పెట్రోల్‌ బంకులో దొంగలు పడ్డారు

ABN , First Publish Date - 2022-05-25T05:57:16+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో ఖైదీల సంక్షేమం కోసం కడప సెంట్రల్‌ జైల్‌ ఆవరణలో మొట్టమొదటి పెట్రోల్‌బంక్‌ను ఏర్పాటు చేశారు. ఈ బంకు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం కోసం ఖర్చు చేయాలనేది ప్రధాన లక్ష్యం. అయితే అనతికాలంలోనే పెట్రోల్‌ బంక్‌ అనూహ్య ఆదరణ పొందింది. కొన్ని పెట్రోల్‌ బంకుల్లో డీజల్‌, పెట్రోల్‌ కల్తీ జరుగుతుందనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ జైలు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ వాహనదారులతో కిటకిటలాడేది. నగరం నడిబొడ్డున ఉంటున్న వారు కూడా కొందరు తమ వాహనాల్లో డీజల్‌, పెట్రోల్‌ పట్టించుకొనేందుకు సెంట్రల్‌ జైల్‌ వద్దకు వెళ్లే వారంటే..

పెట్రోల్‌ బంకులో దొంగలు పడ్డారు
సెంట్రల్‌ జైల్‌ వద్ద ఉన్న పెట్రోల్‌ బంక్‌

సెంట్రల్‌ జైల్‌ పెట్రోల్‌ బంకులో దోపిడీ

ఆవిరి పేరిట సిబ్బంది చేతివాటం   

40 లక్షల లీటర్లు లాగేసినట్లు ఆరోపణలు

అవకతవకలపై అధికారుల విచారణ 

కడప, మే 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో ఖైదీల సంక్షేమం కోసం కడప సెంట్రల్‌ జైల్‌ ఆవరణలో మొట్టమొదటి పెట్రోల్‌బంక్‌ను ఏర్పాటు చేశారు. ఈ బంకు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం కోసం ఖర్చు చేయాలనేది ప్రధాన లక్ష్యం. అయితే అనతికాలంలోనే పెట్రోల్‌ బంక్‌ అనూహ్య ఆదరణ పొందింది. కొన్ని పెట్రోల్‌ బంకుల్లో డీజల్‌, పెట్రోల్‌ కల్తీ జరుగుతుందనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ జైలు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ వాహనదారులతో కిటకిటలాడేది. నగరం నడిబొడ్డున ఉంటున్న వారు కూడా కొందరు తమ వాహనాల్లో డీజల్‌, పెట్రోల్‌ పట్టించుకొనేందుకు సెంట్రల్‌ జైల్‌ వద్దకు వెళ్లే వారంటే.. ఆ డీజల్‌, పెట్రోల్‌ అమ్మకాలపై అంత నమ్మకం ఉండేది. అక్కడ బిజినెస్‌ కూడా బాగా జరిగేది. అయితే అన్ని చోట్ల ఇంటి దొంగలు ఉన్నట్లే పెట్రోల్‌ బంకుల్లో కూడా ఇంటి దొంగలు పడి పెట్రోల్‌ లాగేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ బంక్‌లో పని చేస్తున్న ఖైదీలు కాకుండా కొందరు అధికారులే డీజల్‌ దొంగతనాలకు పాల్పడ్డారనే చర్చ సర్వత్రా నడుస్తోంది. అయితే ఆ డీజల్‌ను కాజేసిన వారు చోరీ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు నానా రకాల పాట్లు పడే వారు. నిజం నిప్పులాంటిదని.. కాస్త ఆలస్యమైనా నిజం తేలుతుందంటుంటారు. అన్నట్లుగా ఆలస్యమైనా డీజల్‌ చోరీ వ్యవహారం బయటపడడం గమనార్హం. అయితే చోరీ చేసిన డీజల్‌ ఎండకు ఆవిరైపోయినట్లు రికార్డు రాసి తప్పించుకునే యత్నం చేయగా సూపరింటెండెంట్‌ తనదైన స్టైల్‌లో విచారణ నిర్వహించడంతో ఈ వ్యవహారం బట్టబయలు అయినట్లు సమాచారం. 

కడప - రాజంపేట ప్రధాన రహదారిలో సెంట్రల్‌ జైల్‌ వద్ద పెట్రోల్‌బంక్‌ను ఏర్పాటు చేశారు. పెట్రోల్‌ బంక్‌లో వచ్చే ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టనున్నారు. సత్‌ప్రవర్థన ఖైదీలను మాత్రమే పెట్రోల్‌బంక్‌లో వాహనాలకు డీజల్‌, పెట్రోల్‌ పట్టేందుకు నియమించుకున్నారు. 

