రాజకీయ సుడిలో ‘తిక్కన’

ABN , First Publish Date - 2022-01-20T05:38:55+05:30 IST

మహాభారతాన్ని ఆంధ్రీకరించిన సారస్వతమూర్తి తిక్కన ‘రంగులవల’లో చిక్కుకున్నారు. ఆయన కాంస్య విగ్రహం పసిడి రంగుకు చేరువలో ఉండడంతో పసుపు ముద్ర అపవాదు...

రాజకీయ సుడిలో ‘తిక్కన’

మహాభారతాన్ని ఆంధ్రీకరించిన సారస్వతమూర్తి తిక్కన ‘రంగులవల’లో చిక్కుకున్నారు. ఆయన కాంస్య విగ్రహం పసిడి రంగుకు చేరువలో ఉండడంతో పసుపు ముద్ర అపవాదు పడి దాదాపు మూడున్నరేళ్ల నుంచి ఆవిష్కరణకు దూరమైంది. మహాభారతంలో 15 పర్వాలు, 15,901 పద్యాలు విరచించారనే విషయం తెలియని పాలకుల కురచ దృష్టి వల్ల, తిక్కన విగ్రహం చీకటి గదిలో బందీ అయింది. సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చివరి వరకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ముందు కూడా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, ఆయన కార్యాలయ ప్రాంగణంలోనే ప్రతిష్ఠింపజేయాలని కూడా అభ్యర్థించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఎస్పీ బాలు, అప్పటి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ విగ్రహం ఏర్పాటును కార్యాచరణలోకి తీసుకువచ్చారు. పెన్నానది పరవళ్ల మధ్య శ్రీరంగనాధస్వామి పాదాల చెంత విరచించిన నెల్లూరు నగరంలో తిక్కన విగ్రహం లేని కొరతపై ఎస్పీ బాలు దృష్టి పెట్టడంతో బుద్ధప్రసాద్‌ వెంటనే స్పందించి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. డి.విజయభాస్కర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. ఆయన వెంటనే ఆమోదించి విజయవాడలో ప్రముఖ శిల్పి బుర్రా ప్రసాద్‌తో విగ్రహం తయారు చేయించారు. ఆ విగ్రహ ఆవిష్కరణతో పాటు, తెలుగు మహోత్సవం కూడా జరపాలని భావించారు. ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో అది వాయిదాపడింది. దాంతో తిక్కన విగ్రహాన్ని సంగీత కళాశాలలోని ఓ గదిలో ఉంచారు. ప్రభుత్వం మారడంతో ఆ తర్వాత జిల్లా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు. మంత్రి బృందం పరిశీలించి రెండున్నరేళ్లు దాటింది. అయినా, తెలుగుదేశం పార్టీ చేయించిన విగ్రహం కావడం, దానికితోడు రంగు సమస్య వెంటాడుతుండడంతో తిక్కన చీకటి గదిలోనే బందీగా ఉన్నారు. ఆ విగ్రహానికి మరి విముక్తి ఎప్పుడో!

ఈతకోట సుబ్బారావు

Updated Date - 2022-01-20T05:38:55+05:30 IST