Abn logo
Sep 26 2021 @ 02:06AM

విషజ్వరాలతో తేటుపురం విలవిల

చికిత్స పొందుతున్న గునిమిని వేణు

దృష్టిసారించని వైద్యారోగ్య సిబ్బంది

తేటుపురం(టంగుటూరు), సెప్టెంబరు 25 : మండలంలోని అనంతవరం పంచాయతీ పరిధిలోని తేటుపురం విషజ్వరాలతో విలవిలలాడుతోంది. రెక్కాడితేకాని డొక్కాడని ఊరి పేద రైతులు జ్వరాల బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నా పెద్దాసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక ఆర్‌ఎంపీలనే ఆశ్రయిస్తున్నారు. వైద్యంలో జాప్యం వల్ల కొందరికి ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. తీరా పరిస్థితి విషమిస్తున్న సమయంలో ఆర్‌ఎంపీలు చేతులెత్తగానే అప్పోసొప్పో చేసి ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. జ్వర పీడుతులలో అత్యఽధికులకు డెంగ్యూ లక్షణాల కనిపించడంతో వారు హడలిపోతున్నారు. ప్రస్తుతం సుమారు 15 మంది ఒంగోలులోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆర్‌ఎంపీల వద్ద 70 మంది వరకు వైద్యం అందుకుంటున్నారు. ఆర్‌ఎంపీల వద్దకు కూడా వెళ్లే డబ్బులు లేని వారు మందుల దుకాణాల్లో ఇచ్చే మందులతోనే కాలం గడుపుతున్నారు. అలాంటి వారు కూడా గ్రామంలో పదుల సంఖ్యలో ఉన్నారు. గ్రామంలోని పేదల ఆరోగ్య పరిస్దితులు ఇంత దారుణంగా ఉన్నా, ప్రభుత్వ ఆరోగ్యశాఖ వారు గ్రామంలోని జ్వరం బాధితులకోసం పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఊరిలో జ్వరం బారిన పడ్డ పిట్టు.వెంకటేశ్వర్లు గత వారంలో మృతిచెందడంతో భయకంపితులైన స్ధానికులు భయం భయంగా గడుపుతున్నారు

తేటుపురం నిండా కష్టజీవులే...   ఆకుకూరలు, కూరగాయాలు పండించమే గ్రామస్థుల ప్రధాన వృత్తి.  ఆకుకూరలను గంపల్లో నింపుకొని తెల్లవారక ముందే 3 గంటల ప్రాంతంలో ఇంటినుంచి బయలుదేరి బస్సుల్లో, ఆటోల్లో, కాలినడకన పొరుగు గ్రామాలకు వెళ్లి వ్యాపారం చేస్తారు. కరోనా మహమ్మారి విజృంబణతో వ్యాపారాలు సక్రమంగా చేసుకునే దారి లేక  అవీ సన్నగిల్లాయి. ఇతర ఆస్తిపాస్తులు లేని ఈ పేదలు వ్యాపారాలు జరగక, ఇతర పనులు లేక, పూట గడపడానికి నానా అగచాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జ్వరం ఊరిని చుట్టుముట్టడంతో వారు తీవ్రంగా కలత చెందుతున్నారు. పలువురు బాధితులు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొనేందుకు సరిపడ్డ డబ్బులు లేక నానా అగచాట్లు పడుతున్నారు. కొందరైతే జబ్బులను దాచుకొని కాలం గడుపుతున్నారు

ఉచిత సలహాలతో సరిపెట్టిన వైద్య సిబ్బంది

గ్రామంలో నెలరోజులుగా కొనసాగుతున్న ఈ పరిస్థితులను ఇటీవల ప్రభుత్వ వైద్య సిబ్బంది పరిశీలించారు. జ్వర బాధితులకు చికిత్స అన్న మాట ప్రక్కన పెట్టి స్ధానికులకు ఉచిత సలహాలిచ్చారు. ఇళ్లలో నీరు రోజుల కొద్ది నిల్వ ఉంచవద్దని, మురుగు కాలవల్లో నీరు ఉండకుడా జాగ్రత్త పడాలని తదితర సలహాలతో సరిపెట్టారు. తాత్కాలికంగా మందులిచ్చి వారి పనిని మమ అనిపించి వచ్చారు. దీంతో ప్రభుత్వ వైద్య సిబ్బంది వచ్చి కాపాడతారని అప్పటివరకు ఆశించిన గ్రామస్థులు నామమాత్రపు వైద్య సేవలతో ప్రభుత్వ వైద్యశాఖ మీదా నమ్మకం కోల్పోయారు. కచ్చితమైన వైద్య సేవలు అందించి తమను కాపాడాలని, గ్రామస్థులు కోరుతున్నారు. చికిత్స పొందుతున్న గునిమిని వేణు, ప్రణతి