వీరు ఆల్‌రౌండర్స్‌

ABN , First Publish Date - 2021-08-05T05:30:00+05:30 IST

శ్రమనే నమ్ముకున్న పరిశ్రమ ఒకరిది. ధైర్యం ఇచ్చిన ఆత్మస్థైర్యం మరొకరిది. నేపథ్యాలు వేరైనా సంకల్పం

వీరు ఆల్‌రౌండర్స్‌

శ్రమనే నమ్ముకున్న పరిశ్రమ ఒకరిది. ధైర్యం ఇచ్చిన ఆత్మస్థైర్యం మరొకరిది. నేపథ్యాలు వేరైనా సంకల్పం ఒక్కటే... సివిల్‌ సర్వీసెస్‌. సవాళ్లు... సమస్యలను అధిగమించి ఐపీఎస్‌లుగా విజయాన్ని అందుకున్న ఘనత రంజితా శర్మ, శ్రేయా గుప్తాలది. ఇప్పుడు శిక్షణలోనూ ‘బెస్ట్‌ ఆల్‌రౌండర్‌’గా ఒకరు... ‘సెకండ్‌ బెస్ట్‌ ఆల్‌రౌండర్‌’గా మరొకరు నిలిచి సత్తా చాటారు. సాధారణంగా పురుషులే ఆధిపత్యం కనబరిచే శిక్షణలో ఇద్దరు మహిళలు టాప్‌లో నిలవడం అరుదైన ఘనతే. వారితోపాటు తెలుగు అమ్మాయి సాధనా రష్మీ పెరుమాళ్‌ కూడా విజయవంతంగా శిక్షణ ముగించుకుని విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్‌ ‘సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ’లో శుక్రవారం జరిగే 178 మంది ప్రొబెషనరీ ఐపీఎస్‌ల ‘పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌’ సందర్భంగా ఈ ముగ్గురినీ ‘నవ్య’ పలుకరించింది... 





‘పరేడ్‌’ లీడర్‌

సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలన్నది నా కల. దాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించాను. ఎన్నో త్యాగం చేశాను. మాది హరియాణాలోని ఫరీదాబాద్‌. ఢిల్లీలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌’లో పబ్లిక్‌ రిలేషన్స్‌లో పీజీ చదివాను. తరువాత ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఐదేళ్ల పాటు కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌లో విధులు నిర్వర్తించాను. ఉద్యోగం చేస్తూనే 2013 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతూ వచ్చాను. ప్రతిసారీ మెయిన్స్‌ వరకు వెళ్లా. కానీ ఇంటర్వ్యూకు ఎంపిక కాలేదు. ఇక మిగిలింది ఒకే ఒక్క అవకాశం. ఆరో ప్రయత్నంలో ఇంటర్వ్యూకు ఎంపికయ్యాను. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న చిన్న వ్యాపారి. ఈ ఐదేళ్లూ ఎన్నో కష్టాలు పడ్డా. సవాళ్లు అధిగమించాను. ప్రతిసారీ మెయిన్స్‌ వరకు వెళ్లడం... వెనక్కి రావడం... దీంతో ధైర్యం కోల్పోయాను. నిరాశ, నిస్పృహలకు గురయ్యాను. ఒకానొక సమయంలో సివిల్స్‌ రాయొద్దని అనుకున్నా.


అలాంటి సమయంలో తల్లిదండ్రులు, స్నేహితులు నాకు అండగా నిలిచారు. ‘ఈసారి తప్పకుండా విజయం సాధిస్తావ’ని ధైర్యం చెప్పారు. వారు నాపై పెట్టుకున్న నమ్మకం నిజమైంది. ఏదో ఒక సర్వీస్‌కు ఎంపికైతే చాలనుకున్నా. అలాంటిది యూనిఫాం వేసుకొనే ఐపీఎస్‌ రావడం అదృష్టం. 33 ఏళ్ల వయసులో నాకీ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్‌ కేడర్‌కు ఎంపికయ్యాను. 102 వారాల శిక్షణ విజయవంతంగా పూర్తయింది. త్వరలో విధుల్లో చేరబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 


ఆ కష్టం ముందు... 

ఐదేళ్లు పడ్డ కష్టంతో పోల్చుకుంటే... శిక్షణ నాకు సులుగానే అనిపించింది. 40 కిలోమీటర్ల రూట్‌ మార్చ్‌ ఒక్కటే కొంచెం ఇబ్బంది పెట్టింది. అవుట్‌డోర్‌ శిక్షణ సమయంలో నన్ను నేనే ప్రొత్సహించుకుంటూ ముందుకు వెళ్లా. అందుకే శిక్షణలో అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాను. సైబర్‌, ఇతర నేరాలను ఎలా నియంత్రించవచ్చో నిపుణులు తర్ఫీదు ఇచ్చారు. 178 మంది ప్రొబెషనరీ ఐపీఎస్‌లు గల ఈ బ్యాచ్‌లో నేనే ‘బెస్ట్‌ అల్‌రౌండర్‌’గా నిలిచాను. మొత్తం ఎనిమిది ట్రోఫీలకు ఎంపికయ్యా. చాలా గర్వంగా ఉంది. ఐపీఎస్‌ అనేది సవాల్‌తో కూడుకున్నది. ప్రత్యేకంగా మహిళలకు! శిక్షణ విజయవంతంగా పూర్తయిందని ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ... నాపై చాలా బాధ్యత ఉందనే విషయం మరచిపోవడంలేదు. దేశానికి సేవ చేస్తూ ఒక మంచి అధికారిగా మా అమ్మా నాన్నలకు పేరు తీసుకురావాలి. 