రోజూ 10 వేల లీటర్ల వినియోగం 

సెంట్రల్‌ జైలు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకు అనూహ్య ఆదరణ పొందింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండడంతో ఇక్కడ కల్తీ ఉండదనేది వాహనదారుల నమ్మకం. అందుకే ఎక్కువ మంది అక్కడ పెట్రోల్‌, డీజల్‌ వాహనాలకు పట్టించుకునే వారు. పెట్రోల్‌ బంక్‌ను కొందరు సిబ్బంది పర ్యవేక్షించేవారు. ఇక్కడ రోజూ సుమారు 10 వేల లీటర్ల దాకా పెట్రోల్‌, డీజల్‌ వినియోగం ఉంటుంది. మూడు షిప్టులలో సిబ్బంది పని చేస్తుంటారు. ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉంటారు. 

పెట్రోల్‌ డీజల్‌ ఇలా తాగేశారు...

పెట్రోల్‌, డీజల్‌ వినియోగంపై కన్నేసిన కొందరు సిబ్బంది ఎలా కాజేయాలని వక్రబుద్ధితో ఆలోచిస్తున్నట్లు చెబుతుంటారు. ఆ డీజల్‌ కాజేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. రోజూ డీజల్‌ ట్యాంకర్‌ వచ్చి పెట్రోల్‌, డీజల్‌ను నింపి పోతుంటాయి. ఉదాహరణకు పెట్రోల్‌ బంక్‌లో 30 వేల లీటర్ల స్టాక్‌ ఉంటే.. 10 వేల లీటర్లు మంగళవారం విక్రయించారనుకుందాం. అంటే ఆ పంపులో 20 వేల లీటర్లు ఉంటుంది. యదావిఽధిగా బుధవారం ట్యాంక్‌ వచ్చి మరో 20వేల లీటర్లు డీజల్‌ను లోడ్‌ చేసి ఉం టుంది. అంటే మొత్తం 40 వేల లీటర్లు ఉండాలి. అయితే పెట్రోల్‌ను కాజేసే ఓ బ్యాచ్‌ పెట్రోల్‌ను కొలిచే గేజ్‌రాడ్‌ను కోసేసి అక్రమాలకు తెరలేపినట్లు ప్రచారం ఉంది. గేజ్‌ రాడ్‌లో 5 వేల లీటర్లు తేడా ఉండేలా గేజ్‌ రాడ్‌ను కట్‌ చేసినట్లు చెబుతారు. ఆ రాడ్డుతో కొలిస్తే మామూలుగా డీజల్‌ ఉందనుకుంటారు. అయితే ముందస్తుగానే గేజ్‌ రాడ్‌ను కోయడంతో అక్కడ లేని డీజల్‌ ఉన్నట్లు చూపి రికార్డుల్లో నమోదు చేసినట్లు ప్రచారం ఉంది. అలాగే ప్రతి రోజూ వచ్చే డీజల్‌, పెట్రోల్‌ సంబంధించి ట్యాంకర్‌ నుంచి 5 లీటర్లు టెస్టింగ్‌ కోసం తీస్తారు. దాని నాణ్యత పరిశీలించి అనంతరం దానిని ట్యాంకర్‌లో పోయాల్సి ఉంది. అయితే దానిని కూడా సైడ్‌ చేసి అమ్ముకున్నట్లు చెబుతారు. నెలకు 300 లీటర్లు జనరేటర్‌ పేరిట ఖర్చులు రాసి డీజల్‌ తాగేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ట్యాంక్‌లోకి వర్షం నీరు చేరినట్లు చెబుతారు. సుమారు 7 వేల లీటర్లు వర్షం నీటితో పాడైందని చెబుతారు. అయితే ఓ కెమికల్‌ వేస్తే డీజల్‌ నీళ్లు వేరువేరై డీజల్‌ను ఉపయోగించుకోవచ్చని చెబుతారు. అయితే ఆ డీజల్‌  కూడా పనికిరాదని చూపి తాగేసినట్లు సమాచారం. ఇలా అడ్డదారిలో లాగేసిన డీజల్‌ను అతి తక్కువ ధరకే విక్రయించినట్లు ప్రచారం ఉంది. సుమారు 40 లక్షల లీటర్ల దాకా ఇలా అడ్డదారుల్లో లాగేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాలు లేకపోవడంతో డీజల్‌ కుంభకోణానికి దారితీసినట్లు అంటున్నారు.

విచారణ చేస్తున్నాం 

- ఐ.ప్రకాష్‌, సూపరింటెండెంట్‌, సెంట్రల్‌ జైలు, కడప 

పెట్రోల్‌ బంక్‌లో డీజల్‌ అవకతవకలపై విచారణ చేస్తున్నాం. 40 లక్షల  లీటర్ల డీజల్‌ గోల్‌మాల్‌ జరగలేదు. అన్ని ఆడిట్‌ చేస్తున్నాం. విచారణ పూర్తి అయిన తరువాత నిజాలు భయటపడతాయి.

Updated Date - 2022-05-25T05:57:16+05:30 IST