ఆర్థిక ప్రగతికి అవి అక్షయ పాత్రలు.. గ్రూప్ 1 గైడెన్స్!

ABN , First Publish Date - 2022-10-06T18:30:33+05:30 IST

చరిత్రలో ఒక తరం మరో తరానికి అందజేసే సంపద, సంస్కృతి, కళలు, సాహిత్యం తదితరాలు వారసత్వం లేదా హెరిటేజ్‌గా గుర్తింపు పొందుతాయి. గ్రూప్‌-1, గ్రూప్‌-2 లాంటి ఉన్నత స్థాయి

ఆర్థిక ప్రగతికి అవి అక్షయ పాత్రలు.. గ్రూప్ 1 గైడెన్స్!

రిత్రలో ఒక తరం మరో తరానికి అందజేసే సంపద, సంస్కృతి, కళలు, సాహిత్యం తదితరాలు వారసత్వం లేదా హెరిటేజ్‌గా గుర్తింపు పొందుతాయి. గ్రూప్‌-1, గ్రూప్‌-2 లాంటి ఉన్నత స్థాయి పరీక్షలు రాసే అభ్యర్థులకు తమ ప్రాంత వారసత్వ సంపదపై సంపూర్ణ పరిజ్ఞానం ఉండాలి. టీఎస్‌పీఎస్సీ సిలబ్‌సలో జనరల్‌ స్టడీస్‌ విభాగం, ప్రత్యేక తెలంగాణ అంశాల పేపర్‌లో ‘వారసత్వ సంపద’కు మార్కుల పరంగా సముచిత వెయిటేజ్‌ ఇచ్చారు.


ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర భౌగోళిక ప్రాంతం తరతరాల వారసత్వాన్ని సగర్వంగా స్వీకరించింది. వివిధ శైలుల్లో నిర్మించిన కోటలు, ఆరాధన స్థలాలు, కళారూపాలు, ఆహారపు అలవాట్లు నేటికీ చారిత్రక సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.


శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, రాష్ట్ర్ట్రకూటుల వారసత్వం తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో అంతర్భాగం. అయితే కాకతీయుల ప్రభావం మాత్రం నేటికీ ప్రస్ఫుటంగా కొనసాగుతోంది. కాకతీయుల కాలంనాటి కరెన్సీ ప్రతిరూపాలైన వీసం, మాడ, వరహం వాడుక; సొల, తవ్వ, కుంచం, పుట్టి వంటి కొలమానాలు నేటికీ  ప్రజల వినియోగంలో ఉన్నాయి. కాకతీయుల వారసత్వ సంపదలో అపురూపమైనవి చెరువుల నిర్మాణాలు. గొలుసుకట్టు పద్ధతిలో చిన్న, మధ్యమ, పెద్ద చెరువుల నిర్మాణాలు పీఠభూమి ఎత్తు విస్తీర్ణత ఆధారంగా సాగాయి. నేటికీ తెలంగాణ వ్యవసాయానికి ప్రధాన నీటిపారుదల వనరులుగా నిలిచి ఉన్నాయి. 


ఇటీవలి కాలంలో ‘యునెస్కో’ గుర్తింపు పొందిన ‘రామప్ప’ నిర్మాణం అద్వితీయం. పోటీ పరీక్షల కోసం సంసిద్ధం అవుతున్న విద్యార్థులకు, కాకతీయుల రాజధాని వరంగల్‌ గొప్పతనం, కాకతీయుల ఆర్థిక విధానాలు, చెరువులు, కాలువలు, నాటి సమాజం, మతం, ప్రజల జీవన విధానం తప్పనిసరిగా పరిచయం కావాల్సిన అవసరం ఉంది. 


కాకతీయుల నాటి సమాజం

 క్రీ.శ. 12, 13, 14 శతాబ్దాలలో కాకతీయ సామ్రాజ్య పరిపాలన కొనసాగింది. వారి సుదీర్ఘ పాలన తెలంగాణ సమాజాన్ని అత్యధికంగా ప్రభావితం చేసింది. ‘క్రీడాభిరామం’ ప్రకారం...ఓరుగల్లు నగరంలో 27 వర్గాలకు చెందిన ప్రజలు నివసించేవారు. మత ఆచారాలు, కులం, కట్టుబాట్లు సమాజంలో స్థిరపడ్డాయి. బౌద్ధ, జైన, శైవ మతాలు ఉనికిలో ఉన్నప్పటికీ శైవమత ప్రభావమే ఎక్కువగా ఉండేది. 


