భారత జాతీయోద్యమ నాయకులు ఉత్కృష్ట నాగరికతా విలువల పునరుజ్జీవానికి, సమస్త మానవాళి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు, జ్ఞాన వికాసానికి ఆరాటపడ్డారు. ఇప్పుడు మన జాతిని నిర్వచిస్తున్న, సమష్టి జీవనపథాన్ని నిర్దేశిస్తున్న జాతీయవాదం, ఉషా మెహతాను ప్రభవింపచేసిన ప్రగతిశీల జాతీయవాదానికి పూర్తిగా విరుద్ధమైనది. నిర్హేతుక ఔద్ధత్యాన్ని ప్రదర్శించే తీవ్ర జాతీయవాదమిది. దీనివల్లే ప్రపంచం వైపుకు తెరిచిఉన్న మన జ్ఞాన గవాక్షాలు మూసుకుపోతున్నాయి. సాంస్కృతిక వైవిధ్యం అనాగరిక దాడులకు గురవుతోంది.
ముంబైనాకు ప్రియమైన భారతీయ నగరం. ఆ మహా నగరంలో నాకు ఇష్టమైన ప్రదేశం మణిభవన్. ఈ గృహంలోనే మహాత్ముడు తరచు బస చేస్తుండేవారు. తాను నిర్వహించిన పలు సత్యాగ్రహ ఉద్యమాలకు ఆయన ఆ ఇంటిలోనే పథకాలు రచించారు. మణిభవన్ ఇప్పుడు గాంధీజీ స్మారకమందిరంగా ఉంది. 1990 దశకం తొలినాళ్లలో నేను మొదటిసారి మణిభవన్‌ను సందర్శించాను. ఒక వృద్ధురాలికి నన్ను పరిచయం చేశారు. మూర్తీభవించిన నిరాడంబరత ఆమె. మెల్లగా, మృదువుగా మాట్లాడారు. అవును, క్విట్ ఇండియా ఉద్యమ నాయిక ఉషా మెహతా సమక్షంలో ఉన్నాను. ఆ ఉద్యమ కాలంలో రహస్య రేడియో ప్రసారాలను నిర్వహించడంలోఉష కీలకపాత్ర వహించారు. ఆ ప్రసారాల ద్వారా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని ఆమె సజీవంగా ఉంచారు.
కాంగ్రెస్ రేడియోను ప్రారంభించినప్పుడు ఉషా మెహతా వయస్సు 22 ఏళ్లు మాత్రమే. కళాశాల విద్యార్థిని. బ్రిటిష్ వలస పాలకులు అంతిమంగా ఆ రేడియో స్షేషన్‌ను కనుగొని నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఉష పలు సంవత్సరాలు కారాగార వాసంలో ఉన్నారు. విడుదలైన తరువాత తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. బాంబే విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యురాలుగా విద్వత్ శిఖరాలను అధిరోహించారు. మణిభవన్ వ్యవహారాల నిర్వహణలో ఆమె కీలక పాత్ర నిర్వహించేవారు. బోధన, పరిశోధనలకే అంకితమైన ఉషా మెహతా అవివాహిత.