నాన్నే ఆదర్శం... 

మా నాన్నే నాకు ఆదర్శం. కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా చదివించారు. ఏనాడూ నిరుత్సాహపరచలేదు. పిల్లల విజయంలో తల్లితండ్రుల పాత్ర కీలకం. ఐపీఎస్‌లుగా మహిళలు రాణించగలరు. పురుషులతో పోల్చితే ఎందులోనూ మహిళలు తక్కువ కాదు. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. 178 మంది ప్రొబెషనరీ ఐపీఎస్‌లలో145 మంది  మగవారు ఉన్నారు. శుక్రవారం జరగబోయే ‘పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌’ను నేనే లీడ్‌ చేస్తున్నా. ఈ అవకాశం అందరికీ దక్కదు. ఒక మహిళకు ఇంతకన్నా ఇంకేం కావాలి. నాతో పాటు మరో మహిళ ‘సెకండ్‌ అల్‌రౌండ్‌ ఐపీఎస్‌ ప్రొబేషనరీ’గా నిలవడం గర్వకారణం. 


సివిల్స్‌ సాధించాలంటే ఏకాగ్రత ముఖ్యం. ఐదేళ్లు సివిల్స్‌, ఉద్యోగం రెండు పడవల మీద కాలు పెట్టడం వల్ల విజయం సాధించలేకపోయా. ఉద్యోగ సమయంలో రోజుకు ఆరు గంటల వరకు, వీకెండ్స్‌లో 12 గంటల వరకు చదివా. ఉద్యోగానికి రాజీనామా చేశాక.. పూర్తిగా చదవుకే కేటాయించాను. 




‘సెకండ్‌ బెస్ట్‌’

నేను పుట్టి పెరిగింది ఢిల్లీలో. ఢిల్లీ అనగానే బాగా సెటిలైన కుటుంబం అనుకొంటారు. కానీ నాన్నది చిరుద్యోగం. దీంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు. నన్ను, మా తమ్ముడిని చదివించడానికి నాన్న పడ్డ కష్టం మాటల్లో చెప్పలేను. అయినా సివిల్స్‌ సాధించాలనే నా చిన్ననాటి కలను నాన్న ప్రోత్సహించారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే మొదటి ప్రయత్నంలోనే సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యా.


మళ్లీ పరీక్ష రాసి.. ఐఏఎస్‌కు ప్రయత్నించొచ్చు. కానీ నాకు యూనిఫాం సర్వీస్‌ అంటేనే ఇష్టం. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం అందులో ఉంటుంది. నేను ఢిల్లీ యూనివర్శిటీలో ఎంఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌ పూర్తి చేశాను. ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఏడాది పాటు ఒక ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేశాను. అక్కడ పని చేస్తూనే కస్టమ్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా కొలువు సంపాదించాను. కొన్నేళ్లు అక్కడ పని చేశా. ఆ తర్వాత మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికయ్యా. 


చాలా భయమేసింది... 

2019 డిసెంబర్‌లో జాతీయ పోలీస్‌ అకాడమీలో అడుగు పెట్టేటప్పుడు చాలా భయమేసింది. ఒక మహిళగా శిక్షణలో రాణించగలుగుతానా? అనే అనుమానం. డైరెక్టర్‌, ఇతర అధికారులు నాలోని భయాలు పోగొట్టారు. పోలీస్‌ సర్వీస్‌లో ప్రాముఖ్యత వివరించారు. వారిచ్చిన స్ఫూర్తితో శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నా. అన్ని రంగాల్లో తర్ఫీదు తీసుకుని.. ‘సెకండ్‌ బెస్ట్‌ అల్‌రౌండ్‌ ఐపీఎస్‌ ప్రొబెషనర్‌’గా ఎంపికయ్యా. ప్రస్తుతం తమిళనాడు కేడర్‌కు ఎంపికయ్యా.


మొదట 15 వారాల పాటు ముస్సొరిలోని ఫౌండేషన్‌ కోర్సులో శిక్షణ ఇచ్చారు. అదేం ఇబ్బంది అనిపించలేదు. ఆ తర్వాత అవుట్‌డోర్‌ విభాగంలో భాగంగా.. డ్రిల్‌, అన్‌ఆర్మ్‌డ్‌ కంబాట్‌, వెపన్‌ ట్రైనింగ్‌ అండ్‌ ఫైరింగ్‌, 40 కిలోమీటర్ల లాంగ్‌ మార్చ్‌లో కొంత ఇబ్బందులు పడ్డా. కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల ఎంపిక మాదిరిగా ఐపీఎస్‌లకు ఫిజికల్‌ టెస్ట్‌లుండవు. శిక్షణలోనే అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది సవాల్‌తో కూడుకున్న పనే. 