బౌద్ధమతం: ప్రాచీన కాలంలో తెలంగాణలో వర్ధిల్లిన బౌద్ధమతం కాకతీయుల సమయం వచ్చేనాటికి దాదాపుగా క్షీణించింది. విస్తరించిన వైదిక మతం బౌద్ధ మతాన్ని తనలో కలిపేసుకుంది. క్రీ.శ.1171లో కాకతీయుల మంత్రి గంగాధరుడు శ్రీవిష్ణువే బుద్దుని అవతారంగా ప్రకటించి విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు కరీంనగర్‌ శాసనం పేర్కొంటోంది. మల్లిరెడ్డి అనే మండలాధీశుడు శ్రీమహావిష్ణువు అవతారమే బుద్ధుడు అని ‘బెక్కల్లు’ శాసనంలో పేర్కొన్నాడు. ఈ రెండు ఆధారాలు మినహా బౌద్ధాన్ని ప్రస్తావించిన ఆధారాలు లభ్యం కాలేదు.

జైన మతం: తెలంగాణలో జైనమతం అత్యంత ప్రాచీనమైంది. కాకతీయుల కాలంనాటికి జైనమతం క్రమక్రమంగా క్షీణదశకు వచ్చింది. బేతరాజు-2 కాలం నాటికి కాకతీయులు శైవమతాన్ని స్వీకరించడం వల్ల జైన మతం రాజు ఆదరణ కోల్పోయింది. 16వ తీర్థంకురుడైన ‘శాంతినాథుడు’ గరుడ పక్షిని చిహ్నంగా వాడేవాడు. అతడి వాహనం గరుడ పక్షి అనే వాదన కూడా ఉంది. ఆ చిహ్నాన్ని రాష్ట్రకూటులు స్వీకరించగా, వారి వద్ద నుంచి కాకతీయులు గ్రహించారు. 1117లో ఒకటో ప్రోలరాజు మంత్రి భార్య మైలాంబ ‘కడలాలయ బసది’ ని నిర్మించింది. గణపతిదేవుని కాలంలో జైనమత మందిరాలు కూల్చివేసినట్లు కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ప్రతాపరుద్రుని కాలంలో ‘అప్పయనార్యుడు’ అనే కవి ‘జీవేంద్ర కళ్యాణాభ్యుదయం’ అనే జైన మత గ్రంథం రచించాడు. కాకతీయులు తొలుత జైనమతాన్నే అనుసరించారు.

శైవమతం: కాకతీయుల పరిపాలన కాలం శైవమతానికి స్వర్ణయుగం. శైవమతంలో 4 శాఖలు ఉండేవి. అవి... కాలముఖ శైవం, పాశుపత శైవం, కాపాలిక శైవం, ఆరాధ్య శైవం. ఈ దశలోనే బసవేశ్వరుని ప్రభావంతో వీర శైవం విజృంభించింది. మల్లికార్జున పండితుడు, శ్రీపతి పండితుడు, మంచన పండితుడు శైవత్రయంగా గుర్తింపు పొందారు.  వీరి ప్రభావం వల్లనే పాలకుర్తి సోమనాథుడు(తెలుగు భాషలో తొలిదేశ కవి) సామాన్య ప్రజల భాషలో రచనలు చేశాడు. కాకతీయులు కాలముఖ శైవాన్ని ఆరాధించారు. ‘శంభుడు’ వీరి ఇష్టదైవం. కాజీపేట దర్గ శాసనం ప్రకారం...రామేశ్వర పండితుడు రెండో బేతరాజుకు, అతని కుమారుడైన దుర్గరాజు, రెండో ప్రోలరాజుకు శైవదీక్షను ఇచ్చాడు. వరంగల్‌లోని ఉర్సు గుట్టపై నరసింహ కవి 62 పద్యాలతో శైవమతాన్ని ప్రచారం చేశాడు.

వైష్ణవ మతం: కాకతీయుల త్రికూట ఆలయాల్లో కేశవ ఆలయం కూడా ఒకటి. కాకతీయ రుద్రదేవుని మంత్రి వెల్లంకి గంగాధరుడు హన్మకొండలో ప్రసన్న కేశవ ఆలయాలను నిర్మించాడు. గణపతిదేవుని సోదరి మైలాంబ ఇనుగుర్తి(మహబూబాబాద్‌)లో గోపాలకృష్ణ ఆలయాలను నిర్మించింది. ప్రతారుద్రుని భార్య ‘లక్ష్మాదేవి’ కరీనంగర్‌ జిల్లా యెల్లెడ గ్రామంలో రామనాథ ఆలయం నిర్మించింది. కాకతీయుల కాలంలో వేసర శైలి(చాళుక్య రీతి) దేవాలయాల నిర్మాణాలు జరిగాయి. పంచలయ ఆలయం, కాకతీ దేవాలయం, ఏకవీర దేవాలయం, రుద్రేశ్వర/వేయిస్తంభాల దేవాలయం, కడలాలయ బసది/పద్మాక్షి ఆలయం/జీవేంద్ర ప్రార్థన ఆలయం, ప్రసన్న కేశవ ఆలయం, రామప్ప దేవాలయం, పిల్లల మర్రి ఆలయం, నాగులపాడు దేవాలయం, నగునూరు దేవాలయం, కాలేశ్వర ఆలయం  ముఖ్యమైనవి. కాకతీయుల శైలి ప్రస్తుతం తెలంగాణ శైలిగా గుర్తింపు పొందుతోంది.


