Abn logo
Jun 15 2021 @ 11:59AM

పిల్లలను రైళ్లలో తీసుకెళ్తున్నారా.. అయితే ఇలా చేయండి!

  • ఆరోగ్యంగా ఉంటేనే తీసుకెళ్లాలి
  • శానిటైజర్‌, ఎన్‌-95 మాస్కులను మరిచిపోవద్దు
  • నాన్‌ ఏసీలో ప్రయాణించడమే శ్రేయస్కరం
  • వైద్యుల సూచనలు

హైదరాబాద్‌ సిటీ : దేశంలో, రాష్ట్రంలో కరోనా రెండో దశ విలయతాండవం సృష్టించింది. దీంతో కొవిడ్‌ తీవ్రతను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మే 12 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ అత్యవసర పనుల నిమిత్తం కొంతమంది రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. చిన్న పిల్లలు ఉంటే వారిని కూడా తల్లిదండ్రులు తమ వెంట తీసుకెళ్తున్నారు. కరోనా రెండో దశలో ఊహించని ప్రాణ నష్టాన్ని కళ్లారా చూసిన ప్రజలందరూ మూడో దశ ముప్పును గమనించాలని పిల్లల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా రైళ్లు, బస్సుల్లో పిల్లలను వెంట తీసుకెళ్తున్న సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరుపాటు వహించినా ప్రాణాలకు అపాయం వాటిల్లే అవకాశముంటుందని సూచిస్తున్నారు. కరోనా మూడో దశ ప్రభావం పూర్తిగా పిల్లలపైనే ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీలైనంత వరకు పిల్లలతో ప్రయాణం చేయరాదని, తప్పనిసరి అయితే అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


నాన్‌ ఏసీలోనే ప్రయాణించాలి..

కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వేలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్లు, నాందేడ్‌ డివిజన్ల పరిధిలో రోజూ 127 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ, కృష్ణా లాంటి రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటున్నప్పటికీ, గోదావరి, గౌతమి, చార్మినార్‌, దానాపూర్‌తోపాటు కేరళ, తమిళనాడు, బెంగళూరుకు వెళ్లే రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉన్న రైళ్లలో పిల్లలతో వెళ్తున్న ప్రయాణికులు నాన్‌ ఏసీ బోగీలకే ప్రాధాన్యమివ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏసీ బోగీల్లో ప్రయాణిస్తే చల్లని గాలితో వైరస్‌ ముప్పు పొంచి ఉంటుందని, వీలైనంత వరకు నాన్‌ ఏసీ, స్లీపర్‌ రిజర్వేషన్లలో ప్రయాణించాలని సూచిస్తున్నారు. 5 ఏళ్ల పిల్లలకు కూడా సీటు రిజర్వేషన్‌ చేసుకోవడం ద్వారా ఇతరుల నుంచి కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు.

పిల్లల విషయంలో జాగ్రత్తలు..

- దూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు వీలైనంత వరకు పిల్లలను తమ వెంట తీసుకెళ్లకూడదు. పిల్లలు ఏ మాత్రం అలసటతో కనిపించినా వారిని ఇంటివద్దే ఉంచాలి. 

- 3 నుంచి 6 ఏళ్లకు పైబడిన పిల్లలను రైళ్లలో తీసుకెళ్లాల్సి వస్తే ఎన్‌-95 లాంటి మాస్కులు వేయాలి. లేకుంటే డబుల్‌ మాస్కులను వేయాలి. 5 ఏళ్ల పిల్లలకు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకుంటే బాగుంటుంది. 

- ప్రయాణంలో ప్రతి అరగంటకోసారి తల్లిదండ్రులు తమ చేతులతోపాటు పిల్లల చేతులనూ శానిటైజేషన్‌ చేయాలి. 

- ఇంటి నుంచి కాచి చల్లార్చిన నీటిని తప్పకుండా తీసుకెళ్లాలి. పిల్లలు బయటి నీరు తాగితే త్వరగా అనారోగ్యానికి గురవుతారు. క్యాంటీన్లలోని తినుబండారాలు, ఇతర స్నాక్స్‌కు దూరంగా ఉంచాలి. 


ఫేస్‌షీల్‌ పెట్టాలి..

కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో రైళ్లలో పిల్లలను తీసుకెళ్తున్న వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలకు ఎన్‌-95 మాస్కుతోపాటు ఫేస్‌షీల్డ్‌ పెట్టాలి. గాలి ధారళంగా అందే  విధంగా చూడాలి. చేతులతో కిటికీలను పట్టుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కిటికీలను ముట్టుకున్న చేతులతో కళ్లు, ముక్కును తాకితే కొవిడ్‌ బారిన పడే అవకాశముంటుంది. మూడో దశను దృష్టిలో ఉంచుకుని పిల్లలతో అనవసర ప్రయాణాలు చేయొద్దు. - డాక్టర్‌ రంగయ్య, ఎండీ, నియో బీబీసీ చిల్డ్రన్‌ హాస్పిటల్‌, విద్యానగర్‌.