తహసీల్దార్ల బదిలీలో తకరారు
ప్రజాప్రతినిధుల అయిష్టత
విధుల్లో చేరికపై సందిగ్ధత
అనంతపురం టౌన జూలై 1: తహసీల్దార్ల బదిలీలపై మళ్లీ తకరారు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని మండలాలకు ఫలానా వారే కావాలని కొందరు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇచ్చారు. దీంతో బదిలీల వ్యవహారం ఉన్నతాధికారులకు తలనొప్పిగా తయారైంది. బదిలీల గడువు చివరిరోజు గురువారం రాత్రి వరకూ తర్జనభర్జన పడుతూనే వచ్చారు. అర్ధరాత్రి వరకు మార్పులు చేర్పులు జరిగాయి. చివరకు జిల్లాలో 23 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో సి విశ్వనాథయ్య(డీఏఓ, అనంతపురం), జి.శ్రీధరమూర్తి(అనంతపురం), కె.మోహనకుమార్(బుక్కరాయసముద్రం), పి.నాగభూషణం(ఆత్మకూరు), కె.తిప్పేస్వామి(కుందుర్పి), ఈశ్వరమ్మ(శింగనమల), ఎం. బాలకృష్ణ(బ్రహ్మసముద్రం), సుబ్రహ్మణ్యప్రసాద్(డీ హీరేహాళ్), జి.శంకరయ్య(కళ్యాణదుర్గం), ఎస్.బ్రహ్మయ్య(విడపనకల్లు), ఎస్.రజాక్‌వలి(కణేకల్లు), పి.ఉషారాణి(గార్లదిన్నె), ఎం. భరతకుమార్(ల్యాండ్‌రిఫార్మ్స్), నారాయణస్వామి(నార్పల), అనిల్‌కుమార్(వజ్రకరూరు), ఎస్‌పీ శ్రీనివాసులు(బొమ్మనహాల్), ఈరమ్మ(పెద్దవడుగూరు), లక్ష్మీనాయక్(రాప్తాడు), ఈశ్వరయ్య శెట్టి(బెళుగుప్ప), సుమతి(పుట్లూరు), మునివేలు(తాడిపత్రి), నయాజ్ అహ్మద్(కంబదూరు), ఎం. వేణుగోపాల్(గుమ్మఘట్ట) ఉన్నారు. ఈ నియామకాలను కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శింగనమల నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆ తహసీల్దారు తమకు వద్దని ప్రజాప్రతినిధి చెప్పినట్లు సమాచారం. అనంతపురం తహసీల్దార్ విషయంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వివాదం మొదలైనట్లు చర్చ సాగుతోంది. ఒకరు ఆమోదం వేయగా, మరొకరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉరవకొండ, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లో కూడా ఒకరిద్దరిని వ్యతిరేకిస్తున్నారని రెవెన్యూ శాఖలో చర్చ జరుగుతోంది. ఈ కారణంగా బదిలీ స్థానాల్లో తహసీల్దార్ల చేరికపై సందిగ్ధత సాగుతోంది. బదిలీ అయిన 23 మందిలో శుక్రవారం శింగనమల, బుక్కరాయసముద్రం తహసీల్దార్లు మాత్రమే బాధ్యతలు చేపట్టారు. మిగిలిన వారి విషయంలో ప్రజాప్రతినిధుల వ్యతిరేకత ఉందని అంటున్నారు. జాబితాలో ముగ్గురు లేదా నలుగురిని మళ్లీ మార్చే అవకాశం ఉందని సమాచారం. డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్‌ఓల నియామకంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది.