ఉద్యోగాలు వదిలి.. సాగు బాట పట్టారు

ABN , First Publish Date - 2020-02-22T06:39:31+05:30 IST

మనదేశం వ్యవసాయ ఆధారిత దేశం. కానీ అగ్రికల్చర్‌ను కెరీర్‌గా ఎంచుకునే యువత చాలా తక్కువ. ఇందుకు భిన్నంగా లక్నోకు చెందిన శశాంక్‌, అభిషేక్‌లు సిరుల పంటలు పండిస్తున్నారు.

ఉద్యోగాలు వదిలి.. సాగు బాట పట్టారు

మనదేశం వ్యవసాయ ఆధారిత దేశం. కానీ అగ్రికల్చర్‌ను కెరీర్‌గా ఎంచుకునే యువత చాలా తక్కువ. ఇందుకు భిన్నంగా లక్నోకు చెందిన శశాంక్‌, అభిషేక్‌లు సిరుల పంటలు పండిస్తున్నారు. రైతులకు వ్యవసాయంలో  మెలకువలు నేర్పించి వారిని అగ్రిప్రెన్యూర్స్‌గా తయారు చేస్తున్నారు. కార్పొరేట్‌ ఉద్యోగాలకు వెళ్లకుండా పొలం బాట పట్టిన ఈ ఇద్దరు అన్నదమ్ముల సాగు సంగతులివి...


ఉపాధి, ఉద్యోగం కోసం యువత పట్టణాలకు వెళుతుంటే శశాంక్‌, అభిషేక్‌లు మాత్రం సొంతూరులోనే తమ కెరీర్‌ నిర్మించుకున్నారు. ఉన్నత చదువులు చదివిన ఈ అన్నదమ్ములు వ్యవసాయం వైపు అడుగులు వేయడం చాలా ఆశ్చర్యంగా జరిగింది. శశాంక్‌ ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నాడు. మోకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసిన అభిషేక్‌ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కానీ వీరిద్దరికి ఉద్యోగం బోర్‌ అనిపించింది. ఇద్దరూ వ్యవసాయం చేయాలనుకున్నారు. కానీ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వీరు ఉద్యోగం మానేసి పొలం బాట పట్టడం ఇంట్లో వాళ్లకు నచ్చలేదు. అయినా పట్టువీడక వారిని ఒప్పించారు శశాంక్‌, అభిషేక్‌లు. ‘‘మా మేనమామ అప్పటికే ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. ఆయన వద్దనే ఇద్దరం సాగు పాఠాలు నేర్చుకున్నాం. ఇంట్లో వాళ్లు ఒప్పుకున్న తరువాత నేను దేశం మొత్తం తిరిగి ఆధునిక వ్యవసాయం, సాంకేతికత గురించిన తాజా సమాచారం సేకరించా’’ అని గుర్తుచేసుకుంటారు శశాంక్‌.  


 ముందుగా శశాంక్‌, అభిషేక్‌లు ఒక రైతు నుంచి అయిదు ఎకరాల పొలం తీసుకొని అందులో క్యాప్సికమ్‌ పంట వేశారు. మొదటి సారి అనుకున్నంతగా పంట రాలేదు. మరుసటి పంటకు ఇంకా కష్టపడ్డారు. లాభాలు వచ్చాయి. దాంతో ఆధునిక పద్ధతులతో సాగులో లాభాల పంట పండించవచ్చని తెలుసుకున్నారు. అయిదేళ్ల తరువాత క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ వంటి రకాలు పండించడం మొదలెట్టారు. ఇప్పుడు 22 ఎకరాలు సాగు చేస్తూ ఏడాదికి 15 కోట్లు సంపాదిస్తున్నారు. 


రైతులకు ఆధునిక సాగు పాఠాలు

ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకునేందుకు ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టినప్పటకీ అనుకున్న ఫలితాలు రావడం లేదు. మిగతా రాష్ట్రాల రైతులతో పోల్చితే ఉత్తరప్రదేశ్‌లోని రైతులు వెనుకే ఉన్నారు. మనదేశంలో ఎక్కువ మందికి ఉపాధి లభించే ఏకైక రంగం వ్యవసాయమే. మనదగ్గర సారవంతమైన నేలలు, నీళ్లు, సాగు అనుకూల వాతావరణం ఉంది. కానీ నేలతల్లినే నమ్ముకొని సాగు చేస్తున్న రైతులకు లాభం తెచ్చిపెట్టేంతగా ఆధునిక పరికరాలు, పద్ధతుల వాడకం ఇక్కడ లేదు. ఈ లోటును భర్తీ చేసి, రైతుల్ని సాధికారులుగా చేసేందుకు 2011లో ‘అగ్రిప్లాంట్‌’ అనే సంస్థ ఏర్పాటు చేశారు శకాంక్‌, అభిషేక్‌లు.


‘‘మా సంస్థ ద్వారా రైతులకుఆధునిక పద్ధతులతో వ్యవసాయం చెయ్యడంలో శిక్షణ ఇస్తాం. దాంతో  ఎక్కువ దిగుబడులు సాఽధిస్తారు. ‘అగ్రిప్లాంట్‌’ లక్ష్యం ప్రతి గ్రామంలో విజయవంతమైన అగ్రిఎంటర్‌ప్రెన్యూర్స్‌ను తయారుచేయడం. ఎప్పుడైతే రైతుల్ని సాధికారులుగా చేస్తామో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది’’ అంటారు యువరైతు అభిషేక్‌. ఇప్పటి వరకూ అగ్రిప్లాంట్‌ సంస్థ 4,500 గ్రామీణ రైతులకు సాగు మెలకువల్లో శిక్షణ ఇచ్చింది. సుమారు పదివేల మంది రైతులు ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభపడుతున్నారు. తాము లాభాలు చూడడమే కాదు తోటి రైతులు సాగు సిరులు చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ఇద్దరూ నవతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.


మా సంస్థ ద్వారా ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చెయ్యడంలో రైతులకు శిక్షణ ఇస్తాం. దాంతో వారు ఎక్కువ దిగుబడులు సాఽధిస్తారు. ‘అగ్రిప్లాంట్‌’ లక్ష్యం ప్రతి గ్రామంలో విజయవంతమైన అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను తయారుచేయడం.


Updated Date - 2020-02-22T06:39:31+05:30 IST