపల చెరువు తవ్వకం వల్ల వరద వస్తే చుట్టుపక్కల గ్రామాల్లోకి నీరు వస్తుందని ఫిర్యాదు చేశారు. చెరువు తవ్వకం వల్ల పంట కాల్వలు పూడుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చెరువు తవ్వకాలను వెంటనే ఆపి, సమగ్ర విచారణ జరిపించి అన్యాక్రాంతం నుంచి కాపాడాలని కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత రెవెన్యూ ఉద్యోగులందరినీ శిక్షించాలని వినతిపత్రంలో కోరారు. మైనింగ్‌ అనుమతులు లేకుండా పుట్టగుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని 198-3 సర్వే నెంబరు నుంచి 200, 202, 202-1-14 వరకు భూమిలో మట్టిని తవ్వుకుని పోతున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుని, వారి వాహనాలు సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 


Read more