అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-02-25T15:30:13+05:30 IST

ఎనిమిది మందితో కూడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50.50లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్‌ అతిథి

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

- రూ.50.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం

- ఎనిమిది మందికి రిమాండ్‌


చిత్తూరు: ఎనిమిది మందితో కూడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50.50లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్‌ అతిథి గృహంలో డీఎస్పీ సుధాకర్‌రెడ్డితో కలిసి డీఐజీ సెంథిల్‌కుమార్‌ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇటీవల హౌస్‌ బ్రేకింగ్‌, చైన్‌స్నాచింగ్‌లతోపాటు బస్సులు, బస్టాండ్లలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. వీటిపై డీఐజీ ప్రత్యేక దృష్టి సారించారు. దొంగలను పట్టుకోవడానికి చిత్తూరు తాలూకా సీఐ బాలయ్య ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు, పాకాల సీఐ ఆశీర్వాదం ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా మొత్తం ఎనిమిది మందితో కూడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఇదంతా చేస్తున్నట్లు నిర్ధారించారు. వీరిలో.. తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టుకు చెందిన రఘు, అంబూరుకు చెందిన హమీద్‌ జిల్లాలో పలుచోట్ల చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. రఘు అయితే తమిళనాడులోని ఏఆర్‌ విభాగంలో పనిచేసి, సస్పెండ్‌ అయ్యాడు. ఇతడిపై తమిళనాడులోని షోలింగర్‌లో దారి దోపిడీ, బలవంతపు వసూళ్లు చేశాడన్న కేసులున్నాయి. హమీద్‌ కూడా ఆంబూరులో జరిగిన ఓ కిడ్నాప్‌ కేసులో నిందితుడిగా ఉన్నాడు. హౌస్‌ బ్రేకింగ్‌ చేసి.. దొంగతనాలకు పాల్పడిన తిరుపత్తూరు జిల్లా కరంబూరుకు చెం దిన శక్తివేల్‌ కూడా తమిళనాడులోని వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్లు తేలింది. రెండో నిందితుడిగా ఉన్న రాజు చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లె, కుప్పం, పలమనేరు, వి.కోట, చిత్తూరు, పాలసముద్రం, జీడీ నెల్లూరు, పూతలపట్టు మండలాల్లో నేరాలకు పాల్పడ్డాడు. కాగా.. కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లాలోని ఎన్‌.ఉష(40), శాంతి(55), సెల్వి(40), తమిళనాడుకు చెందిన వళ్లి(39)లు బస్సులు, బస్టాండ్ల వద్ద జనం దృష్టి మరల్చి.. హ్యాండు బ్యాగులోని బంగారం, నగదును దోచేసేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఎనిమిది మందినీ గురువారం ఉదయం చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌, పూతలపట్టు - రంగంపేట క్రాస్‌, తూగుండ్రం క్రాస్‌ వద్ద అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ.50లక్షల విలువైన కిలో బంగారు ఆభరణాలు, రూ.50వేల విలువైన 200గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకున్న అధికారులు, సిబ్బందిని డీఐజీ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2022-02-25T15:30:13+05:30 IST