కాకతీయుల రాజధాని

కాకతీయుల తొలిరాజధాని ‘అనుమకొండ’. హన్మకొండ పట్టణం గురించి భీమరసుని శాసనం(872) తొలిసారిగా ప్రస్తావించింది. ఈ శాసనం రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుని కాలానికి చెందింది. గూడూరు శాసనం(1124) ప్రకారం ఇది కాకతీయుల తొలి రాజధాని. హన్మకొండలో కడలాలయ బసది, వేయి స్తంభాల గుడి, ప్రసన్న కేశవ దేవాలయం, భేతేశ్వర, ఛౌడేశ్వర ఆలయాలు ఉన్నాయి. 1254లో రాజధానిని హన్మకొండ నుంచి వరంగల్‌కు మార్చారు. చింతలూరి శాసనం ప్రకారం...ఏకశిల వద్ద రెండో ప్రోలుడు స్వయంభూ దేవాలయం నిర్మించి వరంగల్‌ కోట నిర్మాణాన్ని ఆరంభించారు. ఈ కోట నిర్మాణం రుద్రదేవుడు, గణపతి దేవుని కాలంలో పూర్తయ్యింది. ఈ కోట చుట్టూ ఏడు ప్రవారాలు(కాంపౌండ్‌) ఉన్నట్లు ‘క్రీడాభిరామం’ పేర్కొంది. వీటిలో రాతికోటను రుద్రమదేవి నిర్మించారు. ప్రస్తుతం మూడు కోటలు మాత్రమే సజీవంగా ఉన్నాయి. స్వయంభూ దేవాలయం నాలుగువైపుల నాలుగు కీర్తి తోరణాలు నిర్మించారు. ఇవి గణపతి దేవుని నిర్మాణాలు. తరవాత కాలంలో ‘సితాబ్‌ ఖాన్‌’ అనే పాలకుడు ‘ఖుషి మహల్‌’ను నిర్మించాడు.


కాకతీయుల ఆర్థిక విధానాలు

కాకతీయులది వ్యవసాయ కేంద్రీకృత ఆర్థిక విధానం. వీరు నీటి పారుదలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ క్షేత్రాలను విస్తరించారు. ఆ కాలంలో ఏడు విధులను నిర్వహించేవారు. ఈ విధులు కౌటిల్యుని అర్థశాస్త్రం నుంచి గ్రహించారు. అవి...

1. తటాక నిర్మాణం 2. ధన నిక్షేపం 3. అగ్రహార ప్రతిష్ఠ 4. దేవాలయ ప్రతిష్ఠ 5. వన ప్రతిష్ఠ 6. ప్రబంధ రచన

7. స్వీయ సంతానం

కాకతీయుల కాలంలో మంథని, కాళేశ్వరం, చెన్నూరు, నర్సంపేట, అచ్చంపేట, ఖమ్మం మెట్టు, కొత్తగూడెం ప్రాంతాలలో అనేక నూతన గ్రామాలు ఏర్పాటు చేశారు. ఓరుగల్లు, మట్టెవాడ, కొరవి, పానగల్లు, జడ్చర్ల, పేరూరు, మంథని ముఖ్యమైన వ్యాపార కేంద్రాలు. నల్లగొండ జిల్లాలోని వాడపల్లి, ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి ప్రముఖ నౌకా కేంద్రాలు. విదేశీ వాణిజ్యం ఎక్కువగా రోమన్‌లతో  జరిగేది. మాడ, రూక, వరహ, వీసం, చెలామణిలో ఉన్న నాణాలు. కుంచం, తూము, పుట్టి ధాన్యాన్ని కొలిచే పరికరాలు.


పన్నులు: పన్నులను సుంకం అనే పేరుతో పిలిచేవారు. అవి...

1. భూమి పన్ను 2. ఆస్తి పన్ను 3. వృత్తి పన్ను 4. వ్యాపార పన్ను 5. ఇతర పన్నులు- బుర్ర సుంకం, కుట్టు సుంకం, పెళ్లి సుంకం, యుద్ధ సుంకం స్థానిక వ్యాపారం వైశ్యుల చేతిలో ఉండేది. విదేశీ వ్యాపారులని ‘సార్థవాహకులు’గా గుర్తించేవారు. వ్యాపార సూత్రాలను మోటుపల్లి అభయశాసనంలో పేర్కొన్నారు. సంత/అంగడి ద్వారా క్రయ విక్రయాలు ఎక్కువగా జరిగేవి.




-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌, 

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌



Updated Date - 2022-10-06T18:30:33+05:30 IST