షాపును దోచుకుని డ్యాన్స్ చేసిన దొంగ.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-04-19T23:21:24+05:30 IST

ఓ దుకాణంలోకి చొరబడిన దొంగ దోచుకున్న ఆనందంలో షాపులోనే డ్యాన్స్ చేశాడు. అక్కడనున్న సీసీటీవీ కెమెరాకు

షాపును దోచుకుని డ్యాన్స్ చేసిన దొంగ.. వీడియో వైరల్

లక్నో: ఓ దుకాణంలోకి చొరబడిన దొంగ దోచుకున్న ఆనందంలో షాపులోనే డ్యాన్స్ చేశాడు. అక్కడనున్న సీసీటీవీ కెమెరాకు ఆ దృశ్యం చిక్కింది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో జరిగిందీ ఘటన. ఓ హార్డ్‌వేర్ షాపులోకి ప్రవేశించిన దొంగ విజయానందంతో లోపలే స్పెప్పులేశాడు. ఇప్పుడీ ‘దొంగ డ్యాన్సర్’ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చందౌలీ మార్కెట్‌లో ఉన్న ఆ దుకాణం యజమాని పేరు అన్షు సింగ్. 


ఏప్రిల్ 16న తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పెద్దగా కష్టపడకుండానే లోపలికి చొరబడిన దొంగ క్యాష్ కౌంటర్‌లో ఉన్న నగదు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో షాపులో ఇన్‌స్టాల్ చేసిన సీసీటీవీ కెమెరాను చూశాడు. అయినా ఏమాత్రం భయపడలేదు సరికదా.. డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. కాసేపు డ్యాన్స్ చేశాక వచ్చిన దారిగుండా బయటకు వెళ్లిపోయాడు. ఇంతకీ అతడు దోచుకున్న ఆనందంలోనే డ్యాన్స్ చేశాడా? ఏమో.. ఈ ప్రశ్నకు అతడే సమాధానం చెప్పాలి.


తర్వాతి రోజు అన్షుసింగ్ దుకాణానికి వచ్చి షట్టర్ విరగ్గొట్టి ఉండడం చూసి షాకయ్యాడు. లోపలికి వెళ్లి చూసి కౌంటర్‌లోని నగదు మాయం కావడాన్ని గమనించాడు. ఆపై సీసీటీవీని చెక్ చేయడంతో దొంగతనం విషయం బయటకు వచ్చింది. వెంటనే ఆయన చందౌలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  



Updated Date - 2022-04-19T23:21:24+05:30 IST