ఉగ్రవాదులు, చొరబాటుదారులు మీవల్లే బలవంతులవుతున్నారు..

ABN , First Publish Date - 2022-04-20T21:53:21+05:30 IST

శోభాయాత్ర సందర్భంగా ఘర్షణలు చెలరేగిన జహంగీర్‌పురిలో ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ చేపట్టిన ..

ఉగ్రవాదులు, చొరబాటుదారులు మీవల్లే బలవంతులవుతున్నారు..

న్యూఢిల్లీ: శోభాయాత్ర సందర్భంగా ఘర్షణలు చెలరేగిన జహంగీర్‌పురిలో ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలపై 'స్టే' ఇవ్వాలంటూ జమాయిత్ ఉలేమా-ఇ-హింద్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్, తదితరులపై బీజేపీ నేత కపిల్ మిశ్రా విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, అన్సార్ వంటి వ్యక్తులు చాలా శక్తివంతులయ్యారని, వారి తరఫున కపిల్ సిబల్, దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్, సంజయ్ హెగ్డే వంటి న్యాయవాదులు వాదిస్తున్నారని అన్నారు. జహంగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు బుధవారం స్టే ఇచ్చిన కొద్దిసేపటికే ఈ మేరకు ఒక వీడియో ట్వీట్‌ను కపిల్ మిశ్రా షేర్ చేశారు.


''సుప్రీంకోర్టు ఆదేశాలతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది...ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులు, అన్సార్ వంటి వ్యక్తులు బలవంతులవుతున్నారు. బుల్డోజర్ ఉత్తర్వు రాత్రి వచ్చింది. ఉదయమే కపిల్ సిబల్, దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్, సంజయ్ హెగ్డే‌లు (న్యాయవాదులు) స్టే ఆర్డర్ కోరుతూ సుప్రీంకోర్టు ముందుకు వచ్చారు. వాళ్లు జమాయిత్ ఉలేమా-ఇ-హింద్ తరఫున వాదిస్తున్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల కోసం జమాయిత్ ఉలేమా-ఇ-హింద్ పోరాడుతోంది. అహ్మదాబాద్ పేలుళ్లతో సంబంధం ఉన్న సంస్థ జమాయిత్. టెర్రరిస్టుల ప్రమేయం ఉన్న అహ్మదాబాద్ బ్లాస్ట్‌ కేసులో పోరాడుతున్న సంస్థ (జమాయిత్) ఇప్పుడు బంగ్లాదేశీ చొరబాటుల కోసం పోరాడుతోంది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, అన్సార్ వంటి వాళ్లు ఎలా శక్తివంతులయ్యారనేది ఒక్కసారి ఊహించండి. కపిల్ సిబల్ వంటి వాళ్లు వారి తరఫున వాదిస్తుండటం వల్లే. అందువల్లే వాళ్లు పోలీసులపైన కాల్పులు, రామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపులపై రాళ్లు రువ్వడం వంటివి చేస్తున్నారు'' అని కమిల్ మిశ్రా అన్నారు.


దీనికి ముందు, సీజేఐ ధర్మాసనం ఉదయం సమావేశం కాగానే సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్...మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణల కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ జమాయిత్ ఉలేమా-ఇ-హింద్ వేసిన పిటిషన్‌ను బెంచ్ దృష్టికి తెచ్చారు. తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే సైతం తన వాదన వినిపించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ, చట్ట విరుద్ధమని అన్నారు. కూల్చివేతలకు ముందు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ కింద అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ ఉందని, దీనిపై తాము ప్రొవిజనల్ అప్లికేషన్ కోర్టుకు సమర్పించామని తెలిపారు. వాదనలు మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే అవకాశం ఉండగా, ఉదయం 9 గంటలకే కూల్చివేతలు చేపట్టారని అన్నారు.

Updated Date - 2022-04-20T21:53:21+05:30 IST