ఉషా మెహతా నిర్వహించిన కాంగ్రెస్ రేడియో క్విట్ ఇండియా ఉద్యమ చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక అధ్యాయం. ఉషా థక్కర్ ఇటీవల తన ‘కాంగ్రెస్ రేడియో : ఉషా మెహతా అండ్ ది అండర్ గ్రౌండ్ రేడియో ఆఫ్ 1942’ అనే పుస్తకం ద్వారా ఆ ఉత్తేజకర గాథను సమగ్రంగా వర్తమాన తరానికి వివరించారు. ఉషా మెహతా పూర్వ విద్యార్థినే కాకుండా మణిభవన్ నిర్వహణలో సైతం భాగస్వామి అయిన ఉషా థక్కర్ శ్రమించి, పరిశోధించి, రచించిన ‘కాంగ్రెస్ రేడియో’ నేటి తరంతో నేరుగా మాట్లాడుతుంది. 1942 అక్టోబర్ 20న కాంగ్రెస్ రేడియో ప్రసారం చేసిన ఒక ప్రసంగంలోని కొన్ని భాగాలను ఉటంకిస్తాను:
‘ప్రపంచ మానవాళికి భారత ప్రజలు ఆశాభావ, శాంతి, సుహృద్భావ సందేశాన్ని పంపుతున్నారు. ఒక దేశం ప్రజలు మరొక జాతి జనులపై పాల్పడుతున్న సంహార కాండను నేడు మరచిపోదాం. నిజమైన శాంతికాముక, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు ప్రతీ దేశం నాగరికతా ప్రత్యేకతలు, ప్రతీ ప్రజాసముదాయం సంస్కృతీ విలక్షణతలను మనం నేర్చుకుని, ఆచరించవలసి ఉంది. మనకు జర్మనీ సాంకేతిక నైపుణ్యాలు, ఆమె వైజ్ఞానిక మేధ, ఆమె సంగీతం అవసరం. ఇంగ్లాండ్ ఉదారవాదం, ఆమె నైతిక స్థైర్యం, సాహిత్యం మనకు కావాలి. ఇటలీ లాలిత్యాన్ని మనం అలవర్చుకోవాలి. రష్యా పాత సాధనలు, కొత్త విజయాలను మనం ఔదలదాల్చాలి. నిష్కల్మషంగా నవ్వే, నవ్వుకునే, నవ్వించే గుణాన్ని ఆస్ట్రియా నుంచి మనం పరిగ్రహించాలి. ఆమె సంస్కృతిని, అందమైన జీవన రీతిని మన బతుకుల్లో భాగం చేసుకోవాలి. చైనా గురించి మనం ఏం చెప్పగలం? ఆమె విజ్ఞత, ఆమె ధైర్యం, ఆమె నూతన నమ్మకం మనకు ఏడుగడ అవ్వాలి. యువ అమెరికా సాహస స్ఫూర్తి, శ్రమ సిరుల ధగధగలను మనమూ పెంపొందించుకోవాలి. ఆదివాసుల జ్ఞానసంచయం, పాపాయి సరళత్వం మన భావికి వెలుగులు చూపాలి. శాంతి పునరుద్ధరణకు, మానవ నాగరికతా గౌరవ పునరుజ్జీవానికి మనకు సమస్త మానవాళి సమష్టి సహకారం అవసరం’.
మహా విధ్వంసకర, మహోగ్ర వినాశనకర యుద్ధంలో ప్రాచ్య, పాశ్చాత్య దేశాలు తలమునకలై ఉన్న తరుణంలో యువ ధీమంతురాలు ఉషా మెహతా రాసి, ప్రసారం చేసిన ఈ ఉత్తేజకర సందేశం ఆనాటి భారతీయ జాతీయవాద స్ఫూర్తి సంపూర్ణ ప్రతిఫలనమే. విదేశీ పాలన నుంచి విముక్తికి కంకణం కట్టుకున్న జాతి, రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించుకునేందుకు ప్రాణాలను సైతం సమర్పించేందుకు సిద్ధమైన జనావళి, ఉపఖండపు వివిధ ప్రాంతాల భాషా, సంస్కృతుల కాంతులను సమ్మిళితం చేసుకున్న పురా నవ మేధో భారతి ఒక సత్యాన్ని గుర్తించాయి, ఆవాహన చేసుకున్నాయి. ఇరుగు పొరుగుదేశాల, విశాల ప్రపంచపు సమస్త సమాజాల అత్యుత్తమ సాంస్కృతిక సంప్రదాయాలు, రాజకీయ సామర్థ్యాలు, బౌద్ధిక సంపత్తిని పక్షపాత రహితంగా గౌరవించి, వాటి గుణశీలత గ్రహించడం మనకు మేలు చేస్తుంది.
