ఈ Food మార్పుతో చిన్నారుల ఆరోగ్యం పదిలం..

ABN , First Publish Date - 2022-01-31T16:36:51+05:30 IST

శీతగాలులు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి...

ఈ Food మార్పుతో చిన్నారుల ఆరోగ్యం పదిలం..

హైదరాబాద్‌ సిటీ : శీతగాలులు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ ప్రభావంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తున్నాయి. ఇక కరోనా కలకలం ఎలాగూ ఉంది. ఈ క్రమంలో చిన్నారుల రోగ నిరోధక శక్తి పెంపొందించే విషయంలో తల్లులు ఆందోళన చెందుతున్నారు. డైట్‌లో కొద్దిపాటి మార్పులు చేస్తే చిన్నారులకు రోగ నిరోధక శక్తి పరంగా  మేలు కలుగుతుందని న్యూట్రిషియనిస్ట్‌ సునీత పేర్కొంటున్నారు.


ఆకు కూరలు ఎక్కువ తినిపించాలి..

రోజూ ఆకు కూరలను డైట్‌లో భాగం చేయాలి. ఒకే తరహా ఆకు కూర అయితే ఇబ్బంది పడతారు. ఒక రోజు మెంతి కూర, మరో రోజు పాలకూర, ఇంకో రోజు తోట కూర, అలాగే ఉల్లిబొందు, పొన్నగంటి... ప్రతి ఒక్కటీ చిన్నారులకు మేలు చేస్తుంది. వీలైనంత ఎక్కువగా కూరగాయలను భాగం చేయాలి. నేరుగా వండితే తినరనుకుంటే సూప్స్‌, సలాడ్‌ల రూపంలో అందించడం మంచి మార్గం. 


జొన్నరొట్టెలూ..

మధుమేహులతో పాటుగా ఆరోగ్యాభిలాషులు ఎక్కువగానే ఈ జొన్న రొట్టెలు తింటున్నారు. పిల్లలకు కూడా ఈ రొట్టెలు తినిపించవచ్చు. జొన్న రొట్టెతో పాటుగా నెయ్యి, బెల్లం వంటివి జోడిస్తే ఐరన్‌ లాంటి పోషకాలు వారికి అందుతాయి.


సాధారణ నీళ్లకు బదులు..

రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలన్నది అందరికీ తెలిసిందే. తులసి ఆకులు, పుదీనా, జీర లాంటివి కూడా కలిపి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.


చిలకడదుంప..

చిలకడదుంప ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. సీజనల్‌ ఫుడ్‌గానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఇది చక్కటిమేలు చేస్తుంది. నేరుగా పిల్లలు తినరనుకుంటే టిక్కీలు, చాట్స్‌ రూపంలో కూడా అందించవచ్చు.


బాదంతో బలం

బాదములు ఆరోగ్యానికి మంచిది. వీటితో పాటుగా వేరుశెనగ, వాల్‌నట్స్‌ లాంటి  వాటితో ఆరోగ్యం సిద్ధిస్తుంది. చిన్నారుల ఎదుగుదలకు మాత్రమే కాదు, వారిలో రోగ నిరోధక శక్తి మెరుగుపడటానికీ దోహదం చేస్తాయి.


పసుపు పాలు

ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తి పెంచడంలో ఉత్తమ పదార్థం పసుపు. పాలలో ఓ చిటికెడు పసుపు కలిపి ఇస్తే వారికి నిద్ర మంచిగా పట్టడంతో పాటుగా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. పసుపు కాకుండా అల్లం రసం లేదంటే అల్లంమురబ్బా తినిపించినా మంచిదే.

Updated Date - 2022-01-31T16:36:51+05:30 IST