వారం రోజులు అడవుల్లోనే... 

28 వారాల డిస్ట్రిక్ట్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌లో కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తెలంగాణ గ్రేహౌండ్స్‌ నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లోనూ శిక్షణ ఇచ్చింది. వారం రోజుల పాటు అడవుల్లోనే ఉన్నాం. అడవుల్లో పోలీసులు విధులు నిర్వర్తించడం ఎంత కష్టమో అప్పుడే తెలిసింది. ఐపీఎస్‌ కావాలని చాలామంది మహిళలు కలలు కంటున్నారు. ఇది శుభ పరిణామం. 


ఇష్టమైన సబ్జెక్ట్‌తో స్కోరింగ్‌... 

సివిల్‌ సర్వీసెస్‌లో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ను ఆప్షనల్‌గా తీసుకున్నా. ఇష్టమైన సబ్జెక్ట్‌ కావడంతో స్కోర్‌ ఎక్కువగా చేయగలిగాను. కొత్తగా సివిల్స్‌ పరీక్షలు రాసేవారు సులువైందని ఇష్టంలేని సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా తీసుకుంటారు. అలా చేయడంవల్ల విజయం సాధించలేరు. నాకు ఇంగ్లీష్‌ లిటరేచరంటే అమితమైన ఇష్టం. అందుకే భవిష్యత్‌లో విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే.. నవలలు రాయాలనేది నా ఆకాంక్ష.




నాన్న స్ఫూర్తితో... 

సికింద్రాబాద్‌లోని ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం మాది. సికింద్రాబాద్‌ ఆర్మీ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాను. మా నాన్న డాక్టర్‌ ఎస్‌ఎం పెరుమాళ్‌ ఉద్యోగ రీత్యా దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. కొన్ని ఆర్మీ స్కూళ్లకు ఆయన కల్నల్‌గా పనిచేశారు. 2009లో మా కుటుంబం అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉండేది. అప్పుడు నేను ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌. ‘తెంగా అంబులెన్స్‌ యూనిట్‌’ కమాండింగ్‌ ఆఫీసర్‌గా నాన్న పనిచేసేవారు. అప్పుడే ఉగ్రవాదుల దాడిలో మరణించారు.


కారులో ప్రయాణిస్తుండగా ఐఈడీ పేలి నాన్నతో పాటు డ్రైవర్‌ అశ్వనీకుమార్‌ దుర్మరణం చెందారు. అది మా కుటుంబానికి తీరని లోటు. కొన్ని రోజుల వరకు దాని నుంచి తేరుకోలేదు. అ సమయంలోనే సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలనే నిర్ణయానికొచ్చా. నాన్నలా దేశానికి సేవచేయాలంటే ఇదొక్కటే మార్గమని భావించా. పంజాబ్‌లో లా డిగ్రీ పూర్తి చేశాను. హైదరాబాద్‌లోని ‘నల్సార్‌ విశ్వవిద్యాలయం’లో ఎల్‌ఎల్‌ఎం అభ్యసించి.. సివిల్స్‌కు సన్నద్దమయ్యాను. రెండుసార్లు మెయిన్స్‌ వరకు వెళ్లా. మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూకు ఎంపికయ్యా. నాన్న ఇచ్చిన స్ఫూర్తితో విజయం సాధించి ఐపీఎస్‌ అయ్యాను. 


కరీంనగర్‌ కమిషనరేట్‌లో... 

శిక్షణ అనుకున్నంత సులువుగా ఏంలేదు. ఫిజికల్‌ ట్రైనింగ్‌ చాలా కష్టమనిపించింది. ముఖ్యంగా అవుట్‌డోర్‌ శిక్షణ. ఇన్‌డోర్‌ శిక్షణలో భాగంగా ఎవిడెన్స్‌ యాక్ట్‌, క్రిమినాలజీలో నాకు రెండు ట్రోఫీలు వచ్చాయి. న్యాయ విద్య అభ్యసించడంవల్లే ఇవి సాధించగలిగాను. పోలీసింగ్‌లో న్యాయవిద్య అభ్యసించిన వారు బ్రహ్మాండంగా రాణిస్తారు. 28 వారాల డిస్ట్రిక్ట్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కరీంనగర్‌ కమిషనరేట్‌లో చేశాను. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి కేసులు రిపోర్టు అవుతున్నాయి? వాటికి పరిష్కార మార్గాలేమిటి? అనేవి తెలుసుకున్నా.  ఈ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడుతుంది. 


ఆ కల నెరవేర్చుతా... 

పథకాలు ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ అధికారుల పాత్రే కీలకం. అందుకే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యా. ఐపీఎస్‌కు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఐపీఎస్‌ అంటే ఒక రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా సేవ చేసే అవకాశం లభిస్తుంది. భవిష్యత్‌లో మంచి పోలీస్‌ అధికారిగా పేరు సంపాదించి మా నాన్న కల నెరవేర్చుతా. 


ఇంటర్వ్యూలు: చల్లా యాకస్వామి



Updated Date - 2021-08-05T05:30:00+05:30 IST