డబుల్‌ ఇళ్లల్లో దొంగలు.. కోట్ల విలువైన సామగ్రి చోరీ

ABN , First Publish Date - 2022-02-13T18:07:39+05:30 IST

ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కొల్లూరులోని రెండు పడకల ఇళ్లలో దొంగలు పడుతున్నారు.

డబుల్‌ ఇళ్లల్లో దొంగలు.. కోట్ల విలువైన సామగ్రి చోరీ

  • కొల్లూరులో రూ.3 కోట్ల విలువైన విద్యుత్‌ వైర్లు, ఇతర సామగ్రి చోరీ
  • లబ్ధిదారులకు ఎంపిక చేయకపోవడమే కారణం
  • పనులు పూర్తయినా నిర్మాణ సంస్థల అధీనంలోనే.. 
  • చేతులెత్తేస్తున్న ఏజెన్సీలు

హైదరాబాద్‌ సిటీ : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కొల్లూరులోని రెండు పడకల ఇళ్లలో దొంగలు పడుతున్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లలో విద్యుత్‌ వైర్లు, లిఫ్టులకు సంబంధించిన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.3 కోట్ల విలువైన సామగ్రి చోరీ జరిగిందని అంచనా వేసినట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తయినా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో భద్రత కరువై ఆత్మగౌరవ గృహాల్లో సామగ్రి అపహరణకు గురవుతోంది. గతంలో డి.పోచంపల్లి, గాజులరామారం తదితర ప్రాంతాల్లో చోరీలు జరగగా ఇప్పుడు కొల్లూరు ఆత్మగౌరవ గృహ సముదాయాల్లో చోరీ జరగడం గమనార్హం.


ఇటీవల మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పర్యటన నేపథ్యంలో నిర్మాణ సంస్థ చోరీ విషయా న్ని వారి దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. చోరీపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిర్మాణ సం స్థ ప్రతినిధులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. భద్రతా సిబ్బంది ఉన్న కొల్లూరులోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇతర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  


రూ.9714 కోట్లతో..

నిరుపేదలు ఆత్మగౌరవంగా నివసించేలా గ్రేటర్‌లోని 111 ప్రాంతాల్లో రూ.9,714 కోట్లతో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. 60వేల ఇళ్ల నిర్మాణపు పనులు పూర్తయ్యాయని ఇంజనీరింగ్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. 3 వేల ఇళ్లు ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేశారు. కొన్నిచోట్ల నిర్మాణం పూర్తయినా.. లబ్ధిదారులను ఎంపిక చేయక కేటాయింపులు చేయలేదు. అర్హులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేయాలనే దానిపై మార్గదర్శకాల రూపకల్పన బాధ్యతలు గృహనిర్మాణ, రెవెన్యూ విభాగాలకు గతంలో అప్పగించారు. విధివిధానాలపై స్పష్టత లేక లబ్ధిదారుల ఎంపికమొదలు కాలేదు. 


మా వల్ల కాదు..

పనులు పూర్తయినా ఇప్పటికీ మెజార్టీ ఇళ్లు నిర్మాణ సంస్థల అధీనంలో ఉన్నాయి. చోరీలు జరుగుతోన్న దృష్ట్యా ఇళ్ల వద్ద భద్రత తమ వల్ల కాదని కాంట్రాక్టు ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. గృహాలను స్వాధీనం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. దొంగతనం నేపథ్యంలో కొల్లూరులో పనులు చేసిన సంస్థ కూడా బల్దియాకు లేఖ అందజేసినట్టు ఓ అధికారి చెప్పారు. జీహెచ్‌ఎంసీకి అప్పగించని పక్షంలో పూర్తయిన ఇళ్ల వద్ద ఏ వస్తువు పోయినా తిరిగి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదే. ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డుల ఏర్పాటు కూడా ఆ ఏజెన్సీలకు అదనపు ఆర్థిక భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వెంటనే ఇళ్లు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. 


జీహెచ్‌ఎంసీ వెనకడుగు..

పన్నెండు చోట్ల రెండు పడకల ఇళ్ల వద్ద ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం విభాగం సిబ్బంది కాపలా కాస్తున్నారు. వీరి వేతనాల కోసం రూ.కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల్లోని ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఆర్థిక భారం పేరిట అటు నిర్మాణ సంస్థలు, ఇటు జీహెచ్‌ఎంసీ డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వద్ద భద్రత పట్టించుకోకపోవడంతో.. పేదల ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు ఇళ్లు అందజేయడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


రూ.3కోట్ల విలువైన సామగ్రి చోరీ

15,600 ఇళ్లు నిర్మించిన కొల్లూరులోని పలు బ్లాకు ల్లో విద్యుత్‌ వైర్లు, లిఫ్టుల కంట్రోలర్లు, ఇతర సామగ్రి చోరీ జరిగింది. వీటి విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. దాదాపు రూ.35-40 కోట్లతో కొల్లూరు గృహ సముదాయంలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు ఓ అధికారి చెప్పారు. సిద్ధమైన ఇతర ప్రాంతాల్లోని ఇళ్లలోనూ విద్యుత్‌ వైర్లు, నల్లాలు, పైపులు ఇతర సామగ్రి మాయమైందని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. 

Updated Date - 2022-02-13T18:07:39+05:30 IST