తాలు పేరిట ధాన్యం తగ్గించేశారు

ABN , First Publish Date - 2020-06-05T10:30:50+05:30 IST

పభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అమ్మగా తాలు పేరిట బస్తాలకు బస్లాలే బిల్లుల నుంచి తగ్గించారని రైతులు

తాలు పేరిట ధాన్యం తగ్గించేశారు

 దత్తప్పగూడెం కొనుగోలు కేంద్రంలో రైతులకు టోపీ


మోత్కూరు, జూన్‌ 4: పభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అమ్మగా తాలు పేరిట బస్తాలకు బస్లాలే బిల్లుల నుంచి తగ్గించారని  రైతులు గగ్గోలు పెడుతున్నారు.  మోత్కూరు రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో మండంలోని దత్తప్పగూడెంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తమకు అన్యాయం జరిగిందని రైతులు చెబుతున్నారు.  బస్తాలకు బస్తాలు గోల్‌మాల్‌ చేశారని ఆరోపిస్తున్నారు. ఒక్కో ధాన్యం బస్తా 40 కిలోలు  ఉందన్నారు. ఒక్కో కిలో ధాన్యం రూ.18.35 వంతున 40 కిలోల బస్తాకు నిర్వాహకులు రూ.734 చెల్లించాల్సి ఉందన్నారు.  ధాన్యం బస్తాలను తూకం వేసిన వెంటనే నిర్వాహకులు బిల్లు ఇవ్వలేదని,  బిల్లులు వచ్చాక చూస్తే చాలా బస్తాలకు బిల్లుకు తగ్గించారని ఎంపీటీసీ ఎ.లక్ష్మణాచారి, రైతులు ఆవుల వెంకన్న, వంగూరి కొమురయ్య, తొంట యాదగిరితో పాటు పలువురు ఆరోపించారు. ధాన్యం తూకం వేసిన వెంటనే తమ బస్తాలకు బిల్లు ఇవ్వమని అడిగితే  పని ఒత్తిడిలో ఉన్నామని తర్వాత ఇస్తామని అఽధికారులు సమాధానాన్ని దాటవేశారని రైతులు తెలిపారు.


ధాన్యం బిల్లులు  వచ్చిన తర్వాత చేస్తే 46 బస్తాల ధాన్యం అమ్మగా 26 బస్తాలకే డబ్బు ఇచ్చారని రైతు తొంట యాదగిరి  తెలిపారు.  ఒక్కో బస్తా రూ.734 వంతున తగ్గించిన 20 బస్తాలకు రూ.14,680 నష్టపోయానని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. 10  బస్తాల బిల్లు తగ్గిందని  ఆవుల వెంకన్న,  ఆరు బస్తాల బిల్లు తక్కువ వచ్చిందని వంగూరి కొమురయ్య తెలిపారు. ఇంత తగ్గించడం ఏమిటని కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు మహే్‌షను ప్రశ్నించగా  ధాన్యంలో  తాలు ఎక్కువగా ఉందని రైస్‌ మిల్లర్‌ ధాన్యం బస్తాలు తగ్గించారని చెప్పాడన్నారు.  సంబంధిత ఉన్నతాధికారులు  స్పందించి కొనుగోలు కేంద్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. 


20 బస్తాల ధాన్యాన్ని నష్టపోయా

కొనుగోలు కేంద్రంలో బస్తాకు రూ.14 చొప్పున హమాలీలకు 46 బస్తాలకు రూ.650 హమాలి ఇచ్చాను. తూకం వేసిన వెంటనే బిల్లు (రశీదు) ఇవ్వమంటే ఇవ్వలేదు. నాకు 26 బస్తాలకే బిల్లు వచ్చింది. మరో  20 బస్తాల బిల్లు ఇప్పించాలి.

తొంట యాదగిరి, రైతు, దత్తప్పగూడెం

Updated Date - 2020-06-05T10:30:50+05:30 IST