తంబీ.. నిన్ను పోలీసులు పట్టుకోలేరు.. దొంగతనం సమయంలో ఇలా చేయొద్దు..!

ABN , First Publish Date - 2022-01-02T17:02:23+05:30 IST

తంబీ.. నిన్ను పోలీసులు పట్టుకోలేరు.. దొంగతనం సమయంలో ఇలా చేయొద్దు..!

తంబీ.. నిన్ను పోలీసులు పట్టుకోలేరు.. దొంగతనం సమయంలో ఇలా చేయొద్దు..!

                       - నష్టం చేయొద్దు

                        - దొంగకు న్యాయవాది లేఖ


పెరంబూర్‌(చెన్నై): దొంగకు లేఖ రాసి, బీరువాకు అంటించి వెళ్లిన న్యాయవాది తీరు కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... స్థానిక ఈస్ట్‌ తాంబరం గణపతిపురం నార్త్‌ వీధికి చెందిన న్యాయవాది గాడ్విన్‌షడ్రక్‌ ఇంట్లో 2018లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి 55 సవర్ల నగలు, రూ.25 వేల నగదు దోచుకొని వెళ్లారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సేలయూర్‌ పోలీసులు, చోరీ జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు సేకరించి, సీసీ ఫుటేజీ ఆధారంగా గాలించినా దొంగ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో, 2019లో మళ్లీ న్యాయవాది ఇంట్లో ప్రవేశించి బీరువా బద్దలు కొట్టిన దొంగ బంగారు ఉంగరం దోచుకుని వెళ్లాడు. ఈ ఘటనలోను వేలిముద్రల సేకరణ, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గాలించినా దొంగ ఆచూకీ దొరకలేదు. ఈ విషయం పోలీసులు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినా ఇప్పటివరకు దొంగ జాడ పసిగట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో, గత నెల 28న స్వగ్రామానికి బయలుదేరిన న్యాయవాది ‘తంబీ... బీరువా ధ్వంసం చెయ్యొద్దు.. నిన్ను పోలీసులు పట్టుకోలేరు.. నష్టపరచొద్దు’ అంటూ లేఖ రాసి బీరువాపై అంటించి వెళ్లాడు.


 ఈ విషయమై న్యాయవాది గాడ్విన్‌ షడ్రక్‌ మాట్లాడుతూ, రెండుసార్లు దొంగతనం జరిగిన తర్వాత 2020లో ఊరికి వెళ్లే సమయంలో సేలయూర్‌ పోలీస్‌స్టేషన్‌లో సమాచార మిచ్చి ఇంటికి భద్రత కల్పించాలని కోరగా, ఇంట్లో విలువైన వస్తువులు లేవు అని లేఖ రాసి ఇవ్వాలని కోరారని తెలిపారు. అందువల్ల ఈసారి ఈ విధంగా దొంగనే అభ్యర్ధించానని తెలిపారు. బీరువాకు లేఖ అంటించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - 2022-01-02T17:02:23+05:30 IST