పంచాయతీ ఎన్నికల్లో సహకరించనందుకు బంధువును హత్య చేసి...

ABN , First Publish Date - 2020-08-11T17:59:00+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో సహకరించనందుకు బంధువును హత్య చేసిన నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను యాదాద్రి డీసీపీ కె.నారాయణరెడ్డి విలేకరులకు వివరించారు

పంచాయతీ ఎన్నికల్లో సహకరించనందుకు బంధువును హత్య చేసి...

బంధువును హత్య చేసిన నిందితుల అరెస్టు


చౌటుప్పల్‌ రూరల్‌(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో సహకరించనందుకు బంధువును హత్య చేసిన నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను యాదాద్రి డీసీపీ కె.నారాయణరెడ్డి విలేకరులకు వివరించారు. చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట గ్రామానికి చెందిన దండుగుల ఎల్లమ్మ 2019లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎల్లమ్మ బంధువైన ముద్దాంగుల వెంకటేశం కుటుంబం ప్రత్యర్థికి మద్దతు ఇచ్చారు. దీంతో ఎల్లమ్మ కుమారులు వెంకటేశం కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. ఎన్నికల నాటి నుంచి తరచూ ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండేవి. అనేకసార్లు పంచాయితీలు జరిగాయి. 


ఈ క్రమంలో ఈ నెల 7న రాత్రి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. విషయం తెలుసుకున్న ముద్దాంగుల వెంకటేశం తన భార్య రత్నమ్మతో కలిసి బైక్‌పై సమీప గ్రామం కొత్తగూడెం నుంచి తూప్రాన్‌పేటకు చేరుకున్నాడు. అప్పటికే ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. కోపోద్రిక్తులైన ఎల్లమ్మ కుటుంబ సభ్యులు ముద్దాంగుల వెంకటేశంపై(49)పై ఒక్కసారిగా దాడిచేశారు. ఇనుపరాడ్డుతో తలపై బాదారు. గాయలకు గురైన వెంకటేశంను ఆస్పత్రికి తరలించగా మృతి చెం దాడు. వెంకటేశంను హత్య చేసిన దండుగుల యాదగిరి, దండుగుల రమేష్‌, దండుగుల దేవేందర్‌, దండుగుల వెంకటేశంను అరెస్టు చేసి రామన్నపేట కోర్టుకు రిమాండ్‌ చేశారు. మరో నిందితుడు దండుగల వెంకటేశ్‌ పరారీలో ఉన్నాడు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకన్నగౌడ్‌, ఎస్‌ఐ నర్సయ్య ఉన్నారు. 

Updated Date - 2020-08-11T17:59:00+05:30 IST