పేట్రేగిపోతున్నారు!

ABN , First Publish Date - 2022-08-11T06:34:03+05:30 IST

పేట్రేగిపోతున్నారు!

పేట్రేగిపోతున్నారు!
సుందరయ్యనగర్‌ కట్ట ప్రాంతంలో గంజాయి తాగుతున్న గుంపు

శివార్లలో ఆకతాయిల ఆగడాలు

మత్తులో కొట్లాటలు ..మహిళలపై కామెంట్లు

వాహనాలపై, నడిచి వెళ్తున్న వారితో గొడవలు.. కొరవడిన పోలీసు నిఘా, పెట్రోలింగ్‌

న్యూ రాజరాజేశ్వరీపేట ప్రాంతానికి చెందిన అనిల్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌కు చెందిన రౌడీషీటర్‌ బొంతుల దుర్గారావు రాత్రిపూట గంజాయి మత్తులో అనిల్‌ను డబ్బులు ఇవ్వమని దౌర్జన్యానికి దిగాడు. నగదు ఇవ్వకపోవడంతో అనిల్‌పై దాడికి పాల్పడ్డాడు. 

ఇటీవల రెండు వర్గాల ఘర్షణను చెదరగొట్టిన ఓ ఎస్సైను బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యులు బూతులు తిడుతుంటే ఓ వైసీపీ నేత వారిని వారించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యుడు ప్రకాష్‌ అలియాస్‌ బుజ్జి ఆ వైసీపీ నేత చేయి, వీపు, చాతీ భాగాల్లో దాడి చేశాడు.

కండ్రిక బీవీ సుబ్బా రెడ్డి స్కూల్‌లో చదువుతున్న బాలిక పట్ల  ఓ ఆకతాయి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. నన్నే ప్రశ్నిస్తారా? అని ఆగ్రహించిన ఆకతాయి వారిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. 







పాయకాపురం, ఆగస్టు 10: శివార్లలో ఆకతాయిలు, షీటర్లు పేట్రేగి పోతున్నారు. పట్టపగలే రహదారుల పక్కన, జనావాసాల నడుమ, పార్కు లు, ఖాళీ స్థలాల్లో గుంపులుగా చేరి మద్యం, గంజాయి తాగుతున్నారు. ఆ మార్గంలో నడుస్తూ, బైక్‌లపై రాకపోకలు సాగించే వారితో గొడవలకు దిగి దాడులకు పాల్పడుతున్నారు. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తూ.. సామాన్యులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. 



మత్తులో జోగుతూ...

బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వారి నుంచి నగదు లాక్కోవడమే కాకుండా బ్లేడ్లతో గాయపరచి  తప్పించు కుంటున్నారు. శాంతినగర్‌లో కొంత మంది అక్రమార్కులు యువతకు, బ్లేడ్‌ బ్యాచ్‌లకు గంజాయి సరఫరా చేస్తున్నారని సమాచారం. దీంతో బ్లేడ్‌, గం జాయి బ్యాచ్‌లు నిరంతరం మత్తులో జోగుతూ విచక్షణ కోల్పోయి, దాడు లకు పాల్పడటమే కాక ద్విచక్రవాహనాలను అతి వేగంగా డ్రైవ్‌ చేస్తూ ఢీకొడుతున్నారు. వీటిలో కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. మరికొంత మంది పోలీసులకు చెప్పినా ప్రయోజనం ఉండదని ఫిర్యాదు చేకుండా మిన్న కుంటున్నారు.  



నడిరోడ్డుపై మద్యపానం

శివారు ప్రాంతాల్లో పగలు, రాత్రీ తేడా లేకుండా మందుబాబులు మద్యం తాగుతున్నారు. మద్యం షాపులకు సమీపంలో ఖాళీగా ఉన్న దుకాణాల ఆవ రణలో గుంపులుగా చేరి బహిరంగంగా తాగుతున్నారు. వారిలో వారికి గొడవలు చెలరేగి..దాడులకు పాల్పడుతున్నారు. 

 


నిఘా వైఫల్యం

శివారు ప్రాంతంలో దొంగతనాలు, దాడులు అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు నేరగాళ్లపై నిఘా పెద్దగా ఉండడం లేదని, పాత రౌడీషీటర్లకు మాత్రం కౌన్సెలింగ్‌ ఇస్తు న్నారని, బ్లేడ్‌, గంజాయి బ్యాచ్‌ల జోలికే పోవడం లేదనే విమర్శలు విని పిస్తున్నాయి.

ఎందుకొచ్చిన తంటా?

శివారు ప్రాంతాలైన న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, ఎల్‌బీఎస్‌ నగర్‌, ప్రకాష్‌నగర్‌, ఉడాకాలని, రాజీవ్‌నగర్‌, కండ్రికకాలనీ తదితర ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు, బెదిరింపులకు దిగుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ల ఆగడాలపై ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా  ఫలితం లేకపోవడంతో తమకెందుకు వచ్చిన తంటా అని, ఎవరికి వారు మిన్నకుండిపోతున్నారు. పేట్రేగిపోతున్న అసాంఘిక శక్తులపై దృష్టిసారించకపోతే భవిష్యత్‌లో శాంతిభద్రతలకు  విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఎక్కడెక్కడ అంటే..

నున్న రూరల్‌ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో పాయ కాపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద బడ్డీలు మందుబాబులకు అడ్డాగా మారాయి. మద్యం తాగాక సీసాలను అక్కడే పడేసి బీభత్సం సృష్టిస్తున్నారు. రైతుబజార్‌ పరిసరాలు దారుణంగా మారుతున్నాయి. 

 శాంతినగర్‌ శారదా రామకృష్ణ విద్యాలయం ప్రాంతం మందు బాబులకు అడ్డాగా మారింది. చీకటి పడితే అక్కడ మందుబాబులు భారీగా చేరుతున్నారు.

62, 63వ డివిజన్లలో పార్కులు, ఖాళీ స్థలాలు, సుందరయ్యనగర్‌  కట్ట ప్రాంతం, ఉడా కాలనీకట్ట ప్రాంతాల్లో మద్యంతో పాటు గం జాయి తాగుతున్నారు.

 న్యూ రాజరాజేశ్వరీపేటలోని అపార్ట్‌మెంట్స్‌ వెనుక ప్రాంతం నిర్మా నుష్యంగా ఉంటుంది. దీంతో పగలు, రాత్రీ తేడా లేకుండా మందు బాబులు యథేచ్ఛగా మద్యం తాగుతూ స్థానికులను ఇబ్బంది పెడు తున్నారు.

 అజిత్‌సింగ్‌నగర్‌, పాయకాపురం శ్మశానవాటిక, ఆ పక్కన నిరు పయోగంగా ఉన్న ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. 


Updated Date - 2022-08-11T06:34:03+05:30 IST