Abn logo
Oct 18 2020 @ 14:00PM

దోపిడీ దొంగలు దొరికారు!

Kaakateeya

మాదకద్రవ్యాల సరఫరా ముఠా ఆట కూడా కట్‌

10 మంది అరెస్టు 8 రెండు గ్యాంగ్‌ల మధ్య సంబంధాలు

కారు  సహా రూ. 9.60 లక్షల సొత్తు స్వాధీనం 

కొకైన్‌ లాంటి పౌడర్‌, 9 కిలోల గంజాయి, బొమ్మ తుపాకీ సీజ్‌

వివరాలను వెల్లడించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌


ఒంగోలు: అంతర్‌ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాతోపాటు, మాదకద్రవ్యాలు సరఫరా చేసే మరో గ్యాంగ్‌ను ప్రకాశం పోలీసులు పట్టుకున్నారు. 10 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద తొమ్మిది కిలోల గంజాయి, కారు, కొకైన్‌ లాంటి పౌడర్‌, కొన్ని విదేశీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ శనివారం వెల్లడించారు.  ఈ రెండు ము ఠాలకు అనేక సంబంధాలు ఉన్నట్లు తమ విచారణలో గుర్తించామన్నారు. వారి మధ్య ఆర్థిక లావాదేవీలతోపాటు మాదకద్రవ్యాల మార్పిడి జరిగిందని చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా తడకు చెందిన మొండి నవీన్‌, పల్లెపాలెంకు చెందిన ఆతాపాకం అజిత్‌ అలియాస్‌ అజిత్‌రెడ్డి, కోవూరు మండలం చీమలవారిపాలెంకు చెందిన హబీబుల్లా మహ్మద్‌ జాఫర్‌ సాధిక్‌, సూళ్లూరుపేట మండలం మన్నార్‌పేటకు చెందిన వేనాటి జ్ఞానేష్‌, సూళ్లూరుపేట బాలాజీ కాలనీకి చెందిన వేమనబోయిన సాయి సందీ్‌ప ఒక ముఠాగా ఏర్పడ్డారు. కారులో నెల్లూరు నుంచి విశాఖ వరకూ ప్రయాణిస్తూ  జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడటం ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి టంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద లారీ డ్రైవర్‌ వెంకటేశ్వరరావును కత్తితో బెదిరించి ఒక సెల్‌ఫోన్‌, ఆరువేలు అపహరించుకెళ్లారు. అదేరోజు అక్కడి నుంచి కొద్దిదూరం వెళ్లి  పెట్రోల్‌ బంకు వద్ద ఆగి ఉన్న మరో లారీలోని డ్రైవర్‌పై దాడి చేసి రూ.వెయ్యి దోచుకున్నారు. ఈ రెండు సంఘటనలపై టంగుటూరు పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. శనివారం టంగుటూరు బీవీఆర్‌ గ్రానై ట్‌ ఫ్యాక్టరీ వద్ద ఐదుగురు నిందితులను సింగరాయకొండ సర్కిల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారివద్ద ఎనిమిది లక్షల విలువైన కారు, కత్తి, ఏడు కేజీల గంజాయి, ఒక సెల్‌ఫోన్‌, ఐదువేల నగదు మొత్తం రూ. 8.60లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దోపిడీలు చేసినట్టు సమాచారం ఉందని ఎస్పీ  చెప్పారు. 


మాదక ద్రవ్యాల సరఫరాతోపాటు మోసాలు

నెల్లూరు జిల్లా తడకు చెందిన సయ్యద్‌ రెహమాన్‌ బా షా, వేదాయపాళెం మండలం చిట్టేటి చంద్రశేఖర్‌, పుత్తూరుకు చెందిన చండ్ర మహేష్‌, తమిళనాడు మనాలి గ్రామానికి చెందిన పళని దినేష్‌ , తిరువల్లూరు జిల్లాకు చెందిన కొండ స్వామిలు ముఠాగా ఏర్పడి మాదక ద్రవ్యాలను సరఫరా చేయడంతోపాటు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. దోపిడీ దొంగల ముఠాను విచారించే సమయంలో మాదక ద్రవ్యాల సరఫరా ముఠా సమాచారం వెల్లడైంది. దీంతో నెల్లూరు జిల్లా తడ వద్ద సయ్యద్‌ రెహమాన్‌ బాషాను అరెస్ట్‌ చేసి వంద గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చెన్నయ్‌లోని రాటల్‌ చేపల చెరువు వద్ద ఈ ముఠాలోని మిగిలిన నలుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద రెండు కిలోల గంజాయి, 850 గ్రాముల కొకైన్‌ లాంటి తెల్లని పౌడర్‌, డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష వరకూ ఉంటుందని ఎస్పీ చెప్పారు. ఈ రెండు ముఠాలను పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ కనబర్చిన ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌, సింగరాయకొండ, ఒంగోలు రూరల్‌, ఇంకొల్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు ఎం. శ్రీనివాసరావు, పి. సుబ్బారావు, ఎమ్‌డీ అల్తాఫ్‌తోపాటు పీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు, ఎస్సైలు ఎం. శ్రీనివాసరావు, సంపత్‌కుమార్‌, వి. రాంబాబు, నాయబ్‌రసూల్‌ను అభినందించి రివార్డులు అందజేశారు.


Advertisement
Advertisement
Advertisement