ఇళ్లు కట్టించాకే ఖాళీ చేయమన్నారు కదా

ABN , First Publish Date - 2022-09-28T05:00:37+05:30 IST

మీనాపురంలోని జగనన్న కాలనీలో ఇళ్లు కట్టించి ఇచ్చాకే వాజ్‌పేయి నగర్‌ ఖాళీ చేయమన్నారు కదా అని వాజ్‌పేయి నగర్‌ దళిత మహిళలు జమ్మలమడుగు ఆర్డీవో ఎదుట వాదించారు. మంగళవారం స్ధానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు వాజ్‌పేయినగర్‌ వాసులతో భేటీ అయ్యారు.

ఇళ్లు కట్టించాకే ఖాళీ చేయమన్నారు కదా
వాజ్‌పేయి నగర్‌ వాసులతో మాట్లాడుతున్న ఆర్డీవో

ప్రశ్నించిన లబ్ధిదారులు

ఆ మాట మీ ఎమ్మెల్యే చెప్పారు.. ఆయననే అడగండి

జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు

ప్రొద్దుటూరుఅర్బన్‌, సెప్టెంబరు 27: మీనాపురంలోని జగనన్న కాలనీలో ఇళ్లు కట్టించి ఇచ్చాకే వాజ్‌పేయి నగర్‌ ఖాళీ చేయమన్నారు కదా అని వాజ్‌పేయి నగర్‌ దళిత మహిళలు జమ్మలమడుగు ఆర్డీవో ఎదుట వాదించారు. మంగళవారం స్ధానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు వాజ్‌పేయినగర్‌ వాసులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ వాజ్‌పేయినగర్‌లో పట్టా భూములు ఆక్రమించి నిర్మించుకున్న వారంతా ఖాళీ చేయాలని కోర్టు ఇచ్చిన గడువు తీరి నెలరోజులు దాటిందన్నారు. మీరు ఖాళీ చేయకుంటే బలవంతంగా పోలీసు బలగాలతో ఖాళీ చేయించాల్సి వస్తుందన్నారు. ఇందుకు వాజ్‌పేయి నగర్‌ మహిళలు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్యాలయంలో మీరు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మీ సమక్షంలోనే జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టించి ఇచ్చాకే వాళ్లు ఖాళీ చేస్తారని చెప్పారు కదా అన్నారు. ఇందుకు ఆర్డీవో మాట్లాడుతూ ‘‘ఆ విషయంఎమ్మెల్యే చెప్పారు కానీ మేము చెప్పలేదుకదా.. అది మీకు చెప్పిన ఎమ్మెల్యేనే అడగండి. మావంతుగా పేదలయిన మీకు ఇంటి స్థలాలు ఇచ్చాం. ఇంటికి కలెక్టర్‌ ద్వారా రుణం మంజూరు చేయించాం. ఇళ్లు కట్టుకోవాల్సింది మీరు. లేదా మీకు ఎవరు కట్టించి ఇస్తామన్నారో వారిని అడగండి. అంతే గానీ ఖాళీ చేయమని అంటే కుదరదు’’ అని తేల్చి చెప్పారు. ఇందుకు మహిళలు స్పందిస్తూ ఇళ్ళు కట్టించుకోవాలంటే ఖాళీ చేసి వెళదామంటే దళితులమని తమకు ఎవరు ఇళ్లు అద్దెకు ఇవ్వడం లేదన్నారు. నిండు గర్బిణీలు ఉన్నారన్నారు. మీరు తరిమేస్తే ఎక్కడ తలదాచుకోవాలో చెప్పండన్నారు. అందుకు ఆర్డీవో మాట్లాడుతూ మీరు ఖాళీ చేస్తామంటే మున్సిపల్‌ అధికారులు తాత్కాలికంగా షెల్టర్‌ ఏర్పాచేస్తారని అన్నారు. దసరా పండుగ ముగిసిన పదిరోజుల వరకు గడువు ఇస్తున్నామని, ఆలోపు ఖాళీ చేయకుంటే పోలీసు బలగాలతో బలవంతంగా ఖాళీ చేయించకతప్పదని తేల్చిచెప్పారు. ఇందుకు మహిళలు తమకు ఇళ్లు కట్టించి ఇచ్చేవరకు ఖాళీ చేయమని చెప్పి వెళ్లి పోయారు. ఆ తరువాత తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమణయ్య, సీఐ ఇబ్రహీం, ట్రాన్స్‌కో ఈఈ శ్రీనివాసులరెడ్డితో ఆర్డీవో మాట్లాడుతూ వాజ్‌పేయినగర్‌ వాసులకు దసరా పండుగ తరువాత విద్యుత్‌ సరఫరాను తాగునీటి సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. పోలీసు బలగాలకోసం ఎస్పీకి ప్రొద్దుటూరు ఏఎస్పీ ద్వారా లెటర్‌ పెట్టాలని తెలిపారు. పండుగ తరువాత ఖాళీ చేయించి తీరాల్సిందేనని లేకుంటే హైకోర్టు ధిక్కరణ కింద మనం కోర్టు ముందు నిలబడాల్సి వస్తుందని ఆయన అధికారులకు తెలిపారు.

Updated Date - 2022-09-28T05:00:37+05:30 IST