అదీ, ఉషా మెహతా భారతదేశం. ఉత్కృష్ట నాగరికతా విలువల పునరుజ్జీవానికి, సమస్త మానవాళి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు, జ్ఞాన వికాసానికి ఆరాటపడిన తరమది, ఆయత్తమైన కాలమది. అయితే ఇప్పుడు మనం ఒక భిన్న భారతదేశంలో నివశిస్తున్నాం. మన జాతిని నిర్వచిస్తున్న, సమష్టి జీవన పథాన్ని నిర్దేశిస్తున్న వర్తమాన జాతీయవాదం, ఉషా మెహతాను ప్రభవింపచేసిన ప్రగతిశీల జాతీయవాదానికి పూర్తిగా విరుద్ధమైనది. నిర్హేతుక ఔద్ధత్యాన్ని ప్రదర్శించే తీవ్ర జాతీయవాదమిది. జాతిపరమైన, మరీ ముఖ్యంగా మతాభినివేశ ఆధిక్యత గురించి నిత్యం ఘోషించే జాతీయవాదమిది. యుద్ధోన్మాదం అంతర్లీనంగా ఉన్న జాతీయ తత్వమిది. అంతర్ముఖత్వం వహిస్తున్న ధోరణి ఇది. ఆర్థిక విధానాలలోనూ ఇది వ్యక్తమవుతోంది సుమా! భారతీయ వ్యవస్థాపనా సామర్థ్యాన్ని అభివృద్ధిపరిచే మిషతో అసమర్థతను పెంపొందిస్తున్నారు; ఆశ్రితులను అందలాలు ఎక్కిస్తున్నారు; ఆర్థిక ప్రగతికి పాతర వేస్తున్నారు.
విద్యా విధానాల విషయానికి వస్తే ఆధునిక వైజ్ఞానిక జ్ఞానసంచయాన్ని ఉపేక్షించి, హిందువుల పురాతన విజ్ఞాన పద్ధతులే ఉత్కృష్టమైనవనే స్వాభిప్రాయ బద్ధ సిద్ధాంతాలకు పెద్ద పీట వేసేందుకు ప్రచ్ఛన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచం వైపుకు తెరిచిఉన్న మన జ్ఞాన గవాక్షాలను మూసివేస్తూ దేశంలో అంతర్గతంగా సాంస్కృతిక వైవిధ్యంపై అనాగరిక దాడి చేస్తున్నారు. తినే తిండి, ధరించే బట్టలు, వివాహ బంధాల విషయంలో వైయక్తిక ఇష్టాయిష్టాలపై విధిస్తున్న ఆంక్షలే అందుకు నిదర్శనాలు కావూ?
ఆధునిక భారతదేశ నిర్మాతలు ప్రపంచంలో విస్తృతంగా పర్యటించిన సంస్కృతీ పరులు. ‘ఆనోభద్రా క్రతవో యస్తు విశ్వతః’ (ఉత్తమ భావాలు అన్ని వైపుల నుండి రావాలి) అన్న ఋగ్వేద దార్శనికతను విశ్వసించినవారు. బహుశా, విశ్వజనీన దృక్పథంతో జాతి పునర్నిర్మాణానికి పూనుకున్న తొలి ఆధునిక భారతీయుడు రాజారామమోహన్ రాయ్. ఈ పునరుజ్జీవనోద్యమ నిర్మాత గురించి తదనంతర కాలం బెంగాలీ చింతకుడు ఒకరు ఇలా రాశారు: ‘ఐరోపా ఆదర్శాలలో నిమగ్నం కాకపోవడం వల్లనే ఆయన వాటిని ఫలప్రదంగా స్వాయత్తం చేసుకోగలిగారు. ఆయనలో ఎటు వంటి భావదారిద్ర్యం, మేధో బలహీనత లేవు. తన సొంత మేధో సంస్కృతిలో సుస్థిరంగా నిలబడి, ఎక్కడ నుంచి ఎలాంటి భావ సంగ్రహణం చేసుకోవాలో ఆయన సమర్థంగా నిర్ణయించుకోగలిగారు. భారతీయ జ్ఞానసంపద ఆయనకు పరాయిదేమీ కాదు. దానిని ఆయన అప్పటికే తన సొంతం చేసుకున్నారు.
పర్యవసానంగా ఇతరుల జ్ఞానసంపదను నిశితంగా పరిశీలించి ఏది ఉత్కృష్టం, ఏదికాదు, దేన్ని పరిగ్రహించాలి, దేన్ని తిరస్కరించాలనే విషయమై ఆయనకు స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి’. రామమోహన్ రాయ్ ప్రపంచ దృక్పథపు సద్గుణాలు, శక్తిమంతమైన ఆధారాలను ప్రతిభావంతంగా గుర్తించిన ఈ చింతకుడు రవీంద్ర మహాకవి. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికాలలో విస్తృతంగా పర్యటించిన రవీంద్రుడు తనకు, తన దేశానికి అవసరమైన భావస్రవంతిని స్వీకరించిన వివేకశీలి.
