UP sisters : అమ్మను హత్య చేసిన నాన్నకు శిక్ష కోరుతూ అక్కాచెల్లెళ్ల పోరాటం.. 6 ఏళ్ల తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ఇదీ..

ABN , First Publish Date - 2022-07-29T21:51:00+05:30 IST

కళ్లెదుటే కన్నతల్లి మంటల్లో కాలిపోతుంటే(Mother Burnt Alive) ఇద్దరు చిన్నారులు నిస్సహాయ స్థితిలో సొమ్మసిల్లేలా ఏడ్చారు.

UP sisters : అమ్మను హత్య చేసిన నాన్నకు శిక్ష కోరుతూ అక్కాచెల్లెళ్ల పోరాటం.. 6 ఏళ్ల తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ఇదీ..

న్యూఢిల్లీ : కళ్లెదుటే కన్నతల్లి మంటల్లో కాలిపోతుంటే(Mother Burnt Alive) ఇద్దరు చిన్నారులు నిస్సహాయ స్థితిలో సొమ్మసిల్లేలా ఏడ్చారు. కొడుకుని కనలేదంటూ కన్నతండ్రే ఈ కర్కశత్వానికి ఒడిగట్టడాన్ని ఆ అక్కాచెల్లెళ్లు(Sisters) జీర్ణించుకోలేకపోయారు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలంటే నాన్న(Father)కు శిక్ష పడాల్సిందేనని ఇద్దరూ సంకల్పించారు. ఆరేళ్ల పోరాటం తర్వాత ఇప్పుడు నాన్నకు జీవితకాల  జైలుశిక్ష(Jail) పడడాన్ని మనసారా ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు తన్యా(Tanya), లతికా(Lathika) విషాదగాధ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)కు చెందిన మనోజ్ బన్సల్(48) 2000వ సంవత్సరంలో అను బన్సల్ అనే మహిళను వివాహమాడాడు. వీరికి తొలి రెండు సంతనాల్లో ఆడపిల్లలు తన్యా(ప్రస్తుతం 18), లతికా(20) పుట్టారు. అప్పటినుంచి మగ పిల్లాడు కావాలంటూ మనోజ్ తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు. చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 సార్లు అబార్షన్ చేయించాడు. భర్తతోపాటు అత్తంటివారి బంధువులు కూడా ఆమెను నానా ఇబ్బందులకు గురిచేశారు. 2016 జూన్‌ నెలలో భార్య అనుని ఒక గదిలో ఉంచి మనోజ్ నిప్పంటిచాడు. అతడికి బంధువులు కూడా సహకరించారు. ఈ ఘాతుకానికి ముందు కూతుళ్లు తన్యా, లతికలను వేరే గదిలో బంధించారు. తీవ్రంగా  కాలిన గాయాలతో 6 రోజుల తర్వాత 20 జూన్ 2016న హాస్పిటల్లో అను కన్నుమూసింది. ఈ ఘటనపై బాలికల అమ్మమ్మ(మృతురాలి తల్లి) పోలీసు కేసు పెట్టింది. తల్లికి న్యాయం జరగాలంటూ 12, 14 ఏళ్ల వయసులోనే అక్కాచెల్లెళ్లు పట్టుబట్టారు. యూపీ ముఖ్యమంత్రిగా అభిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఉన్నప్పుడు ఆయనను బాలికలు కలిశారు. ‘ మా అమ్మకు న్యాయం జరగాలి. నాన్నకు శిక్ష పడేలా హామీ ఇవ్వండి’’ అని విజ్ఞప్తి చేశారు.


బాలికల సుదీర్ఘ పోరాటం తర్వాత మనోజ్‌కు జీవితకాల జైలుశిక్ష విధిస్తూ బులంద్‌షెహర్‌లోని కోర్ట్ ఈ బుధవారమే తీర్పునిచ్చింది. ఈ తీర్పులో అక్కాచెల్లెళ్ల సాక్ష్యమే కీలకమైంది. ‘‘ కళ్ల ముందే బతికున్న అమ్మను కాల్చివేశారు. మమ్మల్ని గదిలో ఉంచి ఈ దారుణానికి ఒడిగట్టారు’’ అని కోర్టుకు సాక్ష్యమిచ్చారు. ఆధారాలను పరిశీలించిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. దీంతో 6 ఏళ్ల తర్వాత నాన్నకు జైలుశిక్ష పడడం పట్ల అక్కాచెల్లెళ్లు సంతోషం వ్యక్తం చేశారు. నాన్న, నాన్న తరపు వాళ్లు తమను చూసి ఎగాతాళి చేశారని, ప్రస్తుతం వాళ్లందరికీ శిక్షపడడం సంతోషంగా ఉందని చెప్పారు. నాన్న జైలుకెళ్లడం చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తోందన్నారు. అమ్మ తమను ఎంతో కష్టపడి పెంచిందని, అలాంటి అమ్మను బతికుండగానే నిప్పుతో కాల్చారని ఇద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ దృష్టిలో అతనొక దెయ్యం అని తండ్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


కాగా ఈ ఘటనలో తొలుత దర్యాప్తుకు వెళ్లిన పోలీసులు ఆత్మహత్యగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. బాలికలు, అమ్మమ్మ న్యాయం పోరాటం తర్వాత ఆత్మహత్య కేసు కాస్తా హత్యగా మారిందని బాలికలు, అమ్మమ్మ తరపున వాదించిన లాయర్ సంజయ్ శర్మ వెల్లడించారు. దోషులకు శిక్ష పడేందుకు ఇంతకాలం పోరాడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కేసులో ప్రధాన దోషి మనోజ్‌తోపాటు అతడి బంధువుల మరో ఏడుగురు కూడా దోషులుగా తేలారని వివరించారు.

Updated Date - 2022-07-29T21:51:00+05:30 IST