దేశ ప్రజల నమ్మకాన్ని అమ్ముతున్నారు

ABN , First Publish Date - 2020-02-20T09:13:45+05:30 IST

‘‘బిడ్డా లచ్చమ్మ మొగుడు సచ్చిపోయిండట. పాపం ఎల్ఐసీ కూడా లేదంట. అందరు చిన్న పోరగాండ్లే ఎట్ల బతుకుతరో ఏమో’’; ‘‘మల్లన్న సచ్చిపోతే సచ్చిపోయిండు ఎల్ఐసీ చేసి మంచి పనిచేసి పోయిండు’’; ‘‘ఎల్ఐసీ పైసలతోనే బిడ్డ పెళ్లి చేసిండ్రు, లేకపోతే...

దేశ ప్రజల నమ్మకాన్ని అమ్ముతున్నారు

‍ఎల్ఐసీని ఎదుర్కోలేని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు కుట్రకు తెరలేపాయి. ప్రభుత్వ పెద్దలను శాసించే బడా కంపెనీలు ఎల్ఐసీకి తూట్లు పొడవడానికి పన్నాగం పన్నాయి. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే ప్రభుత్వాధినేతలు సగటు భారతీయుడి రక్షణ కవచం ఎల్ఐసీని అమ్మకానికి పెట్టారు. గనులు, వనరులు, గాలి, నీరు అమ్మిన పాలకులు ఇప్పుడు నమ్మకాన్ని కూడా అమ్మేస్తున్నారు.


‘‘బిడ్డా లచ్చమ్మ మొగుడు సచ్చిపోయిండట. పాపం ఎల్ఐసీ కూడా లేదంట. అందరు చిన్న పోరగాండ్లే ఎట్ల బతుకుతరో ఏమో’’; ‘‘మల్లన్న సచ్చిపోతే సచ్చిపోయిండు ఎల్ఐసీ చేసి మంచి పనిచేసి పోయిండు’’; ‘‘ఎల్ఐసీ పైసలతోనే బిడ్డ పెళ్లి  చేసిండ్రు, లేకపోతే ఆగమాగం అయ్యేది అక్కా’’ ... ఇట్లాంటి మాటలు పల్లెటూరుతో సంబంధం ఉన్న అందరికీ తెలిసే ఉంటుంది. పల్లెటూరే కాదు ఓ మోస్తరు ఉన్నత కుటుంబాల వరకు కూడా ఎల్ఐసీ పాలసీ కట్టనోళ్లు ఉండరు కావొచ్చు. ఆ కుటుంబాలకు అదో పెద్ద ఆసరా. ఉద్యోగులకు జీతం కాస్త పెరిగిందంటే చాలు మొదట గుర్తొచ్చేది ఎల్ఐసీ అంటే అతిశయోక్తి కాదు. ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఓ పాలసీ తీసుకొని కష్టార్జితాన్ని భద్రం చేసుకుంటారు. చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు కూడా ఎల్ఐసీ ప్రాణప్రదమే. ఆ సంస్థ లోగో కూడా ఆరిపోతున్న కుటుంబాలకు అండగా నిలిచేలా ఉంటుంది. దీపం జ్యోతికి రెండు చేతులూ అడ్డం పెట్టి ఆరిపోకుండా కాపాడుతున్నట్టుగా ఉంటుంది. అన్నట్టుగా కాదు, దాదాపు 66 ఏళ్లుగా దేశంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆపన్నహస్తంగా నిలిచింది. అంతెందుకు ఎల్ఐసీపై ప్రజల నమ్మకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే చక్కటి ఉదాహరణ. తెలంగాణలోని రైతులందరికీ 5లక్షల బీమా కల్పించాలని నిర్ణయించినప్పుడు అనేక కంపెనీలు ముందుకు వచ్చినా ప్రభుత్వం ఎల్ఐసీ సంస్థనే ఎంచుకున్నది. ఇలాంటి 31 లక్షల కోట్ల సంస్థకు ఏమైందని అమ్ముతున్నారు? ఎల్ఐసీ ఎదుగుదలలో ఏ ప్రభుత్వ ప్రమేయం లేదు. సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లు, ప్రజలే ఎల్ఐసీ నిర్మాతలు. దేశ ప్రజల కష్టార్జితామే పెట్టుబడిగా ఎదిగింది ఎల్ఐసీ. ప్రజల నమ్మకానికే పరిమితం కాలేదు. ఈ దేశ నిర్మాణానికి అతితక్కువ వడ్డీతో లక్షల కోట్లు అందించింది. సవాలక్ష షరతులతో, దిగజారిన లాబీయింగ్‌తో అప్పులు ఇచ్చే వరల్డ్ బ్యాంకు, ఇతర విదేశీ బ్యాంకుల కంటే ఎన్నో రెట్లు మేలైన సేవలు అందించింది. ఎల్ఐసీ ఎదుగుదలకు సహకరించని పాలకులు, దెబ్బతీసేందుకు మాత్రం బార్లా తలుపులు తెరిచారు. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం మొట్టమొదటి సారిగా బీమా రంగంలో 26శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చింది. 2015లో మోదీ ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49శాతానికి పెంచింది. అయినా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎల్ఐసీని ఢీ కొట్టలేకపోయాయి. కారణం దేశ ప్రజల్లో ఎల్ఐసీపై ఉన్న నమ్మకమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఐసీని ఎదుర్కోలేని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు కుట్రకు తెరలేపాయి. ప్రభుత్వ పెద్దలను శాసించే బడా కంపెనీలు ఎల్ఐసీకి తూట్లు పొడవడానికి పన్నాగం పన్నాయి. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే ప్రభుత్వాధినేతలు సగటు భారతీయుడి రక్షణ కవచం ఎల్ఐసీని అమ్మకానికి పెట్టారు. గనులు, వనరులు, గాలి, నీరు అమ్మిన పాలకులు ఇప్పుడు నమ్మకాన్ని కూడా అమ్మేస్తున్నారు. జీవిత బీమా వ్యాపారానికి పెట్టుబడి నమ్మకం. అందుకే బీమా రంగం ప్రభుత్వ అజమాయిషీలోనే ఉండాలని ఆకాంక్షించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. ఇప్పుడు ఆ నమ్మకమే కారు చౌకగా అమ్ముడవుతోంది. దేశ ప్రజలారా మేల్కొండి. మీ నమ్మకం అమ్ముడుపోతోంది.  

 జయసారథి, సీనియర్ జర్నలిస్టు


Updated Date - 2020-02-20T09:13:45+05:30 IST