Dussehra ఫెస్టివల్‌‌కు భారీ ఆఫర్స్‌ అనగానే.. Online లో ఎగబడి షాపింగ్‌ చేసేస్తున్నారా.. అయితే ఒక్క నిమిషం...!

ABN , First Publish Date - 2021-10-04T15:36:44+05:30 IST

దసరా నేపథ్యంలో ఈ కామర్స్‌ సైట్లు ఆఫర్స్‌ ప్రకటిస్తాయి. ఆయా సైట్లు ప్రకటించే ఫెస్టివల్‌ ఆఫర్ల కోసం వినియోగదారులు కూడా ఎదురుచూస్తుంటారు...

Dussehra ఫెస్టివల్‌‌కు భారీ ఆఫర్స్‌ అనగానే.. Online లో ఎగబడి షాపింగ్‌ చేసేస్తున్నారా.. అయితే ఒక్క నిమిషం...!

  • బోగస్‌ వెబ్‌సైట్లతో తస్మాత్‌ జాగ్రత్త
  • భారీ ఆఫర్స్‌ అంటూ సైబర్‌ నేరగాళ్ల టోకరా
  • అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
  • నమ్మదగ్గ ఈ కామర్స్‌ సైట్లనే ఎంచుకోవాలని సూచన

దసరా నేపథ్యంలో ఈ కామర్స్‌ సైట్లు ఆఫర్స్‌ ప్రకటిస్తాయి. ఆయా సైట్లు ప్రకటించే ఫెస్టివల్‌ ఆఫర్ల కోసం వినియోగదారులు కూడా ఎదురుచూస్తుంటారు. ఇదే అదునుగా సైబర్‌ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లతో వల వేస్తున్నారు. అమాయకుల ఖాతాలను కొల్లగొడుతున్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆఫర్‌ అనగానే.. అన్నింటినీ ఓపెన్‌ చేయకుండా నమ్మకమైన ఈ కామర్స్‌ వెబ్‌సైట్లనే ఎంచుకోవాలని చెబుతున్నారు.


హైదరాబాద్‌ సిటీ : రోజుకో కొత్త రకం స్కీములతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ కేటుగాళ్లు పండగ సీజన్‌ నేపథ్యంలో దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. దసరా, దీపావళి పండుగల సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల చాలా మంది ప్రతి వస్తువునూ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పలు ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో వస్తువులను ఆర్డర్‌ చేసి నేరుగా ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆన్‌లైన్‌ పోటీని తట్టుకొని ఎక్కువ మొత్తంలో బిజినెస్‌ సాధించడానికి కొన్ని ఈ  కామర్స్‌ వెబ్‌సైట్లు ప్రత్యేక ఆఫర్‌లు, డిస్కౌంట్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్శిస్తున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది సైబర్‌ కేటుగాళ్లు కస్టమర్‌లను రకరకాలుగా బురిడీ కొట్టించి అందినంతా దోచుకోవడానికి నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


తక్కువ ధరలకే అంటూ ప్రకటనలు..

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారిని టార్గెట్‌ చేస్తూ.. నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. ఖరీదైన బ్రాండెడ్‌ దుస్తులు, చీరలు తక్కువ ధరకే ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. పండుగ పేరుతో ప్రత్యేక ఆఫర్‌లు పెట్టామని, 50-60 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నామని సోషల్‌మీడియాలో, ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారు. ఆ వెబ్‌సైట్ల లింక్‌లను క్లిక్‌ చేస్తున్న వినియోగదారులు అక్కడ  కనిపించే ఖరీదైన దుస్తులు, వస్తువులకు ఆకర్శితులవుతున్నారు. తక్కువ ధరకే బ్రాండెడ్‌ దుస్తులు వస్తుండటంతో ఆర్డర్‌ చేస్తున్నారు. అతితక్కువ ధరలకే అమ్ముతుండడంతో ముందుగానే డబ్బులు పే చేయాలని సైబర్‌ కేటుగాళ్లు కండిషన్‌ పెడుతున్నారు. అలా ఆర్డర్‌ బుక్‌చేసి, డబ్బులు చెల్లించాలని, తర్వాత ఆర్డర్‌ త్వరలోనే ఇంటికి వస్తుంది అని మెసేజ్‌ వస్తుంది. ఎంతకీ ప్రొడక్టు రాకపోవడంతో అనుమానం వచ్చిన కస్టమర్‌లు అందులో ఉన్న నంబర్లకు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ చేసి ఉంటాయి. ఇలా  కేటుగాళ్లు నకిలీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లతో దోచుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


అప్రమత్తంగా ఉండాలి.. 

పండగ బంపర్‌ ఆఫర్‌లు అనగానే కనబడ్డ ప్రతి సైట్‌ను ఓపెన్‌ చేయొద్దు. నమ్మకమైన ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లనే ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు క్యాష్‌ ఆన్‌ డెలివరీకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సమయంలో అడగగానే బ్యాంకు ఖాతా, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వ్యాలెట్ల వివరాలు నమోదు చేయొద్దు. ఆ వివరాలన్నీ సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్తాయని గుర్తుంచుకోవాలి. ఒక్కసారి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత తిరిగి రావనే విషయాన్ని కస్టమర్‌లు తెలుసుకోవాలి.

Updated Date - 2021-10-04T15:36:44+05:30 IST