ప్రశ్నిస్తున్నాననే టార్గెట్‌ చేస్తున్నారు

ABN , First Publish Date - 2022-08-11T09:02:52+05:30 IST

ప్రశ్నిస్తున్నాననే టార్గెట్‌ చేస్తున్నారు

ప్రశ్నిస్తున్నాననే టార్గెట్‌ చేస్తున్నారు

భద్రత పెంచమంటే గన్‌మెన్లను తొలగిస్తారా?

బెదిరింపులకు భయపడను: పయ్యావుల కేశవ్‌ 

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వానికి చెందిన కీలక విషయాలపై ప్రశ్నిస్తున్నాననే నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. నాకు అదనంగా గన్‌మెన్‌లను ఇవ్వమని అడుగుతుంటే... ఉన్న వారిని తీసేస్తున్నారు. ఇది అన్యాయం. నేను ప్రజల కోసం పని చేస్తా. పోరాటాల్లో పుట్టి పెరిగిన వాడిని. బెదిరింపులకు భయపడను’’ అని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ స్పష్టం చేశారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా భద్రతకు భంగం వాటిల్లేలా ప్రభుత్వం కావాలనే వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నాకు ఇచ్చిన సెక్యూరిటీని తొలగిస్తున్నారు. హైదరాబాద్‌ వెళ్తే గన్‌మెన్‌లను తీసుకెళ్లకూడదని ఆంక్షలు పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు గన్‌మెన్లను పెట్టుకుని తిరుగుతుంటే, నా విషయంలో ఎందుకు అభ్యంతరం అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. సమాధానం లేదు. మిలిటెంట్ల కదలికలు పెరిగాక 2+2 గన్‌మెన్లను ఇవ్వమని నిఘా చీఫ్‌ని అడిగాను. అయినా సెక్యూరిటీ పెంచలేదు. పైగా మర్నాడే గన్‌మెన్లను మార్చారు. గన్‌ లైసెన్సుకు ఆల్‌ ఇండియా పర్మిట్‌ కావాలంటే నాలుగు నెలల నుంచి పెండింగ్‌లో పెట్టారు. నాపై కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ముప్పు వాటిల్లనున్నదనే సమాచారాన్ని ప్రజల ముందు పెట్టాను. అరెస్టు చేస్తే చేయనివ్వండి. నేను భయపడను’’ అని పయ్యావుల అన్నారు.


Updated Date - 2022-08-11T09:02:52+05:30 IST