ప్రపంచ (సంస్కృతీ నాగరికతల) దర్పణంలో భారత్‌ను వీక్షించడం ద్వారా మాతృదేశ వైఫల్యాలు, లొసుగులు, లోపాలను, వాటికి కారణాలను వారు ప్రభావశీలంగా కనుగొన్నారు. జాతి ఔన్నత్యానికి వాటిల్లిన కళంకాలను తొలగించేందుకు వారు ప్రయత్నించారు. ఇతరుల నుంచి స్వీకరించిన నవీన భావాలను భారతదేశ పరిస్థితులకు వారు సృజనాత్మకంగా అనువర్తన చేసిన తీరుకు భారత రాజ్యాంగమే ఒక ఉత్కృష్ట ఉదాహరణ.
నిజానికి, ఆ కాలంలో ఇతర దేశాలలో నివశించే లేదా విద్యాభ్యాసం చేసే అదృష్టం లేని భారతీయులు కూడా సుదూర తీరాలనుంచి ప్రవహించిన ప్రగతిశీల భావాలను ఆవాహన చేసుకున్నారు. ఆ భావాల ప్రస్థాన బిందువుల విషయంలో జాతిపరమైన, సాంస్కృతికపరమైన పక్షపాతాలకు తావివ్వలేదు. కనుకనే 19వ శతాబ్ది తుది దశాబ్దాలలో జ్యోతిరావు ఫూలే కుల వివక్షకు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటంలో అమెరికాలో బానిసత్వ నిర్మూలనకు ఉద్యమించిన వారి నుంచి స్ఫూర్తి పొందారు. 1942లో తరుణ దేశభక్తురాలు ఉషా మెహతా తన ప్రియమైన భారతదేశం ఐరోపా, రష్యా, ఇటలీ, చైనా, అమెరికా నుంచి ఏమి నేర్చుకోవాలనే విషయమై స్ఫూర్తిదాయకమైన రచన చేయగలిగారు.
తొలి తరాల భారతీయ దేశభక్తులు ఇతర సంస్కతుల నుంచి స్వీకరించడమేకాదు, వారూ వివిధ వైదేశిక సంస్కృతులకు సమున్నత ప్రదానాలు చేశారు. 19వ శతాబ్ది పూర్వార్ధంలోనే ఇంగ్లాండ్‌లో ఓటుహక్కును విస్తృత ప్రజానీకానికి కల్పించవలసిన అవసరముందని రామమోహన్ రాయ్ వాదించారు. ఒక శతాబ్ది అనంతరం చైనా, ఐరోపా, లాటిన్ అమెరికాలోని రచయితలు, చింతకులకు రవీంద్రుడు విశేష స్ఫూర్తినిచ్చారు. అమెరికా పౌరహక్కుల ఉద్యమంపై గాంధీ ప్రభావం అందరికీ విదితమే. ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వంను అభివృద్ధిపరచడంలో అంబేడ్కర్ కృషిని స్వదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు.
భారతీయ దేశభక్తులు ఒకనాడు పక్షపాతరహిత వైఖరులతో ఇతర సంస్కృతులను అధ్యయనం చేశారు, వాటి నుంచి నేర్చుకున్నారు. అయితే నేటి అగ్రగామి భారతీయ నాయకుల సైద్ధాంతిక శిక్షణ పూర్తిగా విరుద్ధమైనది. నరేంద్ర మోదీ, అమిత్ షా తదిరులను రూపొందించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖ సంకుచితత్వ దృష్టికి, విదేశీ సంస్కృతులపట్ల విముఖతకు నెలవు. పూర్వీకుల మత విశ్వాసాలనే విచక్షణరహితంగా పొగడడం, (ఊహాత్మక) శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతినబూనడం, హిందువులే సకల మానవాళికి ‘విశ్వగురు’ అవుతారనే ప్రహసనప్రాయ భావనలనే అక్కడ నేర్పడం పరిపాటి. విశాల ప్రపంచం ఆ సంఘీయుల నుంచి నేర్చుకోవల్సింది ఏమీ లేదు. ప్రపంచం నుంచి నేర్చుకునేందుకు వారూ ఇష్టపడకపోవడం మరింత శోచనీయం.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)