ఈ పదార్థాలు కలకాలం నిక్షేపంగా వాడుకోవచ్చు

ABN , First Publish Date - 2022-07-21T17:36:52+05:30 IST

ఆహార పదార్థాలు కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో పాడయిపోతూ ఉంటాయి. కానీ కొన్ని పదార్థాలు

ఈ పదార్థాలు కలకాలం నిక్షేపంగా వాడుకోవచ్చు

ఆహార పదార్థాలు కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో పాడయిపోతూ ఉంటాయి. కానీ కొన్ని పదార్థాలు కలకాలం పాడయిపోకుండా ఉంటాయని మీకు తెలుసా? అలాంటి వాటిని నిల్వ చేసుకుని, నిక్షేపంగా వాడుకోవచ్చు. అవి ఇవే!


తెల్ల బియ్యం: పాలిష్‌ పట్టిన లేదా పాలిష్‌ పట్టని బియ్యం సరైన పరిస్థితుల్లో నిల్వ చేస్తే చాలా కాలం చెక్కుచెదరకుండా ఉంటాయి. వాటిలోని పోషకాలు కూడా నిర్వీర్యమవకుండా ఉంటాయి. ఇందుకోసం ఆ బియ్యాన్ని గాలి చొరబడని డబ్బాల్లో, 40 డిగ్రీల ఫారిన్‌హీట్‌ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాలి. అయితే గోధుమ బియ్యం ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఆరు నెలలకు మించి నిల్వ ఉండదు. ఇందుకు కారణం దాన్లో సహజసిద్ధ నూనెలు ఉండడమే!


తేనె: పూల నుంచి సేకరించిన మకరందంతో తేనెటీగల శరీరాల్లో ఉండే రసాయనాలు కలిసి, మకరందం రసాయన స్థితి మారుతుంది. ఇలా తయారయిన తేనె సింపుల్‌ సుగర్స్‌లా విడివడి, తేనె తుట్టె గదుల్లోకి చేరుతుంది. ఈ క్రమం మూలంగా తేనె ఎల్లకాలం చెక్కుచెదరకుండా ఉంటుంది. 

ఉప్పు: భూమిలోని సహజసిద్ధ ఖనిజలవణం రూపమే ‘సోడియం క్లోరైడ్‌’. కాబట్టే దీని నిల్వ కాలం ఎక్కువ. తేమను పీల్చుకునే గుణం ఉండడం మూలంగా ఉప్పును పదార్థాల నిల్వకు ఉపయోగించే ఆనవాయితీ పూర్వం నుంచి ఉంది. అయితే ఇదే గుణం ఆహారంలో ఉపయోగించే మెత్తని ఉప్పుకు ఉండదు. ఈ ఉప్పు తయారీలో భాగంగా జోడించే అయొడిన్‌ మూలంగా మెత్తని ఉప్పు నిల్వ సామర్ధ్యం తగ్గుతుంది. ఇలాంటి అయొడైజ్‌డ్‌ సాల్ట్‌ ఐదేళ్లకు మించి నిల్వ ఉండదు. 

చక్కెర: చక్కెర తయారీకి అనుసరించే పద్ధతి మీద చక్కెర నిల్వ కాలం ఆధారపడి ఉంటుంది. పలుకులుగా ఉన్న చక్కెర, మెత్తని చక్కెరలను తేమ లేని గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

కాచిన వెన్న: వెన్న లోని తేమ మొత్తం పోయేలా వేడి చేసి నిల్వ చేయాలి. కాచిన వెన్న లేదా నెయ్యిలను చల్లని ఉష్ణోగ్రత వద్ద, మూత బిగించిన సీసాల్లో నిల్వ చేస్తే కొన్ని నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటాయి. 

ఎండిన పప్పుధాన్యాలు: కందులు, మినుములు, చిక్కుడు గింజలు, సోయా, రాజ్మా మొదలైనవి తేమ లేకుండా, ఎండబెట్టి నిల్వ చేస్తే 30 ఏళ్ల పాటు పాడవకుండా ఉంటాయి. ఇంతకాలం నిల్వ ఉన్నా వాటిలోని మాంసకృత్తుల పరిమాణం ఏమాత్రం తగ్గదు. 

పాల పొడి: పాలు ఒక్క రోజులోనే విరిగిపోతాయి. కానీ పాల పొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాబట్టే దూర సరఫరాలకు, నిల్వకు పాల కంటే పాల పొడి అనువుగా ఉంటోంది.

వినెగర్‌: వెనిగర్‌కు ఉన్న క్షార గుణం వల్ల వినెగర్‌ పాడవకుండా ఉంటుంది. అయితే వైట్‌ వెనిగర్‌ పాడవకపోయినా, ఇతర యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌, వైన్‌ వెనిగర్‌ కాలంతోపాటు రంగు, రూపం మారిపోతాయి. అయినా ఈ వెనిగర్‌లు కూడా వాడుకోవడానికి వీలుగానే ఉంటాయి. 

Updated Date - 2022-07-21T17:36:52+05:30 IST