Covid వచ్చిపోయిన వారిలో ఈ అనారోగ్య సమస్యలు తగ్గట్లేదు.. సుదీర్ఘంగా వెంటాడుతున్నాయ్!

ABN , First Publish Date - 2021-08-23T12:38:37+05:30 IST

కొవిడ్‌ వచ్చిపోయిన తర్వాత కొందరిలో అనారోగ్య సమస్యలు తగ్గడం లేదు. తరచూ...

Covid వచ్చిపోయిన వారిలో ఈ అనారోగ్య సమస్యలు తగ్గట్లేదు.. సుదీర్ఘంగా వెంటాడుతున్నాయ్!

  • కరోనా తగ్గినా వదలని అనారోగ్యం
  • వెంటాడుతున్న శారీరక సమస్యలు
  • ఆయాసం.. నీరసం.. జ్వరం 
  • ఆస్పత్రుల చుట్టూ బాధితులు


హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌ వచ్చిపోయిన తర్వాత కొందరిలో అనారోగ్య సమస్యలు తగ్గడం లేదు. తరచూ జ్వరం, హై ఫీవర్‌, మరికొందరిలో లో ఫీవర్‌ రావడం, నాలుగు అడుగులు వేస్తే ఆయాస పడడం, నీరసంగా చతికిల పడడం.. వంటి ఆరోగ్య సమస్యలను వారం, పదిరోజులు కాదు.. నెలల తరబడి కొందరు ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌ వచ్చిపోయిన వారం నుంచి ఆరు నెలల వరకు ‘లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌’తో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఓపీ చికిత్సలతో ఆరోగ్యవంతులుగా మారుతుండగా, మరికొందరు నెలల తరబడి ఆస్పత్రులలో ఉండాల్సిన పరిస్థితి. 


ఆయాసం.. 

కొవిడ్‌ వచ్చి పోయిన తర్వాత చాలామంది ఆయాసంతో ఎక్కువ దూరం నడవలేకపోవడం, బలహీన పడడం, శరీరం వేడిగా ఉండి లోఫీవర్‌ వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇలాంటి కేసులు రోజుకు నాలుగు వరకు ఆస్పత్రులకు వస్తున్నాయి. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వారు పల్మనరీ ఫ్రైబోసిస్‌ ఇబ్బందులు పడుతున్నారు.  కొందరిలో కొవిడ్‌ తగ్గినప్పటికీ రెండు, మూడు నెలలవరకు ఆక్సిజన్‌ సపోర్టుతో ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి వారికి ఆక్సిజన్‌ స్థాయి 90 వరకు నిలకడగా ఉంచాల్సి ఉంటుంది. లేకపోతే వారు శ్వాసకోస ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి.


కండరాల నొప్పులు...

కొందరికి నెలల తరబడి కండరాల నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి. మరికొందరిలో బ్లట్‌ కాట్‌ వల్ల గుండె, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.  


మధుమేహంతో అవస్థలు..

కొవిడ్‌తో కొందరిలో మధుమేహంస్థాయి పెరుగుతుంది. చక్కెర స్థాయి నిల్వలు పెరగడం వల్ల అలాంటి వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. మరికొందరికి మధుమేహం లేకపోయినా, అకస్మాత్తుగా చక్కెర నిల్వలు పెరిగాయి. ఇలాంటి వారూ ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. 


ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగింది..

కరోనా కంటే ఇతర ఇబ్బందులతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కొవిడ్‌ తగ్గిన తర్వాత కొందరిలో లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌, బ్లడ్‌ క్లాట్స్‌, జాయింట్స్‌ పెయిన్స్‌, కండరాల బలహీనత, బ్రెయిన్‌ స్ట్రోక్‌, కేసులను చూస్తున్నాం. పోస్టు కొవిడ్‌ తర్వాత జబ్బులతో బాధపడే వారు రికవరీ అవుతున్నారు. కొందరే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. కొందరు నెలల తరబడి ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌, ఎక్మో వంటి చికిత్సలు పొందాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్న వారు ఆయాసంతో ఇబ్బంది పడుతున్నారు. - డాక్టర్‌ జగదీష్‌ కుమార్‌, సీనియర్‌ ఫిజీషియన్‌, డయాబెటలజిస్టు, మెడికవర్‌ ఆస్పత్రి


మైల్డ్‌ కొవిడ్‌ వచ్చిన వారిలో ఇబ్బందులు 

మైల్డ్‌ కొవిడ్‌ వచ్చిన వారిలో కొందరు లాంగ్‌కొవిడ్‌ సిండ్రోమ్‌తో ఇబ్బంది పడుతున్నారు. మైల్డ్‌ కొవిడ్‌ వచ్చి, తగ్గిన బాధితులు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ రోజుల జ్వరం, నిరంతరం దగ్గు, కండరాల నొప్పులు, తల వెంట్రుకలు రాలడం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం కనబడుతోంది. కొంతమందిలో తరుచూ జ్వరం రావడం, మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. వారిలో భావోద్వేగాలలో ఎగుడు దిగుళ్లు, ఆహారాభిరుచులలో మార్పులు, అధిక బరువు, మధుమేహం వంటివి కనిపిస్తాయి. డిప్రెషన్‌తోనూ ఇబ్బంది పడుతారు. లోగ్రేడ్‌ ఫీవర్‌తోనూ, తలనొప్పితోనూ అవస్థలు పడతారు. కొందరిలో మూడు నుంచి నాలుగు నెలల పాటు రుచి, వాసన ఉండదు. - డాక్టర్‌ విజయ్‌కుమార్‌ అగర్వాల్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌, స్టార్‌ ఆస్పత్రి.

Updated Date - 2021-08-23T12:38:37+05:30 IST