వాళ్లు కాపీ కొట్టలేదు..!

ABN , First Publish Date - 2022-06-19T05:41:22+05:30 IST

పదో తరగతి విద్యార్థుల జీవితాలతో జిల్లా విద్యాశాఖ చెలగాటమాడింది. మాల్‌ ప్రాక్టీస్‌ పేరిట ఆరుగురు విద్యార్థులను డిబార్‌ చేసింది.

వాళ్లు కాపీ కొట్టలేదు..!

మళ్లీ పరీక్ష రాయించండి 

జిల్లా విద్యాశాఖకు డీజీఈ ఆదేశం 

స్క్వాడ్‌ బృందం, అధికారులపై విమర్శలు

అనంతపురం విద్య, జూన్‌ 18: పదో తరగతి విద్యార్థుల జీవితాలతో జిల్లా విద్యాశాఖ చెలగాటమాడింది. మాల్‌ ప్రాక్టీస్‌ పేరిట ఆరుగురు విద్యార్థులను డిబార్‌ చేసింది. కానీ  ప్రభుత్వ పరీక్షల విభాగం విచారణలో ఆ విద్యార్థులు కాపీ కొట్టలేదని తేలింది. విద్యార్థులు రాసిన సమాధానాలకు, వారి వద్ద లభించిన మెటీరియల్‌కు సంబంధం లేదని తేలింది. దీంతో ఆ ఆరుగురికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానంద రెడ్డి ఈ నెల 15న ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.


అత్యుత్సాహం

జిల్లాలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారి నియమించిన స్క్వాడ్‌లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వస్తున్నాయి. అనుమానం వచ్చిందే తడవు విద్యార్థులు కాపీ కొడుతున్నారని డిబార్‌ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. స్క్వాడ్‌ నిర్ణయాలను డీజీఈ ఆక్షేపించారు. ఆ విద్యార్థులు మాల్‌ ప్రాక్టీ్‌సకు పాల్పడలేదని, వారి చేత మళ్లీ పరీక్షలు రాయించాలని ఆదేశించారు.  ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెల్లో 2022 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 2223128824, 2223128434, 2223104582, 2223129018, 2224122776, 2224121035 హాల్‌ టికెట్‌ నెంబర్లు ఉన్న విద్యార్థులు మాల్‌ ప్రాక్టీస్‌  కింద బుక్‌ అయినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రకటించారు. అలా డిబార్‌ అయిన ఆరుగురు విద్యార్థులు రాసిన సమాధానాలు, విద్యార్థుల వద్ద దొరికిన మెటీరియల్‌ మ్యాచ్‌ కాలేదని మాల్‌ ప్రాక్టీస్‌ కమిటీ విచారణలో తేలింది. ఈ మేరకు కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో ఆ ఆరుగురు విద్యార్థులకు త్వరలో జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలలో అవకాశం ఇచ్చారు. ఈ మేరకు డీజీఈ ఉత్తర్వులు జారీచేశారు.


విద్యాశాఖ, స్క్వాడ్‌ ఇష్టారాజ్యంగా ! 

పరీక్షల సమయంలో స్క్వాడ్‌ నియామకాలలో డీఈఓ, ఏసీ ఇష్టానుసారంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. స్క్వాడ్‌లో గ్రేడ్‌-2 వంటి సీనియర్‌ హెచఎంలను తీసుకోకుండా, సమగ్రశిక్ష ప్రాజెక్టు నుంచి కొందరిని నియమించారు. దీనిపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. స్క్వాడ్‌గా నియమితులైన వారు.. డీఈఓ మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శించి, విద్యార్థులను డిబార్‌ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. పరీక్షల్లో అనుమానం వచ్చిన విద్యార్థినల్లా డిబార్‌ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. పరీక్ష సమయంలో మాల్‌ ప్రాక్టీస్‌ మెటీరియల్‌ దొరికితే, ఆ మెటీరియల్‌.. విద్యార్థి ఆన్సర్‌ షీట్‌లో రాసిన సమాధానాలు ట్యాలీ కావాలి. ఈ విషయాన్ని పట్టించుకోకుండా డిబార్‌ చేశారని స్పష్టమౌతోంది. ఈ కారణంగా విద్యార్థులు మానసిక క్షోభను అనుభవించారు. అనుభవజ్ఞులైన ప్రధానోపాధ్యాయులను స్క్వాడ్‌గా నియమించి ఉంటే ఇలా జరిగేది కాదని అంటున్నారు. డీఈఏ, ఏసీ, స్క్వాడ్‌లోని కొందరి వైఖరిపై ఇప్పుడు మరిన్ని విమర్శలు వస్తున్నాయి. డీజీఈ ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖకు చెంపపెట్టు అని ఉపాధ్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

Updated Date - 2022-06-19T05:41:22+05:30 IST