వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-03-31T22:14:01+05:30 IST

ఢిల్లీ సదస్సులో పాల్గొన్న ముస్లింలు స్వచ్చంధంగా..

వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి: రామకృష్ణ

అమరావతి: ఢిల్లీ సదస్సులో పాల్గొన్న ముస్లింలు స్వచ్చంధంగా కరోనా పరీక్షలు చేయించు కోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రార్థనలకు ఏపీ నుంచి హజరైన ముస్లింలు తమ వంతు సామాజిక బాధ్యతగా కరోనా నెగిటివ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో.. దేశంలో సున్నిత పరిస్థితులు చోటు చేసుకున్నందున.. కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు చేపట్టిన చర్యలకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న కొందరికి కరోనా పాజిటివ్ రావటం విచారకరమని, అయినప్పటికీ, ఢీల్లీ మిలట్రీ ఆస్పత్రిలో చేసిన పరీక్షల్లో రెండు వేల మందికి నెగిటివ్ ఫలితాలు రావడం ఆశాజనకమని రామకృష్ణ పేర్కొన్నారు.

  

ముస్లిం మతపెద్దలు, జమాయిత్ పెద్దలు స్పందించి, మర్కాజ్ ఇస్తేమాలో పాల్గొని ఇటీవల ఏపీకి వచ్చిన వారిని పరీక్షలకు ప్రోత్స హించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అందుకు ముస్లిం పెద్దలు స్వచ్చంధంగా పూనుకోవాలని కోరారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలితే, వారు ఆధైర్య పడకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాలకు వెళ్లి పూర్తి చికిత్స పొందాలని, ప్రభుత్వ యంత్రంగానికి సహ కరించాలని ఆయన సూచించారు. అదేవిధంగా కేరళ నుంచి వస్తున్న వలస కార్మికులు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలకు,  క్వారంటైన్‌కు సిద్ధం కావాలని రామకృష్ణ కోరారు.

Updated Date - 2020-03-31T22:14:01+05:30 IST