అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2020-09-27T06:58:05+05:30 IST

ఏటీఎం సెంటర్ల వద్దకు వచ్చే అమాయకులకు డబ్బు లు డ్రా చేసిస్తానని చెప్పి కార్డును మార్చి డబ్బు దొంగతనానికి పాల్పడే నిందితుడిని శనివారం సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు...

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

18 ఏటీఎం కార్డులు, రూ.80 వేలు స్వాధీనం

నిందితుడిపై 110 కేసులు  


సిద్దిపేట క్రైం, సెప్టెంబరు: ఏటీఎం సెంటర్ల వద్దకు వచ్చే అమాయకులకు డబ్బు లు డ్రా చేసిస్తానని చెప్పి కార్డును మార్చి డబ్బు దొంగతనానికి పాల్పడే నిందితుడిని శనివారం సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సీఐ సైదులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటకు చెందిన పర్వతం రమేశ్‌ జూన్‌ 23న పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అంతకు ముందునుంచే అక్కడ ఉన్న ఓ వ్యక్తికి ఏటీఎం కార్డును ఇచ్చి రూ. 10 వేలను డ్రా చేయించాడు. అయితే ఆ వ్యక్తి రమేశ్‌కు ఆ కార్డుకు బదులుగా మరో కార్డును ఇచ్చి బురిడీ కొట్టించాడు.


పిన్‌ నంబర్‌ తెలిసి ఉండడం వల్ల వేరొకచోట రూ.65 వేలు డ్రా చేసుకున్నాడు. దీంతో రమేశ్‌ తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను చూసి కార్డు మారిన విషయాన్ని గుర్తించాడు. అదే రోజు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  కేసు పరిశోధనలో భాగంగా వన్‌ టౌన్‌ సీఐ సైదులు, టాస్క్‌ఫోర్సు సీఐ నరసింహారావు, వన్‌టౌన్‌ ఎస్‌ఐ రాజేశ్‌, క్రైం పార్టీ సిబ్బంది యాదగిరి, రాంజీ, కనకరాజు, శివకుమార్‌, అశోక్‌, రాము, ఒక స్పెషల్‌ టీంగా ఏర్పడి నిందితుల గురించి గాలింపు చేపట్టారు. కాగా శనివారం సిద్దిపేటలోని పాత బస్టాండ్‌ వద్ద గల ఏటీఎం సెంటర్‌ వద్ద పోలీస్‌ జీపును చూసి ఓ వ్యక్తి పారిపోతుండగా అతడిని వెంబడించి పట్టుకొని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడు ఏపీలోని రాజమండ్రికి చెందిన కొప్పిశెట్టి రాజ్‌కుమార్‌గా గుర్తించారు.  రాజ్‌కుమార్‌ మహారాష్ట్ర, ఛత్తీ్‌సఘడ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలు చేసినట్లు సీఐ సైదులు తెలిపారు.


నిందితుడి నుంచి రూ.80 వేల నగదు, వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులను రికవరీ చేసి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు. గజ్వేల్‌ పట్టణంలో ఏటీఎం మార్చిన ఘటనలో రెండు, సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఒకటి, చేగుంట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఒక కేసు మొత్తం నాలుగు కేసులు నిందితుడిపై నమోదు అయినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఏటీఎం కార్డు మార్చి దొంగతనం చేసిన ఘటనలో నిందితుడిపై 110 కేసులు ఉన్నట్లు, 10 సార్లు జైలు శిక్ష అనుభవించినట్లు తెలిసిందన్నారు.

Updated Date - 2020-09-27T06:58:05+05:30 IST